రాజ్య‌స‌భ ఎంపీల‌ను బుజ్జ‌గించిన‌ వెంక‌య్య!

Update: 2018-03-05 13:18 GMT
నేడు ప్రారంభ‌మైన పార్ల‌మెంట‌రీ బ‌డ్జెట్ స‌మావేశాలు రసాభాస‌గా మారాయి. ఏపీ విభజన హామీల అమలుపై కేంద్రం నిర్ల‌క్ష్య వైఖ‌రికి నిర‌స‌న‌గా లోక్ స‌భ‌, రాజ్య‌స‌భ‌లో ఎంపీలు ప్ల‌కార్డులు ప‌ట్టుకొని నిర‌స‌న వ్య‌క్తం చేశారు. రాజ్య‌స‌భ‌లో ఎంపీల నిర‌సన తార‌స్థాయికి చేరింది. రాజ్యసభలో ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని వెల్ లోకి దూసుకెళ్లి గంద‌ర‌గోళం సృష్టించారు. వారంతా సభ‌ను స‌జావుగా సాగ‌నీయ‌కుండా స‌భా కార్యకలాపాలకు ఆటంకం కలిగించారు. గ‌త స‌మావేశాల్లో నిర‌స‌న వ్య‌క్తం చేస్తోన్న ఎంపీల‌నుద్దేశించి కొద్దిగా ఆవేశ‌పూరితంగా వ్య‌వ‌హ‌రించిన రాజ్య‌స‌భ స్పీక‌ర్ -  ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ సారి త‌నదైన శైలిలో సభను స‌జావుగా న‌డ‌ప‌డంలో స‌ఫ‌ల‌మ‌య్యారు. వాయిదా తీర్మానంపై వెంటనే చర్చ జ‌ర‌పాల‌ని టీడీపీ సభ్యులు పట్టుబట్టి వెల్ లోకి దూసుకువ‌చ్చారు. ఆ స‌మ‌యంలో వెంక‌య్య తన స్థానం నుంచి లేచి నిలుచొని... సభా సంప్రదాయాలను గౌరవించాలని వారిని కోరారు. తానో కీల‌క‌మైన ప్రకటన చేయబోతున్నాన‌ని, అది వినేందుకు సభ్యులు తమ తమ స్థానాల్లో కూర్చోవాలని విజ్ఞ‌ప్తి చేశారు.

వెంక‌య్య మాట‌ను పెడ చెవిన పెట్టిన స‌భ్యులు వెల్ ను ఎవరూ ఖాళీ చేయ‌కుండా అక్క‌డే ఉండిపోయారు. తన ప్రకటన పూర్తయ్యేంత వరకు సంయ‌మ‌నం పాటించాల‌ని, వేర్వేరు సభ్యులకు చెందిన వేర్వేరు నోటీసులను స‌భ‌ దృష్టికి తీసుకువ‌చ్చేందుకు స‌హ‌క‌రించాల‌ని కోరారు. త‌న ప్ర‌క‌ట‌న న‌చ్చ‌నిప‌క్ష్యంలో నిరసనను కొనసాగించ వచ్చని టీడీపీ ఎంపీల‌కు సూచించారు. "ప్లీజ్ తెలుగుదేశం ఆల్సో... హలో... వెంకటేష్ - మోహన్ రావ్ - మేడమ్ ప్లీజ్... రామచంద్రరావు మీ స్థానాల్లోకి కాసేపు వెళ్లండి. కేవలం కొద్దిసేపే. కాసేపు వెనక్కు వెళ్లండి. కాసేపే..." అని వెంక‌య్య త‌న‌దైన శైలిలో బుజ్జగించడంతో టీడీపీ సభ్యులు - కేవీపీ తమ త‌మ స్థానాల్లోకి వెళ్ల‌క త‌ప్ప‌లేదు. అంతేకాదు, త‌మ స్థానాల్లో కూర్చోన్న త‌ర్వాత కూడా ఎవ‌రూ గొడవ చేయ‌కూడ‌ద‌ని కూడా విజ్ఞ‌ప్తి చేశారు. ఆ త‌ర్వాత కొద్ది సేప‌టికే స‌భ వాయిదా ప‌డింది. స‌భ పునః ప్రారంభమైన తర్వాత కూడా గంద‌ర‌గోళ  పరిస్థితి కొన‌సాగింది. డిప్యూటీ ఛైర్మన్ కురియన్....స‌భ్యులకు న‌చ్చ‌చెప్పే ప్రయత్నం చేసినా ఫ‌లితం లేక‌పోయింది. ఏపీ ఎంపీలు పోడియంను చుట్టుముట్ట‌డంతో సభా కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది. దీంతో, సభను రేపటి (మంగళవారం)కి వాయిదా వేశారు.
Tags:    

Similar News