ఒకే ఏకగ్రీవ ప్రెసిడెంట్.. ఎవరైనా 2సార్లే.. అమెరికా ఎన్నికల స్పెషల్

ఆర్థికంగానే కాదు.. భౌగోళికంగానూ ప్రపంచంలో పెద్ద దేశమైన అమెరికా చరిత్రలో ఏ పార్టీకీ ప్రాతినిధ్యం వహించని ఏకైక అధ్యక్షుడు జార్జ్‌ వాషింగ్టన్‌.

Update: 2024-11-05 12:30 GMT

అమెరికా అంటే అగ్ర రాజ్యం.. ప్రపంచంలోని చాలామందికి కలల రాజ్యం.. సూపర్ పవర్ లాంటి అమెరికాను పాలించే అధ్యక్షుడు ఇంకా సూపర్ పవర్ అనే చెప్పాలి. అలాంటి దేశం ఇప్పుడు ఎన్నికల సమరంలో నిలిచింది. ఒకవిధంగా చెప్పాలంటే ప్రస్తుత ఎన్నికలు అమెరికా చరిత్రను తిరగరాసేవి. ఓవైపు ప్రపంచ యుద్ధాలు.. మరోవైపు సొంత దేశంలో బ్యాంకింగ్ సంక్షోభం.. వీటి మధ్య అమెరికా పోషించాల్సిన పాత్ర చాలా ఉంది. అందుకే కాబోయే అధ్యక్షుడు/అధ్యక్షురాలి పాత్ర చాలా కీలకం కానుంది.

ఏకగ్రీవం ఒక్కసారే.. ఆయన తొలి..

ఆర్థికంగానే కాదు.. భౌగోళికంగానూ ప్రపంచంలో పెద్ద దేశమైన అమెరికా చరిత్రలో ఏ పార్టీకీ ప్రాతినిధ్యం వహించని ఏకైక అధ్యక్షుడు జార్జ్‌ వాషింగ్టన్‌. ఆ దేశానికి ఇప్పటివరకు ఏకగ్రీవంగా ఎన్నికైన ఏకైక అధ్యక్షుడు కూడా ఆయనే. కాగా, 235 ఏళ్ల కిందట అంటే.. 1789లో జార్జ్ వాషింగ్టన్‌ అమెరికా తొలి అధ్యక్షుడిగా ప్రమాణం చేశారు. కాగా, ఇప్పటివరకు 45 మంది అమెరికాకు అధ్యక్షులుగా చేశారు. బైడెన్‌ 46వ వారు.

నాలుగేళ్లకు ఎన్నికలు..

అన్ని ప్రజాస్వామ్య దేశాల్లో ఐదేళ్లకు ఎన్నికలు జరిగితే అమెరికాలో మాత్రం నాలుగేళ్లకే. 1845లో అమెరికా కాంగ్రెస్‌ చేసిన చట్టం ప్రకారం నవంబరు తొలి సోమవారం తర్వాత వచ్చే మంగళవారం రోజున ఈ ఎన్నిక ఉంటుంది. అప్పట్లో అమెరికా వ్యవసాయాధారితం. నవంబరులో పంట కాలం పూర్తి అవుతుంది. అందుకే ఈ నెలను ఎన్నికలకు ఎంచుకున్నారు. మొదట్లో ఆదివారం ఎన్నికలు నిర్వహించాలని అనుకున్నా.. ఆ రోజు అందరూ చర్చికి వెళ్తారు. బుధవారం సంత జరుగుతుంది. కాబట్టి సోమవారం ప్రయాణించి మంగళవారం పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటు వేసేలా ఈ రోజును ఓటింగ్ కు నిర్ణయించారు.

ఎవరైనా రెండుసార్లే..

భారత్, రష్యా సహా చాలా దేశాల్లో అధ్యక్షుడు ఐదేళ్లు పదవిలో ఉంటారు. అమెరికాలో మాత్రం పదవీకాలం నాలుగేళ్లే. అదికూడా రెండుసార్లు మించి ఉండడానికి వీల్లేదు. వాషింగ్టన్‌ తర్వాతనే ఈ నిబంధన అమల్లోకి వచ్చింది. విశేషం ఏమంటే.. ఇది చట్టబద్ధమైనదేమీ కాదు. సంప్రదాయం మాత్రమే. కాగా, ఫ్రాంక్లిన్‌ డెలానో రూజ్‌ వెల్ట్‌ (ఎఫ్‌ డీఆర్‌) సమయంలో ఈ సంప్రదాయానికి గండి పడింది. 1933లో అమెరికా 32వ అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన 1945 దాకా.. అంటే నాలుగు సార్లు పదవిలో కొనసాగారు. ఈయన ఒక్కరే నాలుగుసార్లు అధ్యక్షుడు అయ్యారు. 1945లో పదవిలో ఉంటూనే రూజ్ వెల్ట్ చనిపోయారు. దీంతో ఇకపై ఎవరూ రెండుసార్లకు మించి అధ్యక్షుడు కాకుండా 22వ రాజ్యాంగ సవరణ చేపట్టారు.

2000లో రంగులు మారాయి..

అమెరికాలో రెండే ప్రధాన పార్టీలు రిపబ్లికన్, డెమోక్రాట్. వీరిలో రిపబ్లికన్లను ఎర్ర రంగు, డెమోక్రాట్లను బ్లూ రంగుతో ప్రతిబింబిస్తుంటారు. అయితే, ఇవి వారి రంగులు కావు. టెలివిజన్లు ఈ రెండు పార్టీల ఆధిక్యాన్ని చూపడానికి అనువుగా వాడిన రంగులు మాత్రమే. మొదట ఈ రంగులను ఇష్టం వచ్చినట్లు మార్చేవారు. అయితే, అమెరికాలో అత్యంత హోరాహోరీ, వివాదాస్పదంగా సాగిన 2000 నాటి ఎన్నికల్లో ఫలితాలకు చాలా రోజులు పట్టింది. ప్రపంచం ముందు అమెరికా చిన్నబోయింది. దీంతో పార్టీల ఆధిక్యాన్ని చూపేందుకు స్థిరమైన రంగులను వాడాల్సి వచ్చింది. రిపబ్లికన్లకు ఎరుపు, డెమోక్రాట్లకు బ్లూ రంగు అలా స్థిరపడ్డాయి. అమెరికా అధ్యక్షుడు ఉండే భవనాన్ని శ్వేత సౌధం (వైట్‌ హౌస్‌) అంటారు. ఇది 1901 తర్వాత మాత్రమే. అంతకుముందు ప్రెసిడెంట్ ప్యాలెస్, ప్రెసిడెంట్ బిల్డింగ్ అనేవారు. 1901లో థియోడర్‌ రూజ్‌ వెల్ట్‌ అధ్యక్షుడు అయ్యాక వైట్‌ హౌస్‌ అని పేరు పెట్టారు.

ఏనుగు, గాడిద ఇలా పుట్టాయి

రిపబ్లికన్ల చిహ్నం ఏనుగు, డెమోక్రాట్ల చిహ్నం గాడిద. రాజకీయ కార్టూనిస్టు థామస్‌ నాష్‌ వ్యంగ్యంగా చూపేందుకు 1874లో ఇలా కార్టూన్‌ వేశారు. అయితే, అనూహ్యంగా పార్టీలకు అవి గుర్తులుగా మారిపోయాయి. అమెరికాలో ఎవరికైనా రూల్ ఒకటే. ఇంటికి రెండు కార్లు ఉండే దేశం అది. కాగా18వ అధ్యక్షుడు యులిసిస్‌ గ్రాంట్‌ 1872లో గుర్రపు బగ్గీలో వేగంగా వెళ్తుండడంతో అడ్డుకొని 20 డాలర్ల జరిమానా విధించారు. అప్పట్లో ఇది భారీ మొత్తం కావడం గమనార్హం.

వ్యోమగాములకూ ఓటు

1997లో టెక్సాస్‌ రాష్ట్రం నాసా వ్యోమగాములకు అంతరిక్షం నుంచి ఓటు చేసే హక్కు కల్పించింది. ఆ ఏడాదే నాసా వ్యోమగామి డేవిడ్‌ వోల్ఫ్‌ ఓటు వేయడం గమనార్హం.

Tags:    

Similar News