తనను తాకాడని కాంబ్లీ భార్య ఏం చేసిందో తెలుసా?

Update: 2018-07-02 10:18 GMT
భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ భార్యతో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. కాంబ్లీ భార్య ఆండ్రియా షాపింగ్ మాల్ లో తనను తాకుతూ వెళ్లినందుకు ఓ వృద్ధుడిపై చేయిచేసుకుంది.  సదురు వృద్ధుడు బాలీవుడ్ సింగర్ అంకిత్ తివారీ తండ్రి రాజ్ కుమార్ అని తేలింది. తమ తండ్రిని కొట్టిన వినోద్ కాంబ్లీ భార్యతో అంకిత్ సోదరుడు అంకుర్ గొడవకు దిగాడు.

ముంబై మలాద్ లోని ఇన్ ఆర్బిట్ మాల్ కు ఆదివారం  వినోద్ కాంబ్లీ-ఆండ్రియా వెళ్లారు. ఆ సమయంలో రద్దీ ఎక్కువగా ఉండడంతో ఓ వృద్దుడు ఆండ్రియాను తాకాడు.  దీంతో కోపంతో ఆండ్రియా  తన చేతిలోని బ్యాగుతో అతనిపై దాడి చేసింది. ఆ వెంటనే కాంబ్లీ జోక్యం చేసుకొని ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లాడు.

అయితే కాసేపటికే ఆ వృద్ధుడి కొడుకులమంటూ ఓ ఇద్దరు వ్యక్తులు వచ్చి కాంబ్లీ-ఆండ్రియాలతో గొడవకు దిగారు.  తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో మాల్ సిబ్బంది జోక్యం చేసుకొని వారిని అక్కడి నుంచి పంపించేశారు.  ఈ ఘటన తర్వాత కాంబ్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో వైపు తివారీ సోదరులు కూడా బంగూర్ నగర్ పోలీసులను ఆశ్రయించారు.  సీసీ ఫుటేజీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

కాగా తివారీ సోదరులు కాంబ్లీ భార్య చేసిన తీరుపై మీడియాతో మాట్లాడారు. ‘తోపులాటలో నా తండ్రి పొరపాటున ఆమెను తాకాడు. వృద్ధుడని కూడా చూడకుండా ఆమె చెప్పుతో కొట్టింది. అందుకే వాళ్లను మేం నిలదీశాం. కానీ కాంబ్లీయే మమ్మల్ని బెదిరించాడు’ అని అంకుర్ చెబుతున్నాడు. అయితే కాంబ్లీ మాత్రం ఆ ఆరోపణలను ఖండిస్తున్నాడు.
Tags:    

Similar News