వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాదట...!

Update: 2023-03-24 09:13 GMT
వైసీపీ అంటే కస్సుమని లేచే వారు బీజేపీలో ఒకాయన ఉన్నారు. ఆయనే విశాఖ ఉత్తర నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు. ఆయన తెల్లారి లేస్తే వైసీపీ మీద విమర్శలు చేస్తూ ఉంటారు. తాజాగా ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి పంచుమర్తి అనూరాధ విజయం సాధించడంతో రాజు గారికి ఎక్కడ లేని హుషార్ వచ్చేసింది.

ఏపీలో పట్టభద్రులు వివేచనతో మూడు చోట్ల వైసీపీని ఓడిస్తే ఇపుడు సొంత పార్టీలోని ఎమ్మెల్యేలే పార్టీని వ్యతిరేకించి క్రాస్ ఓటింగ్ చేసి మరీ ప్రజాస్వామ్యాన్ని కాపాడారు అని రాజు గారు తనదైన శైలిలో విశ్లేషించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్నో రకాల ప్రలోభాలను పెట్టినా జనాలు మాత్రం వైసీపీని ఓడించారని అన్నారు.

ఇపుడు సొంత పార్టీలో సైతం నియంతృత్వ పోకడలను తట్టుకోలేకనే ఈ విధంగా క్రాస్ ఓటింగ్ చేసి విపక్ష ఎమ్మెల్సీ అభ్యర్ధిని గెలిపించారని రాజు గారు అంటున్నారు. వైసీపీది అవినీతి నియంతృత్వ పాలనగా ఆయన అభివర్ణించారు. అలాంటి పాలనకు వ్యతిరేకంగా టీడీపీ ఎమ్మెల్యే విజయం సాధించడం అంటే అది ఆమె గొప్పతనం అని టీడీపీ ఎమ్మెల్సీకి ఆయన అభినందనలు తెలిపారు.

ఈక్ ఏపీలో వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాదని రాజు గారు జోస్యం ముందే చెప్పేశారు. 2024లో కచ్చితంగా వైసీపీ ఓటమి పాలు అవుతుందని ఇది తధ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మరి వైసీపీ ఓడితే వచ్చేది బీజేపీ జనసేన ప్రభుత్వమా లేక బీజేపీ జనసేన టీడీపీ కూటమా అన్నది మాత్రం ఆయన చెప్పలేదు.

నిజానికి రాజు గారు పొత్తులను కోరుకుంటున్నారు అనే చెబుతారు. వైసీపీకి యాంటీగా అన్ని పార్టీలు కలసి పోటీ చేయలని ఆయన అంటారు. అలా చూసుకుంటే కూటమి వస్తుందనే ఆయన భావనగా చూడాలి. అయితే ఏపీలో బీజేపీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడానికి ఇష్టపడడంలేదు. రాజు గారు మాత్రం కాస్తా భిన్నంగా మాట్లాడుతున్నారు.

ఆయన పార్టీ మారుతారు అని అప్పట్లో ప్రచారం జరిగింది. ఇపుడు తెలుగుదేశాన్ని తెగ మెచ్చుకుంటున్నారు అంటే మరి ఆయన ఏమైనా సైకిలెక్కుతారా అన్నది కూడా చూడాలని అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News