విజయవాడ మటన్ మాఫియా గుట్టు మరోసారి రట్టు..... అసలు అక్కడ ఏం జరుగుతోంది !

Update: 2021-03-02 00:30 GMT
ఆదివారం .. రాగానే అందరూ నాన్ వెజ్ తినాలని , నాన్ వెజ్ షాప్స్ ముందు బారులు తీరుతారు. చికెన్ , మటన్ తీసుకువెళ్లి ఇష్టంగా చేసుకొని హాయిగా తింటుంటారు. కానీ అసలు ఆ చికెన్ , మటన్ ఫ్రెష్ హ , కదా అని పెద్దగా పట్టించుకోరు. అసలు మీకు చికెన్ ,మటన్ మాత్రమే ఇస్తున్నారా లేక ఆ స్థానంలో వేరే మాంసం ఏదైనా ఇస్తున్నారా అంటే విజయవాడలో వరుసగా జరుగుతున్న ఘటనల గురించి పూర్తిగా తెలుసుకుంటే ఈ తరహా అనుమానాలే వ్యక్తం అవుతాయి. అసలు విజయవాడ లో ఏం జరుగుతుంది అంటే ...

విజయవాడలో మటన్ మాఫియా గుట్టు మరోసారి బట్టబయలు అయింది. మటన్‌ అంటేనే మండిపడేలా ప్రవర్తిస్తున్నారు కొందరు వ్యాపారులు. చికెన్‌ను కూడా ఛీ ఛీ అనుకునేలా చేస్తున్నారు. వ్యాపారం మాటున  నిల్వ ఉంచిన, కుళ్లిన మాంసాన్ని అంటగడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. విజయవాడలో నిల్వ ఉంచిన మాంసాన్ని విక్రయించడం వ్యాపారులు అలవాటుగా మార్చుకుంటున్నారు. ఎప్పటికప్పుడు అధికారులు తనిఖీలు చేస్తున్నా కూడా ఏ మాత్రం బయపడటంలేదు. రోజుల తరబడి ఫ్రిడ్జ్‌లో ఉంచిన మాంసాన్ని ఫ్రెష్‌ అన్నట్టుగా బిల్డప్‌ ఇస్తూ అంటగడుతున్నారు. నిల్వ ఉంచిన మాంసం విక్రయిస్తున్నారంటూ వినియోగదారుల నుంచి ఫిర్యాదులు అందుతుండడంతో  మున్సిపల్‌ అధికారులు మరోమారు తనిఖీలు చేపట్టారు.

తాజా తనిఖీల్లో కూడా కలవరపడే వాస్తవాలను గుర్తించారు అధికారులు. విజయవాడ నగరంలోని చాలా మటన్‌, చికెన్‌ షాపుల్లో అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. తనిఖీల్లో బీఫ్‌ మాంసాన్ని కూడా గుర్తించిన అధికారులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. దీంతో ఆయా నాన్ ‌వెజ్‌ వ్యాపారస్తులకు నోటీసులను జారీ చేశారు. రోజుల తరబడి నిల్వ పెట్టుకుని మరీ అమ్ముతున్నట్టు గుర్తించారు అధికారులు. పైకి మాత్రం వినియోగదారులకు తాజా మాంసాన్ని ఇస్తున్నట్టుగా నమ్మించే యత్నం చేస్తున్నారు. వినియోగదారులకి ఇష్టానుసారంగా నిల్వ ఉంచిన.. కుళ్లిన మాంసాన్ని అంటగట్టేస్తున్నారు. గోళ్లపాలెం సెంటర్‌లో ఇటీవల ఇదే తరహా నిల్వ ఉంచిన మాంసాన్ని గుర్తించారు. ఒక్కచోట అని కాదు.. విజయవాడ నగర వ్యాప్తంగా అనేక కాలనీల్లో ఇదే తరహా అమ్మకాలు చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాబట్టి ఈ ధపా మీరు నాన్ వెజ్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్త వహించి ఫ్రెష్ నాన్ వెజ్  ను  తీసుకోండి.
Tags:    

Similar News