విశాఖ వార్త : గండం నుంచి గ‌ట్టెక్కిన అశోక్ ! థాంక్యూ జ‌గ‌న్ !

Update: 2022-05-04 03:35 GMT
ఎన్నో త‌ప్పులు దిద్దుకుంటే ఓ ప్ర‌భుత్వం నిల‌దొక్కుకుంటుంది. మాన్సాస్ ట్ర‌స్ట్ విష‌య‌మై కానీ సింహాచ‌లం దేవ‌స్థానం విష‌య‌మై కానీ జ‌గ‌న్ స‌ర్కారు త‌ప్పులు దిద్దుకునేందుకు న్యాయ స్థానం అవ‌కాశం ఇచ్చింది. దీంతో జ‌గ‌న్ స‌ర్కారు పున‌రాలోచ‌న‌లో ప‌డింది. ఫ‌లిత‌మే మ‌ళ్లీ చైర్మ‌న్ గిరీని ద‌క్కించుకున్నారు సింహాచ‌లం ఆల‌యంలో !ఆ  ట్ర‌స్టీ చైర్మ‌న్ గా నిన్న‌టి వేళ స్వామి స‌న్నిధిలో మ‌ళ్లీ మునుప‌టి గౌర‌వం అందుకున్నారు. పోగొట్టుకున్న చోటే రాబ‌ట్టుకోవ‌డం .. భ‌గ‌వంతుడి దీవెన‌లు అందుకోవ‌డం ఇప్పుడిక అశోక్ వ‌ర్గం ఆనందానికి అవ‌ధులు లేకుండా చేస్తుంది. వీళ్లంతా త‌మ‌లో పోరాట స్ఫూర్తిని నింపిన యువ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ కు ధ‌న్య‌వాదాలు చెబుతున్నారు. కృత‌జ్ఞ‌త‌లు చెల్లిస్తున్నారు. ఆ ఉత్త‌రాంధ్ర ఇల‌వేల్పు నార‌సింహ రూపానికి మొక్కులు చెల్లిస్తున్నారు.

విజ‌య‌న‌గ‌రం కేంద్రంగా రాజులుంటారు. ఉన్నారు. ఆ క‌థ‌లో అశోక్ గ‌జ‌ప‌తి రాజు (బాగా చ‌దువుకున్నవారు, కామ‌ర్స్ తెలిసిన వారు) ఉన్నారు. ఆ క‌థలో ఇంకెంద‌రో చొర‌బ‌డ్డారు కూడా ! అయినా స‌రే ! సింహాచ‌లం దేవ‌స్థానం ట్ర‌స్టీ చైర్మ‌న్ ప‌ద‌విని ఎన్నో న్యాయ‌ప‌రమైన అడ్డంకులు ఎదుర్కొని అధిరోహించారు. అంతేకాదు ఆయ‌న మ‌రో ఆల‌యానికి కూడా ట్ర‌స్టీ చైర్మ‌న్ హోదాలోనే ఉన్నారు. అదే రామ‌తీర్థాల చెంత ఉన్న ఆల‌యం. ఇది కూడా పునః ప్ర‌తిష్ఠ‌కు ఇటీవలే నోచుకుంది.

ఏదైతేనేం జ‌గ‌న్ స‌ర్కారు మ‌ళ్లీ విజ‌య‌న‌గ‌రం రాజు గెలుపున‌కు కార‌ణం అయింది. ఆవిధంగా ఆ రోజు ఆయ‌న గురించి ఎంతో త‌ప్పుడు భావంతో మాట్లాడిన వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ (అప్ప‌టి దేవాదాయ ధ‌ర్మాదాయ శాఖ మంత్రి) ఇవాళ ఇంటికే ప‌రిమితం అయ్యారు.  అదేవిధంగా ఇంకొంద‌రు కూడా ! దేవుడు త‌న‌ను గెలిపిస్తాడ‌ని ప‌దే ప‌దే చెప్పిన అశోక్ గ‌జ‌ప‌తి రాజు ఇవాళ నిజ‌మ‌యిన విజేత. ఈ చందనోత్స‌వం ఆయ‌న ఆనందాల‌కు ప్ర‌తీక. నిన్న‌టి వేడుక‌కు టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి దంప‌తులు కూడా విచ్చేశారు.

దేవ దేవుడి స‌న్నిధిలో కొన్ని రోజుల కిందట కొన్ని మార్పులు జ‌రిగాయి. న్యాయ స్థానం కూడా ఆ మార్పుల‌కు కార‌ణం. మ‌నుషులు ఎలా ఉన్నా దేవుడు క్ష‌మిస్తాడు. దేవుడు మ‌నమేం చేసినా భ‌రిస్తాడు. కొన్ని సార్లే క‌దా త‌ప్ప‌లు దిద్దుకునే అవ‌కాశం ఇస్తాడు. దిద్దుకుంటున్నామా మ‌నం అని ఆలోచిస్తే చాలు అనాలోచిత నిర్ణయాలు అన్నీ తొల‌గిపోతాయి. ఆవేశ పూరిత నిర్ణ‌యాలు అన్నీ తొల‌గిపోతాయి. దిద్దుబాటుకు  నోచుకుంటాయి అని రాయాలి. చంద‌నోత్స‌వ వేళ (అంటే మే 3, 2022) కొన్ని మంచి మార్పులు జ‌రిగాయి. స్వామి స‌న్నిధిలో ఓ రోజు ఎన్నో అవ‌మానాలు ఎదుర్కొన్న విజ‌య‌న‌గ‌రం జిల్లా ఎంపీ అశోక్ గ‌జ‌ప‌తి రాజు ఆల‌య ట్ర‌స్టీ హోదా ను అనూహ్యంగా కోల్పోయారు.

ట్రస్టుకు చైర్మ‌న్ గా అనూహ్య రీతిలో సంచ‌యిత‌ను తీసుకుని వ‌చ్చారు. తెలివిగా  కొంత వివాదం కూడా న‌డిపారు ఆ రోజు కొంద‌రు. ఆయా సంద‌ర్భాల్లో అశోక్ గ‌జప‌తి రాజు సంయమ‌న‌మే పాటించారు. స‌హ‌న మంత్ర‌మే ప‌ఠించారు. వాటి ఫ‌లితాల‌ను నిన్న‌టి వేళ అందుకున్నారు.

ఆ రోజు ట్ర‌స్ట్ చైర్మ‌న్ గా ఆనంద గ‌జ‌ప‌తి రాజు కుమార్తె ను త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకుని వివాదం న‌డిపిన వారు ఇప్పుడు నిశ్శ‌బ్దం అయిపోయారు. నిన్న‌టి వేళ అశోక్ గ‌జ‌ప‌తి రాజు దంప‌తులు స్వామికి చంద‌నం సమ‌ర్పించి పూర్వ వైభ‌వాన్ని మ‌ళ్లీ ఆల‌యానికి ప్ర‌సాదించమ‌ని వేడుకున్నారు. కొన్నే జీవితంలో ఆగి ఉంటాయి.. కొన్నే జీవితాన ఆగి ముందుకు  సాగి వెళ్తాయి. న్యాయ‌పోరాటంలో అశోక్ గ‌జ‌ప‌తి రాజు గెలిచారు.
Tags:    

Similar News