మేడారంలో వెంక‌య్య తులాభారం!

Update: 2018-02-02 08:27 GMT
తెలంగాణలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే మేడారం జాత‌ర అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. వనదేవతల దర్శనానికి వేలాదిగా త‌ర‌లి వ‌స్తున్న‌ భక్తుల‌తో ఆ ప్రాంగ‌ణం జనసంద్రమైంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరైన సమ్మక్క సారలమ్మ జాతరలో సామాన్యుల నుంచి సెల‌బ్రిటీలు, రాజ‌కీయ నాయ‌కుల వ‌ర‌కు మొక్కులు తీర్చుకొనేందుకు క్యూ క‌డుతున్నారు. ఈ ప్ర‌తిష్టాత్మ‌క జాత‌ర‌లో ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు  పాల్గొన్నారు. మొక్కు తీర్చుకున్నారు. శుక్రవారం ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఏపీలోని గన్నవరం విమానాశ్రయానికి వ‌చ్చిన వెంక‌య్య‌...అక్కడి నుంచి హెలికాప్టర్ లో మేడారం వ‌చ్చారు. మొక్కు లో భాగంగా నిలవెత్తు బంగారాన్ని(బెల్లం) తులాభారం ద్వారా వన దేవతలకు సమర్పించారు. ఈ సంద‌ర్భంగా మీడియాతో వెంక‌య్య మాట్లాడారు. ఈ జాతరను ఆదివాసి కుంభమేళాగా పేర్కొన్నారు.

మ‌రోవైపు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కూడా శుక్ర‌వారం నాడు మేడారం జాతరకు రానున్నారు. శుక్రవారం 1.45 గంటలకు సమ్మక్క సారలమ్మ గద్దెల వద్దకు కేసీఆర్ వెళతారు. 1.50 గంటల నుంచి 2గంటల వరకు తల్లులకు ప్రత్యేక పూజలు నిర్వ‌హిస్తారు. తులాభారం తూగి నిలువెత్తు బెల్లాన్ని స‌మ‌ర్పించి త‌న మొక్కు చెల్లించుకోనున్నారు. ఆ త‌ర్వాత 3.10గంటలకు మేడారం నుంచి తిరుగుప్రయాణ‌మ‌వుతారు. సీఎం, ఉప రాష్ట్ర‌ప‌తిల‌ రాకతో అక్క‌డ భారీ బందోబస్తు పోలీసులు ఏర్పాటు చేశారు.
Tags:    

Similar News