తెలంగాణను చూసి ఏపీ నేర్చుకోవాలన్న వెంకయ్య!

Update: 2016-08-20 04:40 GMT
కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అంటే.. ఆయన నెల్లూరు జిల్లాకు చెందిన వాడు గనుక.. ఆంద్రప్రదేశ్‌ కు చెందిన వారని , ఆ రాష్ట్రం పట్ల కాస్త పక్షపాత ధోరణితో ఉంటారని కొన్ని వాదనలు వినిపిస్తుంటాయి. అయితే ఆయన మాత్రం తనకు తెలుగు రాష్ట్రాలతోనే సంబంధంలేదు.. ఎక్కడినుంచో ఎంపీ అవుతున్నా.. అంటూ బాధ్యత తీసుకోకుండా మాట్లాడుతుంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా.. చంద్రబాబును - వెంకయ్యను కలిపి ఆ ఇద్దరు నాయుళ్లు కుమ్మక్కయి తెలంగాణకు ద్రోహం చేస్తున్నారని చాలాసార్లు విమర్శించారు. ఇలాంటి వాదనలు ఎలా ఉన్నప్పటికీ.. తాజగా ఓ విషయంలో మాత్రం తెలంగాణ ను చూసి ఏపీ సర్కారు నేర్చుకోవాల్సి ఉన్నదని.. వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించడం విశేషం.

స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా హైదరాబాదులో 'త్యాగాలను స్మరిద్దాం' అంటూ ఓ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. చిత్ర  - పుస్తక ప్రదర్శన ఇక్కడ పెట్టారు. స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తి ఇప్పటి తరాల వారికి తెలిసేలా ఈ ప్రదర్శన ఏర్పాటుచేశారు. దానిని ప్రారంభించిన వెంకయ్యనాయుడు... ఇలాంటి అద్భుతమైన ప్రదర్శనను ఆంధ్రప్రదేశ్‌ లో కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. స్వాతంత్య్ర స్ఫూర్తిని ప్రజల్లో నింపేందుకు కేంద్రం తిరంగా యాత్రను నిర్వహిస్తోంది. ముందు ఢిల్లీలో ఈ ప్రదర్శన చూసి.. ఆయన కోరడంతో హైదరాబాదులో ఏర్పాటు చేశారుట.

మరి ఆంధ్రప్రదేశ్‌ లో ఏర్పాటుచేసేది ఎవ్వరు? అయినా.. అయినా పదుగురికీ కాంట్రాక్టులు ఇచ్చి ఓ వంద కోట్లయినా ఖర్చు పెట్టడానికి ఆస్కారం ఉండే పనులు తప్ప.. ప్రజలకు జ్ఞానం పెంచే ఇలాంటి 'సిల్లీ' పనుల మీద చంద్రబాబునాయుడు ప్రభుత్వం అసలు ఆసక్తి చూపిస్తుందా.. అని పలువురు సందేహిస్తున్నారు.

మరోవైపు ఢిల్లీలో ప్రదర్శన చూసి నచ్చిన వెంటనే వెంకయ్యనాయుడు తన తొలిప్రాధాన్యం కింద హైదరాబాదులో అలాంటి ప్రదర్శన పెట్టించారే తప్ప.. ఏపీ వైపు చూడలేదు. కేసీఆర్‌ కు మోడీ దగ్గరవుతున్నారనే పుకార్లు ప్రచారంలో ఉన్న వేళ.. ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా పట్టించుకోవాల్సినవేనా? అని కూడా కొందరు సందేహిస్తున్నారు.
Tags:    

Similar News