ఇండిపెండెంట్‌ గా పోటీ చేసినా ప్రజలు గెలిపిస్తారు: టీడీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు!

Update: 2023-01-17 06:45 GMT
గత కొంత కాలంగా హాట్‌ కామెంట్స్‌ చేస్తున్న విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి తనకు పార్టీలతో పనిలేదన్నారు. ప్రజలు కోరుకుంటే ఇండిపెండెంట్‌గా పోటీ చేసినా ప్రజలు గెలిపిస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని తాను ఎక్కడా చెప్పలేదన్నారు. చంద్రబాబు టికెట్‌ ఇవ్వకుంటే ఏమవుతుంది అంటూ నాని వ్యాఖ్యానించడం గమనార్హం.

ప్రధాని మోడీని నిండు సభలో వ్యతిరేకించానన్నారు. అయినా బెజవాడలో పనులు ఆగాయా..? అని ప్రశ్నించారు. తనను, తన పర్సనాలిటీని డీగ్రేడ్‌ చేయాలని చూడొద్దని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. తనను ఎంతగా డీ–గ్రేడ్‌ చేయాలని చూస్తే.. అంతగా తన పర్సనాల్టీ పెరుగుతుందన్నారు.

2013కు ముందు టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలు ఎక్కువ ఉండేవని కేశినేని నాని గుర్తు చేశారు. చంద్రబాబు నాయకత్వం మీద నమ్మకంతో తాను టీడీపీలో చేరానన్నారు.

కాగా రెండు రోజుల క్రితం కూడా కేశినేని నాని హాట్‌ కామెంట్స్‌ చేశారు. వచ్చే ఎన్నికల్లో విజయవాడ నుంచి టీడీపీ అధిష్టానం ఎవరికైనా సీటు ఇవ్వవచ్చన్నారు. అయితే తన తమ్ముడు కేశినేని శివనాథ్‌ (చిన్ని), మరో ముగ్గురికి మాత్రం సీటు ఇవ్వవద్దన్నారు. సీటు ఇస్తే తాను వారికి సహకరించబోనని కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఉమనైజర్లు, కాల్‌ మనీ సెక్స్‌ రాకెట్‌ లో ఉన్నవారికి, కబ్జాదార్లకు సీట్లు ఇవ్వవద్దని టీడీపీ అధినేత చంద్రబాబుకు కేశినేని నాని సూచించారు. ఇలాంటి వారికి సీట్లు ఇచ్చి పార్టీ సిద్ధాంతాలను నాశనం చేయొద్దని కోరారు.

వాస్తవానికి వచ్చే ఎన్నికల్లోనూ కేశినేని నానియే విజయవాడ నుంచి టీడీపీ తరఫున బరిలోకి దిగాల్సి ఉంది. అయితే ఆయన ఇటీవల కాలంలో టీడీపీ అధిష్టానంపై చేస్తున్న తీవ్ర వ్యాఖ్యలు, సోషల్‌ మీడియాలో పెడుతున్న పోస్టులు తీవ్ర కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. నాలుగు గోడల మధ్య చర్చించాల్సిన అంశాలను బహిరంగంగా మీడియా ముందు వెళ్లగక్కడం, సోషల్‌ మీడియాలోనూ పోస్టులు చేయడం చేస్తున్నారని టీడీపీ వర్గాలే ఆయనపై మండిపడుతున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News