మీరు ప్రతిపక్ష నేతలా.. పాకిస్థాన్ నేతలా?

Update: 2016-10-05 07:58 GMT
సర్జికల్ స్ట్రయిక్సుతో పాకిస్థాన్ కు ముచ్చెమటలు పట్టించి అంతర్జాతీయంగా ఒంటరిని చేసిన ఎన్డీయే ప్రభుత్వానికి తొలుత బాసటగా నిలిచిన మన ప్రతిపక్ష నేతలు ఆ తరువాత ఆ దాడుల వీడియోలు విడుదల చేయాలన్న డిమాండ్ తో ప్రభుత్వంపై దాడి తీవ్రతరం చేస్తున్న సంగతి తెలిసిందే. పాక్ పై దాడి చేసిన ఊపులో ఉన్న కేంద్రం ఈ విపక్ష దాడులనూ అంతే మెరుపువేగంతో తిప్పకొడుతోంది. తాజాగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు విపక్ష నాయకులకు గట్టి సమాధానం చెప్పారు.  సర్జికల్ స్ట్రయిక్‌  వీడియోలు విడుదల చేయాలన్న ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు చిదంబరం - సంజయ్ నిరుపమ్‌ లకు వెంకయ్య కౌంటరేశారు. దాడి వీడియోలు విడుదల చేయాలనే డిమాండ్లు ఏమాత్రం పట్టించుకోబోమని ప్రకటించేశారు. అంతేకాదు... విపక్ష నేతలు పాకిస్తాన్ వాళ్లలా మాట్లాడుతున్నారంటూ వారిని డిఫెన్సులో పడేశారు. తాము ఎవరితోను యుద్ధం కోరుకోవడం లేదని, అయితే... రెచ్చగొడితే మాత్రం పని పడతామని అన్నారు. మన సైన్యం చేసిన సర్జికల్ స్ట్రయిక్సు అందుకు ఉదాహరణ అని చెబుతూ విపక్షాలకూ అలాంటి సమాధానమే చెబుతామన్నట్లుగా పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు.  సైన్యంతో రాజకీయాలు చేయొద్దంటూ మండిపడ్డారు.

మరోవైపు మన సైన్యం మాత్రం సర్జికల్ స్ట్రైక్ వీడియోలు రిలీజ్ చేయడానికి మేం రెడీ అంటోంది.  ఆ వీడియోలు బయటపెడితే పాకిస్థాన్ నోరు కూడా మూతపడుతుందంటూ సైనిక వర్గాలు అంటున్నాయి. వీడియోలు రిలీజ్ చేస్తే విపక్షాల అనుమానాలు - పాక్ అసత్యాలు రెండూ ఒక్క దెబ్బకు బంద్ అవుతాయన్నది ఆర్మీ అభిప్రాయం. అందుకే.. వీడియోలు రిలీజ్ చేయడానికి తాము రెడీ అని పచ్చజెండా ఊపేశాయి. అయితే.. ప్రధాని మోడీ నిర్ణయం మేరకే వాటి విడుదల ఉంటుందని స్పష్టం చేశాయి.

మరోవైపు వీడియోలు విడుదల చేయాలన్న విపక్ష నేతల డిమాండుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. సైనిక చర్యలకు సంబంధించిన వీడియోలను ఆధారాలుగా ప్రకటించడమన్నది ఇంతవరకు ఎన్నడూ లేకపోవడంతో కేంద్రం అందుకు నో అంటోంది.  సర్జికల్ స్ట్రైక్ ఆపరేషన్ మొత్తం డ్రోన్ల సహాయంతో రికార్డు చేయడం వాస్తవమే అయినా వాటిని విడుదల చేయడం సంప్రదాయం కాకపోవడంతో కేంద్రం అందుకు అంగీకరించడం లేదు. సైన్యంతో పాటు వాయుసేన అధిపతి కూడా దాడులను ధ్రువీకరించిన తరువాత ఇంకా అనుమానాలు ఎందుకన్న భావన ప్రజల్లోనూ ఉండడంతో విపక్షాల మాటలకు కేంద్రం తలొగ్గడం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News