ప్రేమ, పెళ్లి.. తలనరికిన పగ..

Update: 2019-08-12 10:49 GMT
ప్రేమ.. అనేది పెళ్లి చేసుకోకముందు అద్భుతంగా ఉంటుంది. ప్రియురాలి కోసం ప్రాణాలిచ్చేంత ప్రేమ కనిపిస్తుంది. కానీ పెళ్లి అయ్యాకే ప్రాణాలు తీసేంత కసి కూడా పెరుగుతుంది. ప్రేమిస్తున్నానని వెంటపడి మరీ చేసుకున్న ఈ ప్రేమికుడు చివరకు తన ప్రియురాలి తల నరికి అత్యంత పాశవికంగా ఆ తలను దొరక్కుండా చేశాడు. ఇప్పుడా తల ఎక్కడుందనేది అంతచిక్కడం లేదు. భార్య తల నరికి చంపేంత పగ అతడిలో అసలు ఎందుకు పేరుకుపోయింది..? ఆ భార్య చేసిన తప్పేంటి? ఇలా ఎన్నో ఈ భీతిగొలిపే క్రైంలో కనిపిస్తున్నాయి.

నిన్న విజయవాడ సత్యనారాయణ పురంలో నడిరోడ్డుపై పట్టపగలు భార్య తల నరికి పరిగెత్తిన భర్త వీడియో కలకలం రేపింది. అతడి క్రూరత్వానికి అందరూ భయాందోళన వ్యక్తం చేశారు. తలతో పరిగెడుతున్న భర్త  వీడియో అన్ని ప్రసార మాధ్యమాల్లో ప్రసారం కావడంతో అంతా షాక్ కు గురయ్యారు. అసలు ఇంత కసి పెరగడానికి భార్యభర్తల మధ్య గొడవలే కారణమని తెలిసింది.

కృష్ణ జిల్లా శ్రీకాకుళం  గ్రామానికి చెందిన పేటేటి ప్రదీప్ కుమార్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఇతడు విజయవాడలోని టీఎస్ ఆర్ కంపెనీలో పనిచేసేటప్పుడు అదే కంపెనీలో పనిచేసే సత్యనారాయణపురం శ్రీనగర్ కాలనీకి చెందిన మణిక్రాంతిపై మనుసుపడ్డాడు. ఆమె వెంటపడ్డాడు.కాదన్నా  ప్రేమించమని వేధించాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఎదుట పెళ్లి చేసుకుంటానని బతిమాలి ఒప్పించి 2015లో ప్రదీప్ చివరకు మణిక్రాంతిని పెళ్లి చేసుకున్నాడు.

ప్రదీప్-మణిక్రాంతి సంసారం మూడేళ్లు బాగా సాగింది. ఆతర్వాతే కాపురంలో గొడవలు. ప్రదీప్ సోదరి వద్దకు వెళ్లడం.. ఆమెకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంపై మణిక్రాంతి అభ్యంతరం తెలిపింది. దీనిపై గొడవలు, చివరకు మణిక్రాంతిపై భర్త, ఆడబిడ్డ దాడి చేసే వరకు వెళ్లింది.

ఈ గొడవలు తాళలేక ప్రదీప్ తన భార్య మణిక్రాంతికి విడాకుల నోటీసులు పంపాడు. కానీ మణిక్రాంతి ఒప్పుకోలేదు. కేసులు పెట్టింది. ఆ కేసులు, పాత కేసుల్లో అరెస్ట్ వారెంట్ తో ప్రదీప్ జైలు పాలయ్యాడు. తనను జైలుకు పంపిన భార్య మణిక్రాంతి బతుకకూడదని జైలు నుంచి బయటకు రాగానే సత్యనారాయణపురంలోని భార్య ఇంటి వద్ద కాపు కాశాడు.

మార్కెట్ కు వెళ్లి తిరిగొచ్చిన భార్య జుట్టు పట్టి ఈడ్డుకొని నడిరోడ్డుపైకి తీసుకొచ్చి కత్తితో తల నరికేశాడు. అనంతరం తలను పట్టుకొని పరిగెత్తాడు. వెళ్లి ఏలూరు కాలువలో పడేశాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు.

అయితే ప్రదీప్ విసిరిన భార్య తల ఇప్పుడు దొరకడం లేదు. కాలువలో పడేశానని చెప్పడంతో ఎన్డీఆర్ ఎఫ్ సిబ్బంది గాలిస్తున్నారు. కానీ అదే కాలువలోకి బుడమనేరు కాలువ పొంగి ఉధృతంగా నీరు పారడంతో తల కొట్టుకుపోయినట్టు అనుమానిస్తున్నారు. దీంతో గాలింపుకు ఆటంకం కలుగుతోంది. ఇప్పుడా తల  కోసం పోలీసులు వెతుకులాట ప్రారంభించారు.
    

Tags:    

Similar News