వెరిజాన్‌ లో..ఉద్యోగుల రాజీనామాల కోసం బౌన్స‌ర్లు!

Update: 2017-12-14 05:19 GMT
ప్ర‌ముఖ ఐటీ సంస్థ వెరిజాన్ వ్య‌వ‌హారం ఇప్పుడు సంచ‌ల‌నం సృష్టిస్తోంది. గ‌డిచిన రెండు రోజులుగా ఈ సంస్థ‌లో ప‌ని చేస్తున్న ఉద్యోగుల్లో కొంద‌రిని బ‌ల‌వంతంగా రాజీనామాలు చేయిస్తున్న వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మార‌ట‌మే కాదు.. వివాదాస్పదమైంది.  న‌చ్చ‌ని ఉద్యోగుల‌కు పింక్ స్లిప్ చేతిలో పెట్టి పొమ్మ‌న‌టం అమెరికాలో మామూలే. దీనికి భిన్నంగా.. మ‌రింత దారుణంగా వ్య‌వ‌హ‌రిస్తోన్న వైనం క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేస్తోంది.

కేవ‌లం రెండు రోజుల వ్య‌వ‌ధిలో దాదాపు 250 నుంచి 300 మంది ఐటీ ఉద్యోగుల్ని ఈ సంస్థ తొల‌గించిన‌ట్లుగా చెబుతున్నారు. ఉద్యోగి చేత రాజీనామా చేయించేందుకు బౌన్స‌ర్ల‌ను వినియోగిస్తున్న‌ట్లుగా ఈ కంపెనీ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఉద్యోగంలో నుంచి తొల‌గించాల‌నుకున్న ఉద్యోగుల్ని హెచ్ ఆర్ విభాగం వారు పిలిపించ‌టం.. ఐదు నిమిషాల వ్య‌వ‌ధిలో ఉద్యోగానికి  రాజీనామా చేయాల‌ని  ఆదేశిస్తున్నార‌ని.. చేయ‌మ‌న్న వారిని బౌన్స‌ర్ల చేత బ‌ల‌ప్ర‌యోగం చేయించి రాజీనామా ప‌త్రం మీద సంత‌కం చేయిస్తున్న‌ట్లుగా బాధితులు చెబుతున్నారు.

రాజీనామా కోసం పిలిపించిన స‌మ‌యంలో క్యాబిన్ లో సైక్రియాటిస్ట్‌.. బౌన్స‌ర్ల‌ను ముంద‌స్తుగా ఉంచుతున్నార‌ని.. ఉద్యోగి ఏ మాత్రం కంపెనీ చెప్పినట్లు చేయ‌కుంటే.. ముందుగా వారికి కౌన్సెలింగ్ నిర్వ‌హిస్తున్నార‌ని.. అప్ప‌టికి నో అన్న ఉద్యోగిపై బౌన్స‌ర్ల‌ను ప్ర‌యోగిస్తున్న‌ట్లుగా బాధిత ఉద్యోగి ఒక‌రు ప్ర‌ముఖ మీడియా సంస్థ‌కు వెల్ల‌డించిన‌ట్లు ప్ర‌క‌టించింది.

ఏళ్ల త‌ర‌బ‌డి కంపెనీలో ప‌ని చేసిన ఉద్యోగుల ప‌ట్ల అత్యంత అమాన‌వీయంగా వెరిజాన్ కంపెనీ వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని.. కంపెనీ కోరిన‌ట్లు రాజీనామా చేయ‌ని వారిపై భౌతికంగా బ‌ల‌ప్ర‌యోగం చేసి మ‌రీ తొల‌గిస్తున్న వైనంపై బాధిత ఉద్యోగులు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. త‌న కంపెనీలో ఉద్యోగుల్ని తొల‌గించే విష‌యంలో ఒక్క హైద‌రాబాద్ లోనే కాదు.. చెన్నైలోనూ ఇదే రీతిలో వెరిజాన్ వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్న మాట వినిపిస్తోంది.


Tags:    

Similar News