జగన్ పార్టీ నేతది ఎంత దొడ్డ మనసు?

Update: 2016-08-20 12:23 GMT
చరిత్ర సృష్టించిన ‘సిల్వర్’ సింధు మీద వరాల వర్షం కురుస్తోంది. వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా స్పందించే ప్రతి గుండె ఆమెను అభినందనల్లో ముంచెత్తుతోంది. రియో ఒలింపిక్స్ ముగుస్తున్నా ఒక్క పతకం రాక విలవిలలాడిన కోట్లాది భారతీయుల గుండెలు సాక్షి.. సింధులు సాధించిన పతకాలతో ఒక్కసారి ఆనందోత్సాహాలకు గురి చేస్తున్నారు. తెలుగమ్మాయి సింధు సాధించిన చారిత్రక విజయాన్ని వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులు ఆమెను అభినందల్లో ముంచెత్తుతున్నారు.

తన కొడుకు సినిమా గురించి మాట్లాడేందుకు హైదరాబాద్ వచ్చిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సింధుకు రూ.10లక్షల నజరానాను ప్రకటించారు. వచ్చే నెల 8న తన కుమారుడి చిత్ర ఆడియో ఫంక్షన్ జరగనుందని.. ఆ కార్యక్రమంలో ఆమెను సన్మానించనున్నట్లుగా వెల్లడించారు. ఇలా ఎవరికి వారు సింధుకు నజరానాలు ప్రకటిస్తున్న వేళ..సినీ నటుడు..  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు విజయ్ చందర్ (కరుణామయుడి ఫేం) రియాక్ట్ అయ్యారు. తమ కరుణామయుడు చారిటబుల్ ట్రస్ట్ నుంచి సింధుకు రెండు ఎకరాల భూమిని కేటాయిస్తున్నట్లు వెల్లడించారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాంహౌస్ కు సమీపంలోని కరకపట్లలో తాను ఇవ్వనున్న భూమి ఉన్నట్లు వెల్లడించిన విజయ్ చందర్.. పీవీ సింధూరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించిన తర్వాత పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా రిజిస్ట్రేషన్ పేపర్స్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ‘కరుణామయుడి’ నజరానా విన్న పలువురు.. ‘‘సింధూకి అందరూ నజరానాలు ప్రకటిస్తున్నా పార్టీ తరఫున జగన్ ఎలాంటి తోఫా ప్రకటించకున్నా.. పార్టీనేత రెండు ఎకరాల భూమిని ఇవ్వటం బాగుంది. అధినేత చేయని పనిని ఆ పార్టీ నాయకుడు చేశారు’’ అన్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వినిపించటం గమనార్హం.
Tags:    

Similar News