బిహార్ నేత‌ల‌కు ఏమైంది? మ‌రీ.. ఇంత‌లానా?

Update: 2019-01-25 11:05 GMT
రాజ‌కీయాల్ని చాలామంది మురుగుకాల్వ‌తో పోలుస్తుంటారు. మంచిడోవి.. నీకెందుకురా రాజ‌కీయాలు.. అందులోకి వెళితే తొక్కేస్తారు.. మ‌కిలి అంటిస్తార‌ని తిడ‌తారు. అలా అని ఎవ‌రికి వారు ముడుచుకుపోతే మ‌కిలిని క్లీన్ చేసేదెవ‌రు?  రాజ‌కీయాలు మ‌కిలి అంటే.. మోడీ కూడా మ‌కిలి మ‌నిషేనా? అన్న క్వ‌శ్చ‌న్ కు చాలామంది క‌మ‌ల‌నాథుల‌కు తెగ కోపం వ‌చ్చేస్తుంది.మ‌రి.. త‌మ నేత‌ను ఏమైనా అంటే గ‌య్యిమ‌నే నేత‌లు.. అవ‌త‌ల పార్టీకి చెందిన నేత‌ల్ని కూడా అంతే గౌర‌వంగా.. మ‌ర్యాద‌గా మాట్లాడితే గొడ‌వే ఉండ‌దు.

అలా చేయ‌కుండా అదే ప‌నిగా నోటికి ప‌ని చెప్ప‌టం.. మ‌న‌సుకు తోచింది మాట్లాడేయ‌టం ఒక అల‌వాటుగా మారింద‌ని చెప్పాలి. తాజాగా కాంగ్రెస్ పార్టీలో కీల‌క బాధ్య‌త‌లు చేప‌ట్టేందుకు సోనియా కుమార్తె ప్రియాంక వాద్రా ఓకే చెప్పార‌న్న వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఆమె రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌టంపై కాంగ్రెస్ నేత‌లు ఆనందం వ్య‌క్తం చేస్తూ.. ఆమెను ఆకాశానికి ఎత్తేసేలా వ్యాఖ్య‌లు చేస్తున్నారు.

ఇక‌.. కాంగ్రెస్ పార్టీ అయితే.. ఆమె ఇమేజ్ ను భారీగా పెంచేందుకు వీలుగా గ‌డిచిన మూడు రోజులుగా సోష‌ల్ మీడియాలో చేస్తున్న ప్ర‌య‌త్నాలు అన్ని ఇన్ని కావు. ఇలాంటివేళ‌.. బిహార్ అధికార‌ప‌క్ష నేత‌ల రియాక్ష‌న్ అభ్యంత‌ర‌క‌రంగా ఉండ‌ట‌మే కాదు.. ప్రియాంక‌ను చుల‌క‌న చేసేలా ఉన్నాయి. బిహార్ మంత్రి వినోద్ నారాయ‌ణ్ ఝూ సంగ‌తే తీసుకుంటే.. ఆయ‌న ప్రియాంక అందచందాల మీద అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేసేశారు. రాజ‌కీయాల‌కు అందానికి సంబంధం ఏమిట‌న్న ప్ర‌శ్న ఒక‌టైతే.. అస‌లు ఆ కోణంలో ప్రియాంక‌ను ఎందుకు చూడాల‌న్న‌ది మ‌రో ప్ర‌శ్న‌. ఇంత‌కీ ఆయ‌న ఏమ‌న్నారంటే.. ప్రియాంక అంద‌మైన బొమ్మ మాత్ర‌మేన‌ని.. ఆమెకు రాజ‌కీయంగా ఎలాంటి నైపుణ్యం లేద‌ని వ్యాఖ్యానించారు. అక్క‌డితో ఆగ‌ని ఆయ‌న‌.. ప్రియాంక అంద‌మైన ముఖాన్ని చూసి జ‌నం ఓటేయ్య‌ర‌న్నంత వ‌ర‌కూ వెళ్లిపోయారు.

అంతేకాదు.. ఆమె భూక‌బ్జాలు.. అవినీతి కేసుల్లో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న రాబ‌ర్ట్ వాద్రా భార్య అని.. ఆమె చాలా అందంగా ఉంటుందే కానీ ఆమెకు ఎలాంటి రాజ‌కీయ అనుభ‌వం.. టాలెంట్ లేదంటూ అభ్యంత‌ర‌క‌ర రీతిలో వ్యాఖ్య‌లు చేశారు. మంత్రి స్థానంలో ఉన్న వ్య‌క్తే ఇంత చౌక‌బారుగా మాట్లాడ‌ట‌మా అనుకుంటే.. ఆయ‌న‌కు మించిన‌ట్లుగా బిహార్ ఉప ముఖ్య‌మంత్రి సైతం వ్యాఖ్య‌లు చేయ‌టం గ‌మ‌నార్హం.

అవినీతి.. క‌ళంకిత మ‌నిషి రాబ‌ర్ట్ వాద్రా భార్య కాంగ్రెస్‌లో కీల‌క బాధ్య‌త‌లు చేప‌ట్ట‌టం బీజేపీకి లాభిస్తుంద‌ని వ్యాఖ్యానించారు. ఇందిరాగాంధీతో ప్రియాంక‌ను పోల్చ‌టం న‌వ్వు తెప్పిస్తోంద‌ని మండిప‌డ్డారు. రాబ‌ర్ట్ వాద్రా మీద ఆరోప‌ణ‌లు ఉన్నాయే కానీ ఇప్ప‌టివ‌ర‌కూ అవేమీ రుజువు కాలేద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు.
Tags:    

Similar News