ల‌ండ‌న్ లో మాల్యా అరెస్టు.....బెయిల్ పై విడుద‌ల‌

Update: 2017-10-03 12:17 GMT
భార‌త్ లోని బ్యాంకుల‌కు లిక్క‌ర్ కింగ్ విజ‌య్ మాల్యా దాదాపు 9వేల కోట్ల రూపాయ‌లు ఎగ్గొట్టి బ్రిట‌న్ పారిపోయిన సంగ‌తి తెలిసిందే. మ‌నీ లాండ‌రింగ్ కేసులో మాల్యాపై ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు  బ్రిట‌న్ కోర్టులో తాజాగా అఫిడ‌విట్ ను దాఖ‌లు చేశారు. కింగ్ ఫిష‌ర్ ఎయిర్ లైన్స్ కోసం ఐడీబీఐ బ్యాంకు నుంచి మాల్యా 950 కోట్ల రూపాయ‌ల రుణాన్ని తీసుకున్నాడు. ఆ రుణం ఎగ‌వేత‌కు సంబంధించి తాజా సాక్ష్యాల‌ను ఈ అఫిడ‌విట్ లో ఈడీ అధికారులు పొందుప‌రిచారు. దీంతో, ప్రివెన్ష‌న్ ఆఫ్ మ‌నీ లాండ‌రింగ్ యాక్ట్ ప్ర‌కారం మాల్యాను అరెస్టు చేసిన‌ట్లు లండ‌న్ లోని క్రౌన్ ప్రాసెసింగ్ స‌ర్వీస్ తెలిపింది. వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టులో మాల్యాపై విచారణ జరిగింద‌ని ఆ సంస్థ తెలిపింది. విచార‌ణ అనంత‌రం మాల్యాకు నిబంధ‌న‌ల ప్ర‌కారమే వెంట‌నే బెయిల్ మంజూరైన‌ట్లు ఆ సంస్థ‌ తెలిపింది.

ఈసారి ఎలాగైనా మాల్యాను భార‌త్ కు ర‌ప్పించాల‌నే ఈడీ గ‌ట్టిప్ర‌య‌త్నాలు చేస్తోంది. ప్ర‌స్తుతం మాల్యా బ్రిట‌న్ లో ఎక్స్ ట్రాడిక్ష‌న్ (ప‌ర‌దేశ‌స్థుల అప్ప‌గింత‌) నిబంధ‌న‌ను సాకుగా చూపి పబ్బం గ‌డుపుకుంటున్నాడు. మాల్యాకు  బెయిల్ మంజూరైన నేప‌థ్యంలో అత‌డిపై  మ‌రిన్ని బ‌ల‌మైన చార్జిషీటులు దాఖ‌లు చేసి వాటిని వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టులో సాక్షాలుగా చూపాల‌ని ఈడీ యోచిస్తోంది. త‌ద్వారా ఎక్స్ ట్రాడిక్ష‌న్ గడువు త్వ‌ర‌గా పూర్త‌య్యేలా చేసేందుకు ఈడీ య‌త్నిస్తోంది. మాల్యా ఎక్స్ ట్రాడిక్ష‌న్ కేసు తుది విచార‌ణ ఈ ఏడాది డిసెంబ‌రులో జ‌ర‌గనుంది. మాల్యా ఎస్బీఐకి అనుబంధంగా ఉన్న 17 బ్యాంకుల నుంచి మాల్యా రూ.6,027 కోట్ల రుణాలు తీసుకున్నార‌ని ఈడీ నిర్ధారించింది. ఆ నిధుల‌ను యూకే , అమెరికా, ఐర్లాండ్ ల‌లోని  షెల్‌ కంపెనీలకు తరలించినట్టు ధ్రువీక‌రించింది. అలాగే అమెరికా, ఐర్లాండ్, మారిషస్, ఫ్రాన్స్‌ దేశాల్లోని 13 షెల్ కంపెనీల ద్వారా మాల్యా రూ. 1,300 కోట్లు ఆర్జించినట్టు ఈడీ నిర్ధార‌ణ‌కు వ‌చ్చింది.

ఇప్ప‌టికే మాల్యాపై బలమైన కేసును పెట్టే యోచనలో భాగంగా ఫ్రాన్స్, సింగపూర్, మారిషస్, ఐర్లాండ్, అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలకు (లెటర్ రోగటరీ) ఎల్‌ఆర్‌ ను ఈడీ జారీ చేసింది. సుమారు ఆరు దేశాల్లో మాల్యా ఆస్తుల వివరాలను తెలియచేయాల్సిందిగా ఆయా దేశాల‌కు లేఖలు కూడా రాసింది. మాల్యాపై ఇప్ప‌టికే ఆరుకుపైగా అరెస్టు వారెంటులు జారీ అయిన సంగతి తెలిసిందే. అయితే, మాల్యా లండ‌న్ లో మాల్యా అరెస్ట‌వడం, బెయిల్ పై విడుద‌ల‌వ‌డం ఇది రెండోసారి. ఈ ఏడాది ఏప్రిల్ 18న‌ మాల్యాను స్కాట్ లాండ్ యార్డ్ పోలీసులు అరెస్టు చేశారు. అదేరోజు, ఆయ‌న‌ను బెయిల్ పై విడుద‌ల చేశారు. బ్యాంకు రుణాల ఎగ‌వేత కేసు విచార‌ణ నిమిత్తం భార‌త్ కు రావాలన్న కోర్టు ఆదేశాల‌ను మాల్యా చాలాసార్లు బేఖాత‌రు చేశారు.  దీంతో రంగంలోకి దిగిన సీబీఐ - ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు మాల్యాపై లండన్ లోని కోర్టులో తాజా అఫిడవిట్ దాఖలు చేశారు.
Tags:    

Similar News