రాస్కోండిః కేంద్రప్ర‌భుత్వం అంటే వెంక‌య్యే!

Update: 2017-05-21 04:49 GMT
మాట‌ల మాంత్రికుడు అయిన‌ బీజేపీ అగ్ర‌నేత‌ - కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి ఎం వెంకయ్యనాయుడు త‌మ ప్ర‌భుత్వం తాలుకూ మంచి ప‌నుల‌ను ఢంకా భ‌జాయించి మ‌రీ చెప్ప‌డంలో ముందుంటారు. త‌న‌దైన శైలిలో విశ్లేష‌ణ‌లు చేయ‌డం, విశేషాలు వివ‌రించ‌డం, వివ‌ర‌ణ‌లు ఇస్తూ ప్రధాన‌మంత్రి న‌రేంద్ర మోడీని, కేంద్ర ప్ర‌భుత్వాన్ని వెంక‌య్య‌నాయుడు ఆకాశానికి ఎత్తేస్తుంటారు. అయితే ఇలాంటివి ఇప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన విష‌యంలో వెంక‌య్య మాట్లాడేవారు. అయితే తాజాగా వెంక‌య్య స్టాండ్ మార్చుకుంటున్న‌ట్లు క‌నిపిస్తోంది. జ‌ర‌గబోయే అంశం గురించి కూడా వెంక‌య్య మాట్లాడుతూ తానే కేంద్ర ప్ర‌భుత్వం....కేంద్ర ప్ర‌భుత్వ‌మే తాను అన్న‌ట్లుగా మాట్లాడ‌ర‌ని చ‌ర్చ జ‌రుగుతోంది. ఇంత‌కీ ఇదంతా దేని గురించి అంటే...ట్రిపుల్ తలాఖ్  విష‌యంలో.

ఐక్యరాజ్య సమితి ఆవాస మండలి చైర్మన్‌ గా ఎన్నికయిన సందర్భంగా అమ‌రావ‌తిలో వెంకయ్యను పలు సంఘాలు సన్మానించాయి. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ ‘ట్రిపుల్ తలాక్ సమస్యను పరిష్కరించాల్సింది సమాజమే. ముస్లిం సమాజం ఈ దురాచారాన్ని మారిస్తే మంచిదే. లేనిపక్షంలో ప్రభుత్వమే ట్రిపుల్ తలాక్‌ ను నిషేధిస్తూ చట్టాన్ని తీసుకొస్తుంది’ అని ముంద‌స్తు ప్ర‌క‌ట‌న చేసేశారు. ఇప్ప‌టివ‌ర‌కు కేంద్ర మంత్రులు కానీ, సాక్షాత్తు ప్ర‌ధాన‌మంత్రి కానీ త‌లాఖ్ విష‌యంలో చ‌ట్టం తీసుకువ‌స్తామ‌ని చెప్ప‌క‌పోయిన‌ప్ప‌టికీ,వెంక‌య్య స్వ‌యంగా ఆ ప్ర‌క‌ట‌న చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. కాగా..త‌లాఖ్ విష‌యంలో కేంద్రం ముందడుగు ఏ ఒక్కరి వ్యక్తిగత విషయంలో జోక్యం చేసుకోవడం కాదని, ఇది మహిళల న్యాయానికి సంబంధించిన విషయమన్నారు. గతంలో బాల్య వివాహాలు, సతీ సహగమనం లాంటి హిందూ సమాజంలో పాతుకుపోయిన దురాచారాలను అంతం చేయడానికి చట్టాలు చేసిన విషయాన్ని వెంక‌య్య‌నాయుడు గుర్తు చేశారు. హిందూ సమాజం ఈ దురాచారాలపై చర్చించి వాటిని నిషేధిస్తూ చట్టాలు చేసిందన్నారు. అలాగే వరకట్న నిషేధ చట్టాన్ని చేశారని, హిందూ సమాజం దాన్ని స్వాగతించిందని వెంకయ్య గుర్తు చేశారు. ‘ఇలాంటి ఆచారాలు సమాజానికి మంచివి కావని భావించిన ప్రతి సందర్భాల్లోను హిందూ సమాజం వాటిపై చర్చించి సంస్కరణలు తీసుకొచ్చింది. మరికొన్ని సంస్కరణలు కూడా అవసరముంది, ఆ దిశగా కృషి చేయాలి’ అన్నారు. ‘మనుషులను మనుషులుగా చూడాలి. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అంటూ వారిని వేరు చేయడానికి వీల్లేదు. అలాంటి వివక్ష వల్ల మహిళలకు ఎలాంటి న్యాయమూ జరగదు’ అని వెంకయ్య స్పష్టం చేశారు.

ఈ సంద‌ర్భంగా దేశం గురించి వెంక‌య్య నాయుడు విశ్లేషించారు.  భారత దేశాన్ని ప్రపంచ దేశాలు గుర్తించిన ప్రతిసారీ తనకు సంతోషం కలుగుతుందని అన్నారు. ‘కులభూషణ్ జాధవ్ కేసునే తీసుకోండి. చరిత్రలో మొట్టమొదటిసారి మన దేశం అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్లి జాధవ్‌ ను ఉరి తీయడానికి పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాలపై స్టే తీసుకొచ్చింది. అందరూ సంతోషించదగ్గ విషయం ఇది’ అన్నారు. తన సుదీర్ఘ రాజకీయ కెరీర్‌ను ప్రస్తావిస్తూ, నరేంద్ర మోడీ పదేళ్ల పాటు ప్రధానిగా ఉండాలన్న ఒకే ఒక కోరిక మిగిలి పోయిందన్నారు. మోడీ పదేళ్ల పాటు ప్రధానిగా ఉంటే మన దేశం ప్రపంచంలో మరింత బలమైన దేశంగా తయారవుతుందని వెంక‌య్య నాయుడు ఈ సంద‌ర్భంగా ధీమా వ్య‌క్తం చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News