వైసీపీకి మ‌ద్ద‌తిస్తున్న బీజేపీ నేత‌

Update: 2017-03-28 07:08 GMT
ఏపీలో మిత్ర‌ప‌క్షాలైన టీడీపీ-బీజేపీల మ‌ధ్య మితృత్వం ఒకింత బీటలు వారుతోందా? ప‌్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టే విష‌యాల్లో ప్ర‌తిప‌క్ష వైసీపీకి బీజేపీ ఎందుకు మ‌ద్ద‌తు ఇస్తోంది? రాష్ట్రంలో పెద్ద ఎత్తున అవినీతి జ‌రుగుతోందంటూ సాక్షాత్తు బీజేపీ శాస‌న‌స‌భా ప‌క్ష నేత ఆరోప‌ణ‌లు చేయ‌డంలో మ‌ర్మ‌మేంటి? ఇవి ఏపీలో హాట్ టాపిక్ చ‌ర్చ‌లు. తాజాగా అసెంబ్లీ స‌మావేశాల్లో ఇదే జ‌రిగింది. ఆర్టీఏ అధికారుల‌పై దాడిని నిర‌సిస్తూ అసెంబ్లీ గేటు బయట నిరసన వ్యక్తం చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డికి బీజేపీ శాసన సభ్యుడు విష్ణుకుమార్ రాజు నుంచి ఊహించని మద్దతు లభించింది.

అసెంబ్లీ ప్రాంగ‌ణం వ‌ద్ద విష్ణుకుమార్ రాజు కారు దిగి లోప‌లికి వెళ్తున్న స‌మ‌యంలో నిరసన వ్యక్తం చేస్తున్న చెవిరెడ్డిని చూసి ఆగారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ తప్పు చేసింది ఎవరైనా శిక్షించాలని, అధికారులపై దాడులు చేయడం సరికాదన్నారు. ప్రజాప్రతినిధులతో అధికారులు మర్యాదపూర్వకంగా ఉండాలని కోరారు. ఎంపీ - ఎమ్మెల్యేలు క్షమాపణ చెప్పడం కొంత నయమని విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారు. అనంత‌రం స‌భ‌లో విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో పెట్టే అవినీతి ఆరోప‌ణ‌లు చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో విశాఖపట్టణం పరిసరాల్లో రెండువేల కోట్ల రూపాయలు పైగా విలువైన భూకుంభకోణం జరిగిందని దీనిపై తక్షణం శాసనసభా సంఘం లేదా సీఐడీచే విచారణ జరిపించాలంటూ విష్ణుకుమార్‌ రాజు డిమాండ్ చేశారు. ఈ కుంభకోణం వెనుక వివిధ స్థాయిల్లోని ఐఎఎస్, ఐపిఎస్ అధికారులు, రాజకీయ నేతలు, మాజీ ప్రతినిధులు, ముఖ్యంగా పాలకుల్లో కొందరు చివరకు న్యాయవ్యవస్థలో కొందరి అండదండలు ఉండటం వలనే గడచిన రెండేళ్లుగా తాము నెత్తీనోరు కొట్టుకుంటున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందంటూ నిప్పులు చెరిగారు. ఈ విషయంలో తనకు సైతం బెదిరింపులు వస్తున్నాయంటూ దీనికి తాను ఏ మాత్రం బెదరనన్నారు.

విశాఖ‌లో జ‌రిగి ఈ భారీ కుంభకోణానికి పార్టీ ఏదైనా ప్రభుత్వంలో ఎంతో పలుకుబడి కల్గిన హైదరాబాద్ జలవిహార్‌కు చెందిన నడింపల్లి వెంకట రామరాజు కారకుడంటూ అసైన్డ్ భూముల రైతులకు ఆయన పేర జారీ అయిన చెక్‌లు, అగ్రిమెంట్ల కాపీలను సభలో ప్రదర్శించారు. విశాఖ పట్టణాభివృద్ధి సంస్థ భూసమీకరణ చేపట్టేలా కొందరు పెద్దలు ప్రభుత్వంలో తమ పలుకుబడి వినియోగించి తొలుత 2016 నవంబర్ 14 తేదీన జీవో 290ను జారీ చేయించారన్నారు. పైగా అసైన్డ్ భూములను విక్రయించుకునే వీలు కల్పించారన్నారు. దీంతో ఆ ఘరానా పెద్దలు పెందుర్తి, ఆనందపురం మండలాల్లో దాదాపు వెయ్యి ఎకరాల విలువైన భూములను చేజిక్కించుకున్నారంటూ నాడు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను సభలో ప్రదర్శించారు. అయితే దీనికి స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అడ్డుతగులుతూ వార్తా కథనాలు ఆధారంగా సభలో ప్రస్తావించవద్దన్నారు. దీనికి విష్ణుకుమార్ రాజు బదులిస్తూ జాతీయ ప్రధాన రహదారుల వెంబడి గల భూములపై కన్నేసిన కొందరు పెద్దలు వక్రమార్గాల్లో వాటిని రైతుల దగ్గర నుంచి కాజేసేందుకు రంగంలోకి దిగారని అందుకే స‌వివ‌రంగా తెలియ‌జేశాన‌ని వెల్ల‌డించారు.

దీనిపై పురపాలకశాఖ మంత్రి పి.నారాయణ బదులిస్తూ ముడపాక గ్రామంలో రాము అనే వ్యక్తి అసైన్డ్ భూ యజమానుల నుంచి బలవంతంగా ఒరిజినల్ పట్టాలు, పట్టాదారు పాస్ పుస్తకాలు, హక్కు దస్తావేజులు, అసలు దస్తావేజులను తన దగ్గరే ఉంచుకున్నారంటూ 2017 ఫిబ్రవరిలో ఫిర్యాదులు రాగా అతనిపై పెందుర్తి పోలీస్ స్టేషన్‌లో వివిధ సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేశారన్నారు. రాయితీ భూముల పట్టాదారు భూ ధ్రువపత్రాలు కల్గినవారికి స్థలాల కేటాయింపు జరిగినప్పుడు అసైన్డ్ భూములకు సంబంధించి అసలైన అసైనీలకే అందచేస్తామంటూ హామీనిచ్చారు. కాగా ప్ర‌తిపక్షం స్థాయిలో మిత్ర‌ప‌క్ష శాస‌న‌స‌భా ప‌క్ష నేత అవినీతి ఆరోప‌ణ‌లు గుప్పించ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News