ప్రియుడ్ని లేపేయాలని ప్లాన్‌ చేస్తే..?

Update: 2015-06-29 12:47 GMT
తెలుగు టీవీ సీరియల్స్‌లో మాత్రమే కనిపించే ఘటనలు ఈ మధ్యన రియల్‌ లైఫ్‌లోనూ చోటు చేసుకుంటున్నాయి. చిరునవ్వులు చిందిస్తూ చంపేసే లేడీ విలన్లను చూసి స్ఫూర్తి పొందినట్లుగా కనిపిస్తోంది రాణి ప్లానింగ్‌ చూస్తే.

ఇంతకీ ఈ రాణి ఎవరు? ప్లానింగ్‌ ఏమిటన్న విషయాల మీద స్పష్టత రావాలంటే రెండు.. మూడు రోజుల వెనక్కి వెళ్లాలి. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి సమీపంలో ఒక జంటపై యాసిడ్‌ దాడి జరగటం.. ఈ ఘటనలో రాణి అనే మహిళ మృతి చెందట.. బైక్‌ నడుపుతున్న రాజేష్‌ అనే వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందటం తెలిసిందే.

ఈ ఘటన జరిగిన తర్వాత రాణి ఎవరు.. రాజేష్‌ ఎవరన్న విషయంపై దృష్టి సారిస్తే.. రాణికి పెళ్లి అయ్యిందని.. మెడికల్‌ చెకప్‌కి స్నేహితుడు రాజేష్‌ వెంట వెళ్లిందన్న మాట బయటకు వచ్చింది. ఇదే సమయంలో రాణి బంధువులు రాజేష్‌ మీద ఆరోపణలు చేయటంతో పోలీసులు విషయాన్ని కాస్త లోతుగా పరిశీలించారు. చివరకు విషయం తెలిసి అవాక్కయ్యారు.

ఎందుకంత విస్మయం ఎందుకంటే.. సదరు యాసిడ్‌ దాడి చేయించింది రాణినే. తన ప్రియుడి మీద దాడి చేయించాలన్న ఉద్దేశ్యంతో ముందస్తుగా ఇద్దరు కిరాయి వ్యక్తులతో ఒప్పందం కుదుర్చుకొని అతన్ని మట్టుబెట్టాలని ప్లాన్‌ చేసినట్లుగా పోలీసులు తేల్చారు. యాసిడ్‌ దాడికి పాల్పడిన కిరాయి వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారిస్తే అసలు విషయాన్ని చెప్పుకొచ్చారు.

తనతో సహజీవనం చేస్తున్న రాజేష్‌కు పెళ్లి కుదరటంతో.. దీన్ని ఏ మాత్రం ఇష్టపడని రాణి.. రాజేష్‌ ప్రాణాలు తీయాలని యాసిడ్‌ దాడి చేయాలని ప్లాన్‌ చేసిందట. కాకపోతే.. యాసిడ్‌ దాడితో బండి నడుపుతున్న రాజేష్‌ కంట్రోల్‌ తప్పి బైక్‌ మీద నుంచి పడిపోవటం.. అదే సమయంలో రాణి తలకు భారీ గాయం కావటంతో ప్రియుడ్ని చంపేయాలని ప్లాన్‌ చేసిన ఆమే చచ్చిపోయింది.

Tags:    

Similar News