రైట్ హ్యాండ్ ఖతం.. ‘బాస్’ మాత్రం జస్ట్ మిస్

Update: 2020-07-08 10:15 GMT
దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన గ్యాంగస్టర్ వికాస్ దూబే ను అరెస్టు చేసే విషయంలో యూపీ పోలీసులు మరోసారి మిస్ అయ్యారు. తన ఆగడాలతో కంటి మీద కునుకు లేకుండా చేసిన అతగాడ్ని అదుపులోకి తీసుకునేందుకు యూపీ పోలీసులు వెళ్లటం.. వారిపై జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది పోలీసులు మరణించటం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. రాజకీయ నాయకులతోపాటు.. పోలీసు డిపార్ట్ మెంట్ లో మంచి పట్టున్న వికాస్.. లక్ష్మణ రేఖ దాటేయటంతో అతడికి చెక్ చెప్పాలని పోలీసు శాఖ డిసైడ్ అయ్యింది.

ఇందులో భాగంగా అతడ్ని పట్టుకునేందుకు పెద్ద ఎత్తున పోలీసు బలగాలు గాలిస్తున్నాయి. వికాస్ ఆచూకీ తెలిపిన వారికి రూ.2.5లక్షల మొత్తాన్ని రివార్డు రూపంలో ఇస్తామని చెప్పటం తెలిసిందే. ఇదిలా ఉండగా.. తాజాగా వికాస్ దూబే కు రైట్ హ్యాండ్ అయిన అమర్ దూబేను పోలీసులు తాజాగా ఎన్ కౌంటర్ లో లేపేశారు. యూపీలోని హమీర్ పూర్ జిల్లాలోని ఒక ప్రాంతంలో అతడు తలదాచుకున్న విషయాన్ని తెలుసుకున్న స్పెషల్ టాస్క్ ఫో్సు అతడ్ని పట్టుకునే ప్రయత్నం చేసింది. దీంతో.. తప్పించుకుపోతున్న అతడ్ని పోలీసులు ఎన్ కౌంటర్ చేసి హతమార్చారు.

ఇదిలా ఉండగా.. హర్యానాలోని ఫరీదాబాద్ లోని ఒక హోటల్ లో వికాస్ ఉన్నట్లుగా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు తన ఆచూకీని గుర్తించినట్లుగా తెలుసుకునే గ్యాంగ్ స్టర్ తప్పించుకున్నారు. ఈ క్రమంలో హోటల్ నుంచి సీసీ టీవీ పుటేజ్ సేకరించిన పోలీసులు.. అతడి ఆచూకీ కోసం గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. దొరికినట్లే దొరికి మిస్ అయిన వైనంపై పోలీసు ఉన్నతాధికారులు ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఎనిమిది మంది పోలీసుల్ని చంపేసిన వైనంపై గరం గరంగా ఉన్న పోలీసు శాఖ.. అతడి లెక్క తేల్చే వరకూ విశ్రమించకూడదన్న శపధాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు.
Tags:    

Similar News