రాజా వారికే జనాలు ఓటు...బూమరాంగేనా.. ?

Update: 2021-12-26 05:58 GMT
విజయనగరం పూసపాటి రాజులు అంటేనే జనాలు చాలా అభిమానం చూపిస్తారు. వారి దగ్గర ఉన్నది సేవాభావం. నిస్వార్ధతత్వం, పదిమందినీ ఆదుకోవడం. మంచి చేయాలనుకోవడం. లేనిదల్లా అహంకారం. అధికార చలాయింపు. అందుకే కాలాలు మారినా రాజులకే జనాలు ఎపుడూ ఓటేస్తారు. ఎన్నికల్లో ఓడారు కదా అని వారిని రాజకీయ తూకం రాళ్ళతో లెక్కకట్టి ఎవరైనా కొలవాలని చూస్తే బొక్క బోర్లాపడడం ఖాయమనే చెబుతారు.

కానీ అన్నీ తెలిసి ఎందుకో విజయనగరం జిల్లాలో రాజా వారిని వైసీపీ నేతలు తరచూ కెలుకుతున్నారు. గత రెండేళ్ళుగా ఆయన్ని ఒక్క లెక్కన టార్గెట్ చేస్తున్నారు. ఇది వైసీపీకే ఎదురుతంతుందని అంటున్నారు. నిజానికి అశోక్ చాలా కాలంగా సైలెంట్ గా ఉంటున్నారు. మారిన రాజకీయాలకు అడ్జస్ట్ కాలేక ఆయన దూరంగానే ఉంటున్నారు. అన్నిచోట్లా కులాల సమీకరణలు, ఇతరపర‌మైన ఈక్వేషన్స్ అన్నీ చూసిన రాజు గారు పాలిటిక్స్ ఇక చాల్లే అనుకున్నారని టాక్.

అయితే కుమార్తె అదితిని మాత్రం రాజకీయంగా నిలబెట్టాలన్న కోరిక అయితే ఆయనకు ఉంది. టీడీపీలో చూసుకుంటే సీనియర్ మోస్ట్ లీడర్ అన్న కారణంగా ఆయన్ని పక్కన పెట్టడానికే రంగం సిద్ధమవుతోందని టాక్. కొత్త వారిని బలమైన సామాజికవర్గానికి చెందిన వారినే తీసుకురావాలని పార్టీ పెద్దలకు ఉందని చెబుతున్నారు.

ఈ క్రమంలో మరో మారు వైసీపీ నేతలు ప్రొటోకాల్ పేరిట రామతీర్ధంలో రగిలించిన ఘటనలతో అశోక్ లైమ్ లైట్ లోకి వచ్చారు. ఆయన పట్ల వైసీపీ నేతలు వ్యవహరించి తీరుతో పెద్ద ఎత్తున రాజా వారికి జనాలలో సానుభూతి వెల్లి విరుస్తోంది. వందలాది దేవాలయాలకు ధర్మ‌కర్తగా ఉన్న ఆయన పట్ల అనుసరించిన వైఖరి ఇది కాదు అనే అంతా అంటున్నారు.

దాంతో ఆయనకు మద్దతుగా ఉత్తరాంధ్రా టీడీపీ నేతలు అంతా రంగంలోకి వస్తున్నారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అయితే అశొక్ ని అనే తాహతు వైసీపీ నేతలకు అసలు లేదని అన్నారు. ఆయన విషయంలో తరచూ వైసీపీ నేతలు చేస్తున్న వికృత చేష్టలు వైసీపీకే తిప్పికొడతాయని అంటున్నారు. ఇక మూడు జిల్లాలకు చెందిన నాయకులు అంతా అశోక్ దగ్గరకు వెళ్లి స్వయంగా ఆయన్ని కలసి తమ సపోర్ట్ తెలియచేస్తున్నారు.

ఈ పరిణామాలతో ఒక్కసారిగా ఉత్తరాంధ్రా రాజకీయం మారుతోంది. అశోక్ వంటి పెద్ద మనిషిని పదే పదే వైసీపీ నేతలు ఇబ్బంది పెడుతున్నారు అన్న్ సందేశం అయితే జనాల్లోకి వెళ్లిపోయింది. ఇది కచ్చితంగా వైసీపీకి రాజకీయంగా నష్టం కలిగించే చర్యగానే అంతా చూస్తున్నారు. ఇక టీడీపీ విషయానికి వస్తే అశోక్ ని కాదనలేని పరిస్థితి కూడా ఉందని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ మూడు జిల్లాల్లో గెలవాలి అంటే అశోక్ వంటి సీనియర్ ని ముందు పెట్టాల్సిందే అన్న చర్చ కూడా వస్తోంది.

మొత్తానికి కావాలని కెలుక్కుని తమ రాజకీయాన్ని చిరిగి చేట చేసుకుంటున్నారు వైసీపీ నేతలు అంటున్నారు. ఈ పరిణామాలు మాత్రం అధికార పార్టీకి ఏ మాత్రం మంచివి కావనే అంటున్నారు. పూసపాటి సంస్థానాధీశుని మీద కక్ష కట్టినట్లుగా వ్యవహరించడం వల్ల ఉత్తరాంధ్రా జనాల నుంచి పూర్తి వ్యతిరేకతను చూస్తారని కూడా హెచ్చరిస్తున్నారు. ఇంతకీ వైసీపీ ఈ విషయంలో సాధించేదేంటి, పార్టీ పెద్దలకు ఏమైనా అర్ధమవుతోందా అన్నదే సొంత పార్టీ నుంచి కూడా వస్తున్న సూటి ప్రశ్న.
Tags:    

Similar News