ఆ రోజును గుర్తు చేసుకున్న విజయసాయిరెడ్డి!

Update: 2023-05-14 11:49 GMT
భారత పార్లమెంటులో రెండు సభలు ఉంటాయనే విషయం తెలిసిందే. ఎగువ సభ రాజ్యసభ కాగా దిగువ సభ లోక్‌ సభ. రాజ్యసభ దేశంలోని రాష్ట్రాలకు, లోక్‌ సభ దేశంలోని ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తుంది.

ఈ నేపథ్యంలో పార్లమెంటు ఎగువ సభ అయిన రాజ్యసభలో మే 13కి చరిత్రలో మంచి చోటుంది. మే 13, 1952లో మొదటి రాజ్యసభ సమావేశం జరగడం ఇందుకు కారణం. మే 13న చరిత్రాత్మకమైన రోజున మొదటి సభ జరిగింది. భారత పార్లమెంటులో 'రెండవ గది' గా పేరొందిన ఈ హాల్‌ తరువాత ఆగస్టు 23, 1954న రాజ్యసభగా పేరు మార్చుకుంది.

రాజ్యసభకు ఉపరాష్ట్రపతి చైర్మన్‌ గా ఉంటారనే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మొదటి రాజ్యసభ సమావేశాలకు ఛైర్మన్‌ గా నాటి ఉపరాష్ట్రపతి డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ బాధ్యతలు చేపట్టారు. మే 13, 1952న ఎగువ సభ గురించి ఆయన ప్రసంగించారు. కొత్తగా ఏర్పాటైన 'రాష్ట్రాల మండలి' (ప్రస్తుతం రాజ్యసభ) మొదటిసారిగా కలిసి కూర్చున్న ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుందని సర్వేపల్లి రాధాకృష్ణన్‌ పేర్కొన్నారు. దీనికి గర్వంగా, సంతోషంగా ఉందన్నారు.

సర్వేపల్లి రాధాకృష్ణన్‌ 1952 నుంచి 1962 వరకు భారతదేశ మొదటి ఉపరాష్ట్రపతిగా ఉన్నారు. కాబట్టి సహజంగానే, రాజ్యసభ చైర్మన్‌ గా ఆయన 10 సంవత్సరాల పాటు ఉన్నారు.

ఈ నేపథ్యంలో ఈ చారిత్రాత్మక దినాన్ని గుర్తు చేసుకుంటూ వైసీపీ రాజ్యసభ ఎంపీ, ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి చేసిన ఆసక్తికర ట్వీట్‌ అందరి దృష్టినీ ఆకర్షించింది. ప్రజల చేత ఎన్నికైన సభ్యులతో లోక్‌ సభ ఉన్నా కూడా ప్రాధాన్యత దృష్ట్యా రాజ్యసభను కూడా ఏర్పాటు చేశారని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు.

లోక్‌ సభ బిల్లులను హడావుడిగా ఆమోదించకుండా ఉండేందుకు, అన్ని విధాల వాటిని చర్చించేందుకు రాజ్యసభను ఏర్పాటు చేశారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అప్పట్లో అన్ని రాష్ట్రాల్లో వివిధ రంగాల్లోని నిపుణులతో రాజ్యసభను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.

ఈ నేపథ్యంలో రాజ్యసభ ప్రాముఖ్యతను వివరిస్తూ, అటువంటి చారిత్రాత్మకమైన రోజును గుర్తుచేస్తూ విజయసాయిరెడ్డి్డ చేసిన ట్వీట్‌ సహజంగానే అందరినీ ఆకర్షించింది. నెటిజన్ల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది.

Similar News