వెంకయ్యకు చేతనైతే మోడీతో లేఖ రాయించాలి!

Update: 2016-09-03 14:06 GMT
ఏ రోటి కాడ ఆ పాట పాడడం మన రాజకీయ నాయకులకు అలవాటే. అలాంటి చిన్నెలు ప్రదర్శించడంలో మన రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చాలా ఉద్ధండులని జనం అనుకుంటూ ఉంటారు. వెంకయ్య ఇప్పుడు అదే పనిచేస్తున్నారు. హైదరాబాదులో తిరంగాయాత్రలో పాల్గొనడానికి వచ్చిన ఆయన , వచ్చిన పని చూసుకుని పోకుండా, సెప్టెంబరు 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం గురించి కాస్త చిచ్చు రగిలించే ప్రయత్నం చేశారని జనం అనుకుంటున్నారు.

ఎలాగంటే.. సెప్టెంబరు 17న తెలంగాణ విలీన దినోత్సవాన్ని, విమోచన దినోత్సవంగా అధికారికంగా ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని భాజపా చాలా సంవత్సరాలుగా అడుగుతోంది. అయితే మతాలతో ముడిపడిన సమస్య గనుక.. ప్రభుత్వాలు ఎప్పుడూ పట్టించుకోవు. కాపోతే.. ఈసారి వెంకయ్యనాయుడు కూడా అదే డిమాండు వినిపించారు. కేసీఆర్‌ ను తాను కోరుతున్నానని.. అధికారికంగా నిర్వహించాలని అన్నారు.

అయితే జనం అంటున్నదేంటంటే.. ఏదో సభలోకి వచ్చారు గనుక.. నాలుగు మాటలు మాట్లాడేసి వెళ్లిపోవడం కాదు.. నిజంగానే తెలంగాణ విమోచన దినోత్సవం మీద వెంకయ్యనాయుడుకు అంత గౌరవం - అభిప్రాయం ఉంటే గనుక.. దాన్ని అధికారికంగా నిర్వహింపజేయడం గురించి మోడీ ద్వారా కేసీఆర్‌కు ఒక లేఖ రాయించాలని జనం అడుగుతున్నారు. రాష్ట్ర భాజపా శాఖలు కొన్నేళ్లుగా ఏ సర్కారూ పట్టించుకోలేదు. అలాంటి నేపథ్యంలో.. ప్రస్తుతం కేంద్రంతో సత్సంబంధాలకు చూస్తున్న కేసీఆర్‌, ఏకంగా మోడీ అడిగితే కాదనకపోవచ్చు అని.. వెంకయ్యకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. ఈ విషయంలో మోడీతో లేఖ రాయించాలని అడుగుతున్నారు.
Tags:    

Similar News