సరస్వతీ పవర్ భూములను పరిశీలించిన పవన్.. కీలక వ్యాఖ్యలు!

అవును.. పల్నాడు జిల్లా మచవరం మండలంలోని సరస్వతి పవర్ భూములను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరిశీలించారు.

Update: 2024-11-05 11:21 GMT

ఇటీవల కాలంలో జగన్, షర్మిల ఆస్తుల వ్యవహారం తెరపైకి వచ్చిన సమయంలో... సరస్వతీ పవర్ గురించి తీవ్ర చర్చ జరిగిన సంగతి తెలిసిందే. దీంతో.. సరస్వతీ పవర్ కు సంబంధించిన భూములపై పవన్ దృష్టి సారించారు. ఈ సమయంలో తాజాగా పల్నాడు జిల్లాలో పర్యటించిన ఆయన... సరస్వతీ పవర్ భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

అవును.. పల్నాడు జిల్లా మచవరం మండలంలోని సరస్వతి పవర్ భూములను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరిశీలించారు. ఈ సమయంలో ఆయన వెంట ఎమ్మెల్యె యరపతినేని శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్, అటవీ అధికారులు, రెవెన్యూ అధికారులు ఉన్నారు. ఈ సమయంలో సరస్వతి పవర్ భూములను పరిశీలించిన పవన్... అనంతరం మాట్లాడారు.

ఈ సందర్భంగా... వేమవరంలో 710.6 ఎకరాలు, చెన్నాయపాలెంలో 273 ఎకరాలు, పిన్నెల్లి గ్రామంలో 93.79 ఎకరాలు, తంగేడు గ్రామంలో 107.36 ఈ విధంగా మొత్తం రైతాంగం దగ్గర కొన్నది 1180 ఎకరాలని.. ఇందులో 24 ఎకరాల అసైన్డ్ భూమి ఉందని, అందులో 20 ఎకరాలు వేమవరంలోనె ఉన్నట్లు అధికారులు గుర్తించారని పవన్ తెలిపారు.

ఇదే సమయంలో పట్టాభూములు ఏదీ కూడా ఇష్టపడి అమ్మలేదని.. భయపడి తీసుకున్నారని అన్నారు. సగానికి సగం మంది భయపెట్టి, బాంబులేసి, దాడులు చేసి భూములు లాక్కున్నారని అన్నారు. ఈ సమయంలో మీకు భరోసా ఇవ్వడానికి వచ్చినట్లు చెప్పిన పవన్.. తీసుకున్న భూమి కాకుండా మరో 350 ఎకరాల పైచిలుకు ఫ్యాక్టరీ కోసం తీసుకున్నారని అన్నారు.

ఈ క్రమంలో... ఇక్కడున్న 400 ఎకరాల అటవీ భూమి ఉందని, దాన్ని రెవెన్యూ భూమిగా మార్చేసి వాళ్లు తీసేసుకున్నారని.. ఈ విషయం స్థానిక ప్రజలంతా చెబుతున్నారని పవన్ చెప్పుకొచ్చారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని తాను కలెక్టర్ కు ఆదేశిస్తున్నట్లు పవన్ తెలిపారు. 30 సంవత్సరాలు లీజు తీసుకున్న భూమిని, జగన్ సీఎం అయ్యాక 50 సంవత్సరాలు లీజుగా మార్చారని తెలిపారు.

ఇదే సమయంలో... సిమెంట్ ఫ్యాక్టరీ అంటే అనుమతులు వస్తాయో లేదో అని.. పవర్ ప్లాంట్ కింద అనుమతులు తీసుకున్నారని.. ఇదే సమయంలో కృష్ణాజలాలను కూడా తీసుకునేలాగా అనుమతులు ఇచ్చుకున్నారని అన్నారు. కట్టని సిమెంట్ ఫ్యాక్టరీకి 196 కోట్ల లీటర్ల నీరు.. అంటే 700 ఎకరాలకు సరిపోయే నీళ్లు తీసుకున్నారని విమర్శించారు!

Tags:    

Similar News