జ‌గ‌న‌న్న‌కు విజ‌య‌మ్మ ప‌రామ‌ర్శ

Update: 2015-10-10 07:23 GMT
ప్రత్యేక హోదా కోసం గుంటూరులోని నల్లపాడులో దీక్ష చేస్తున్న వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఎలా ఉన్నారో చూడ్డానికి ఆయన తల్లి విజయమ్మ వ‌చ్చారు. దీక్షా స్థలికి వ‌చ్చిన ఆమె కొడుకు ఆరోగ్యం గురించి వాక‌బు చేశారు. ప్ర‌త్యేక‌హోదా కోసం జగన్‌ చేస్తున్న నిరవధిక దీక్ష నాలుగో రోజుకు చేరుకోవడంతో ఆయన ఆరోగ్యంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. నిన్నటి వరకు జగన్‌ ఆరోగ్యం బాగానే ఉన్నా... నేడు ఆయన నీరసంగా కనిపిస్తున్నారు. నాలుగు రోజులుగా ఆహారం లేకపోవడంతో బీపీ - షుగర్‌ లెవెల్స్‌ లో మార్పు రావడంతో పాటు కాస్త బరువు తగ్గినట్లు కూడా వైద్యులు తెలిపారు.

జ‌గ‌న్ దీక్ష నాలుగో రోజుకు చేర‌డంతో వైద్యులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. ఆయ‌న వ‌ద్ద‌నే ఉండి నిత్యం ప‌ర్య‌వేక్షిస్తున్నారు. వైద్యులు క్ర‌మం త‌ప్ప‌కుండా ఆయ‌న‌కు వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు.. నాలుగు రోజులుగా ఆహారం ఏమీ తీసుకోకపోయినా జగన్ ఆరోగ్యం నిలకడగానే ఉందని గుంటూరు వైద్యులు ప్రకటించారు. అయితే నిన్నటిదాకా జగన్ ఆరోగ్యంలో ఎలాంటి మార్పు రాకున్నా, నేటి ఉదయం ఆయన బీపీ - షుగర్ లెవెల్స్ లో తేడాలు కనిపిస్తున్నాయన్నారు. సాయంత్రానికి ఆయ‌న ఆరోగ్యం మ‌రింత క్షీణించొచ్చ‌ని చెబుతున్నారు.

జ‌గ‌న్ ను క‌ల‌వ‌డానికి వ‌చ్చిన విజ‌య‌మ్మ ప్ర‌త్యేక హోదాపై మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతో పాటు ప్యాకేజీ కూడా అవసరమేనని   పేర్కొన్నారు. దీక్షావేదికపై జగన్‌ ను పరామర్శించిన త‌రువాత ఆమె మాట్లాడుతూ... బీజేపీ గతంలో పార్లమెంట్‌ ఇచ్చిన హామీని అమలు చేయడం లేదని దుయ్యబట్టారు. విభజన చట్టంలో పేర్కొన్న అన్నింటిని అమలు చేసి తీరాల్సిందేనన్నారు. చట్టంలో ఉన్నవి రెండింటిని తెచ్చి అన్నీ ఇచ్చామని చెప్పుకోవడం తగదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయని, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు.
Tags:    

Similar News