మోదీని కేసీఆర్ కెలికితే విజ‌య‌శాంతి రియాక్ట‌య్యారే!

Update: 2019-07-19 07:21 GMT
తెలంగాణ రాజ‌కీయాల్లో ఊహించ‌ని ట్విస్ట్ ఇది. ప్ర‌ధాన‌మంత్రి - బీజేపీ ర‌థ‌సార‌థి న‌రేంద్ర మోదీని విమ‌ర్శిస్తే...క‌మ‌ల‌నాథులు స్పందించడం స‌హ‌జం. అయితే, వారి బ‌దులుగా కాంగ్రెస్ నాయ‌కురాలు రియాక్ట‌య్యారు. ప్ర‌ధానిని త‌ప్పుప‌ట్టినందుకు దుమ్మెత్తిపోశారు. ప్ర‌ధాని మోదీపై విమ‌ర్శ‌లు చేసింది తెలంగాణ సీఎం కేసీఆర్ అయితే...ఇలా ఆస‌క్తిక‌ర రీతిలో స్పందించింది తెలంగాణ కాంగ్రెస్ నాయ‌కురాలు విజ‌య‌శాంతి. ప్రధానిని ఉద్దేశించి ‘నరేంద్రమోదీది ఓ గెలుపా?’ అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా రాములమ్మ..జాతీయ వాదాన్ని రెచ్చగొట్టి మోదీ గెలిచారని కేసీఆర్ అంటున్నారని మరి 2014 ఎన్నికల్లో కెసిఆర్ తెలంగాణ వాదాన్ని రెచ్చగొట్టి గెలిచింది నిజం కాదా అని ప్రశ్నించారు.

త‌న ఫేస్‌ బుక్‌ - ట్విట్ట‌ర్ అకౌంట్ లో ఈ మేర‌కు రాములమ్మ ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ``నరేంద్ర మోదీది ఓ గెలుపా?...ఏం అభివృద్ధి చేశారని మోదీ మళ్లీ గెలిచారు?...కేవలం దేశభక్తి పేరుతో సెంటిమెంట్ రగిల్చి... దాన్నే ఎన్నికల అంశంగా వాడుకుని, మోదీ గెలిచారని తెలంగాణ సీఎం కేసీఆర్ గారు సెలవిచ్చారు. అభివృద్ధితో పని లేదు...సెంటిమెంట్ అడ్డం పెట్టుకుని గెలవొచ్చని కేసీఆర్ చెబుతున్నారు. మరి 2014లో కూడా తెలంగాణ సెంటిమెంట్ ను అడ్డం పెట్టుకునే కదా టీఆరెస్ గెలిచింది. ఆర్నెల్ల క్రితం జరిగిన ఎన్నికల్లోనూ మళ్లీ సెంటిమెంట్ ను రగిల్చి - కేసీఆర్ ఎన్నికల్లో లబ్ధి పొందారు. తన వరకు వస్తే కానీ కేసీఆర్ గారికి తత్వం బోధ పడినట్లు లేదు. అభివృద్ధి చేసినంత మాత్రాన గెలవాలని గ్యారెంటీ లేదని కేసీఆర్ గారు చేసిన కామెంట్స్ ను అంతరార్ధాన్ని విశ్లేషిస్తే...ఆయనకు ఎన్నికల భయం పట్టుకుందనే విషయం స్పష్టంగా అర్ధమవుతోంది. పంచాయతీ ఎన్నికలు - మున్సిపల్ ఎన్నికల విషయం మాట్లాడుతున్న కేసీఆర్ గారు ఒక విషయాన్ని గుర్తించాలి. మరో మూడేళ్లలో ఒకే దేశం..ఒకే ఎన్నికలు నిర్వహించాలన్న బీజేపీ ప్రతిపాదనకు కేసీఆర్ గారు కూడా మద్దతు పలికారు.మరి అలాంటప్పుడు అసెంబ్లీతో పాటూ లోక్ సభకు జరిగే ఎన్నికల్లో మళ్లీ నరేంద్రమోదీ సెంటిమెంట్ రెచ్చగొట్టి - దానిద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలనుకుంటే టీఆరెస్ చేతులెత్తేస్తుందా అనే విషయాన్ని టీఆరెస్ అధిష్టానం స్పష్టం చేయాల్సి ఉంది.``అంటూ ఘాటుగా రియాక్ట‌య్యారు.

ఇక ప్ర‌స్తుతం త‌మ పార్టీలో నెల‌కొన్న ప‌రిణామాల గురించి సైతం విజ‌య‌శాంతి స్పందించారు. ``జాతీయ కాంగ్రెస్‌ లో తాత్కాలికంగా తలెత్తిన అనిశ్చిత పరిస్థితిని ఆసరాగా తీసుకుని...తెలంగాణలో కాంగ్రెస్‌ కు చెందిన శాసనసభ్యులు పార్టీ మారడాన్ని అనుకూలంగా మలుచుకుని, ఇక రాష్ట్రంలో ప్రతిపక్ష పరిస్థితి నామమాత్రమే అన్న చందంగా అధికార టీఆర్ ఎస్ పార్టీ నియంతృత్వ పోకడలు పోతోంది. కానీ టిఆర్ ఎస్ అధిష్టానం గుర్తించాల్సిన ప్రధాన విషయం ఏమిటంటే...ప్రస్తుత సంక్షోభ సమయాన్ని కూడా అధిగమించి - మరల అధికార పార్టీ చేసే ఆగడాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు విపక్షాలన్నీ సన్నద్ధమవుతున్నాయి. నిరంతరం తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని కోరుకునే వ్యక్తిగా ఆ పోరాటానికి నేను కూడా సిద్ధం...`` అంటూ త‌మ పార్టీ ప‌ని అయిపోయింద‌నుకోవ‌ద్ద‌నే భావ‌న‌ను విజ‌య‌శాంతి క‌లిగించారు.
   

Tags:    

Similar News