మహిళలపై కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు.. క్షమాపణలకు డిమాండ్

Update: 2021-02-11 03:44 GMT
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సహనం కోల్పోయారు. మహిళలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటలపై అన్ని వర్గాల నుంచీ అభ్యంతరాలు వ్యక్తమవుతన్నాయి. క్షమాపణలు చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఓటమి నైరాశ్యం నుంచే ఇలాంటి వ్యాఖ్యలు వస్తున్నాయని విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇంతకీ కేసీఆర్ ఏమన్నారంటే..?

బుధ‌వారం నల్గొండ జిల్లా హాలియాలో టీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ స‌భ‌లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయ‌న‌ కేసీఆర్ సభలో ప్రసంగిస్తుండ‌గా.. కొంద‌రు మ‌హిళ‌లు త‌మ డిమాండ్లు నెర‌వేర్చాలంటూ ఆందోళ‌న‌కు దిగారు. దీంతో.. ఆవేశానికి లోనైన కేసీఆర్‌.. ‘ఇలాంటి పిచ్చి ప‌నులు ఇక్క‌డ చేయొద్దు వెళ్లిపోండి’ అని అన్నారు.

అయినప్పటికీ వారు వెళ్లకుండా అక్కడే ఉండి నినాదాలు చేశారు. దీంతో.. సహనం కోల్పోయిన కేసీఆర్.. ‘మీలాంటి కుక్కలు చాలా మంది ఉంటారు. బయటకు వెళ్లిపోండి.’ అన్న ముఖ్యమంత్రి.. ‘టేక్ దెమ్ అవుట్’ అని పోలీసులను ఆదేశించారు. ఈ వ్యాఖ్యలపై  నిరసన వ్యక్తమవుతోంది. సమస్య చెప్పుకోవడానికి వచ్చిన వారిని కుక్కలతో పోల్చడం సరికాదని అంటున్నారు.

సీఎం వ్యాఖ్యలపై బీజేపీ నేత విజయశాంతి స్పందించారు. ఓటములతో తీవ్ర ఆందోళనకు గురవుతున్న కేసీఆర్.. తెలంగాణ ప్రజలను కుక్కలతో పోలుస్తున్నారని అన్నారు. ఇది దొర అహంకారానికి నిదర్శనం అన్న విజయశాంతి.. వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఓటు ద్వారా కర్రుకాల్చి వాత పెట్టాల్సిన సమయం వచ్చిందని అన్నారు. అంతేకాదు.. కేసీఆర్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేశారామె.
Tags:    

Similar News