ఐటీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన వెరిజాన్‌

Update: 2018-01-05 08:34 GMT
ఐటీ ఉద్యోగి అంటే అసూయ ఉండేది ఒక‌ప్పుడు. కానీ.. కాలం మారింది. ఐదంకెల జీతాలంటూ ఊరింపే  కానీ.. అక్క‌డ ఉండే టెన్ష‌న్లు.. పీక మీద క‌త్తి పెట్టిన‌ట్లుగా.. డెడ్ లైన్ల ఒత్తిడితో పోలిస్తే.. నాలుగు రూపాయిలు త‌క్కువైనా త‌మ ఉద్యోగాలే బెట‌ర్ అనుకునే ప‌రిస్థితి కొంద‌రిది.

ఇదిలాఉంటే.. ఆటోమేష‌న్ బూచిని చూపించి భ‌య‌పెట్టేస్తున్న వైనం ఇప్పుడు ఐటీ కంపెనీల్లోక‌నిపిస్తోంది. కాస్ట్ క‌టింగ్ తో పాటు.. సంప్ర‌దాయ కంపెనీలు  ఏ తీరులో అయితే ఉద్యోగుల‌కు చుక్క‌లు చూపిస్తుంటాయో.. ఇప్పుడు అలాంటి ద‌రిద్ర‌పుగొట్టు అల‌వాట్లను చాలా ఐటీ కంపెనీలు చేసుకుంటున్నాయ‌ని చెబుతున్నారు.

కంపెనీకి మేలు క‌లిగించేందుకే నియ‌మించే సీనియ‌ర్ అధికారులు స‌రికొత్త‌గా యాక్ట్ చేయ‌టంతో ఐటీ ఉద్యోగాలు కొన్ని నెల‌లుగా మ‌హా ఇబ్బందిక‌రంగా మారాయి. ఎప్పుడు ఎలాంటి ఉత్సాతం మీద ప‌డుతుందో తెలీని అయోమ‌య ప‌రిస్థితినెల‌కొంది. ఇదిలాఉంటే.. కొద్దిరోజుల క్రితం అంత‌ర్జాతీయంగా పేరున్న వెరిజాన్ కంపెనీకి చెందిన ఇండియా విభాగంగా చెప్పే వెరిజాన్ డాటా స‌ర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో చోటు చేసుకున్న ప‌రిణామాలు ఐటీ వ‌ర్గాల్లో షాకింగ్ గా మారాయి.  

గ‌త నెల రెండో వారంలో వెరిజాన్ కంపెనీకి చెందిన ఉద్యోగుల్లో ఎంపిక చేసిన కొంద‌రిని  ఒక్కొక్కరిగా రూమ్ లోకి పిలిపించి త‌మ ఉద్యోగాల‌కు రాజీనామా చేయాలంటూ పేప‌ర్ల మీద సంక‌తాల కోసం ఒత్తిడి చేసిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దీనిపై ప‌లు విధాలుగా పోరాడిన ఉద్యోగులు కొందరు ఒక బృందంగా ఏర్ప‌డి న్యాయం కోసం పోరాడుతున్నారు.

బౌన్స‌ర్ల‌ను పెట్టి బ‌ల‌వంతంగా రాజీనామా ప‌త్రాల మీద సంత‌కాలు చేశార‌ని వారు చెబుతున్నారు. త‌మ‌కు జ‌రిగిన అన్యాయం మీద ఇప్ప‌టికే ప‌లుమార్లు కార్మిక శాఖ  కార్యాల‌యాల చుట్టూ తిరిగిన ఉద్యోగులు.. ఇప్పుడు పోలీసుల్ని ఆశ్రయించారు. త‌మ‌కు జ‌రిగిన అన్యాయం పై వారు గొంతు విప్పారు.

త‌మ‌ను రాజీనామా చేయాల‌ని ఒత్తిడి చేసిన ఉద్యోగులు కొంద‌రు త‌మ‌కు ఇష్టం లేద‌ని చెప్పి బ‌య‌ట‌కు వ‌స్తుంటే.. అక్క‌డ ఏర్పాటు చేసిన బౌన్స‌ర్ల చేత  త‌మ‌ను క‌ద‌ల‌నీయ‌కుండా చేసి సంత‌కాలు పెట్టించుకున్నార‌న్నారు. మాన‌సికంగా.. భౌతికంగా హింసించి రాజీనామా చేయించుకున్నార‌ని.. త‌మ‌కు తాముగా రాజీనామాలు చేయ‌లేద‌ని వారు వాపోతున్నారు. బ‌ల‌వంతంగా సంత‌కాలు చేయించిన త‌ర్వాత ఆఫీసుల్లో నుంచి బ‌య‌ట‌కు గెంటేశార‌ని. . త‌మ సొంత వ‌స్తువుల్ని సైతం తీసుకునే అవ‌కాశం ఇవ్వ‌లేద‌ని పోలీసుల‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

పేరున్న కంపెనీలో ఐటీ ఉద్యోగుల‌కు ఎదురైన ఈ చేదు అనుభ‌వం ఐటీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. హైద‌రాబాద్ లోనే కాదు.. చెన్నైలోని ఆఫీసుల్లోనూ ఇలాంటి ప‌రిస్థితే ఉంద‌ని.. మొత్తంగా 1200ల‌కు పైనే ఉద్యోగుల్ని బ‌లంతంగా సంస్థ నుంచి తొల‌గించిన‌ట్లుగా చెబుతున్నారు. ఐటీ ఉద్యోగులు ఇచ్చిన ఫిర్యాదును స్వీక‌రించిన మాదాపూర్ పోలీసులు.. ఈ కేసును విచారిస్తున్నారు.
Tags:    

Similar News