రాజుగారి రూట్ మారిన‌ట్టేనా?

Update: 2019-03-07 09:13 GMT
ఏపీలో భార‌తీయ జ‌న‌తా పార్టీ అంత‌కంత‌కూ క్షీణిస్తున్న ప‌రిస్థితులు చాలా స్ప‌ష్టంగానే క‌నిపిస్తున్నాయి. గ‌తంలో బీజేపీలో ఉన్న నేత‌లు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా... పార్టీనే అంటిపెట్టుకుని ఉండేవారు. అయితే కాలం మారింది. దానితో పాటే క‌మ‌ల‌నాథుల వైఖ‌రీ మారిపోతోంద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఈ వాద‌న‌కు బ‌లం చేకూరుస్తున్న‌ట్లుగా ఇటీవ‌ల ఏపీ బీజేపీ శాఖ‌కు చెందిన ప‌లువురు నేత‌లు ఇత‌ర పార్టీల వైపు చూస్తున్నారు. ఇప్ప‌టికే ఇద్ద‌రు ఎమ్మెల్యే స్థాయి నేత‌లు బీజేపీకి షాకిచ్చి ఇత‌ర పార్టీల్లో చేర‌గా.... ఇప్పుడు మ‌రో ఎమ్మెల్యే, ఏపీ అసెంబ్లీలో బీజేపీ ఫ్లోర్ లీడ‌ర్ గా ఉన్న విష్ణుకుమార్ రాజు కూడా అదే బాట‌న ప‌య‌నిస్తున్నారు.

గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో టీడీపీతో పొత్తు కార‌ణంగా రెండు ఎంపీ సీట్ల‌తో పాటు నాలుగు అసెంబ్లీ సీట్ల‌ను బీజేపీ గెలుచుకోగా... టీడీపీతో మైత్రి చెడిపోయిన నేప‌థ్యంలో మాజీ మంత్రి కామినేని శ్రీ‌నివాస్ అధికార టీడీపీలో చేర‌గా... మ‌రో ఎమ్మెల్యే ఆకుల స‌త్య‌నారాయ‌ణ జ‌న‌సేన‌లో చేరిపోయారు. తాజాగా ఇప్పుడు విశాఖ ప‌శ్చిమ ఎమ్మెల్యేగా ఉన్న విష్ణుకుమార్ రాజు అధికార పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నార‌న్న వాద‌న వినిపిస్తోంది. చాలా కాలం నుంచే ఈ ఊహాగానాలు వినిపిస్తున్నా... తాను బీజేపీని వీడేది లేద‌ని చెబుతున్న విష్ణు నేటి ఉద‌యం ఉండ‌వ‌ల్లికి వ‌చ్చి టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడితో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీ సుమారు అర‌గంట‌కు పైగానే సాగింది. ఇప్ప‌టికే విశాఖ జిల్లాకు సంబంధించి రాజ‌కీయంగా చాలా మార్పులే చోటుచేసుకున్నాయి. అన‌కాప‌ల్లి ఎంపీ అవంతి శ్రీ‌నివాస్ ఇటీవ‌లే అధికార పార్టీకి చేయిచ్చేసి వైసీపీలో చేరిపోయారు.

ఎన్నిక‌ల‌కు స‌మాయ‌త్త‌మ‌వుతున్న ప్ర‌స్తుత త‌రుణంలో అనకాప‌ల్లి లాంటి కీల‌క స్థానం నుంచి పోటీ చేయాల్సిన సిట్టింగ్ ఎంపీ చేయిస్తే... ఏ పార్టీకి అయినా చాలా ఇబ్బందికర ప‌రిస్థితేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఈ లోటును పూడ్చుకునేందుకు టీడీపీ త‌న‌కు అందుబాటులో ఉన్న అన్ని ప్ర‌త్యామ్నాయాల‌ను ప‌రిశీలిస్తున్న‌ట్లుగా స‌మాచారం. ఈ క్ర‌మంలోనే విష్ణును అమ‌రావ‌తికి పిలిపించినట్లుగానూ వార్త‌లు వినిపిస్తున్నాయి. అన‌కాప‌ల్లి ఎంపీ సీటు నుంచి పోటీ చేయాల‌ని విష్ణుకు చంద్ర‌బాబు సూచించిన‌ట్లుగానూ వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే ఈ విష‌యంపై గానీ. చంద్ర‌బాబుతో భేటీలో ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చిన అంశాల‌పై గానీ విష్ణు నోరు విప్ప‌లేదు. దీంతో అసలు లోప‌ల ఏం జ‌రిగింది? ఏ త‌ర‌హా చ‌ర్చ‌లు జ‌రిగాయి?  విష్ణు ఫ్యూచ‌ర్ ప్లాన్ ఏమిటి? అనేది తెలియాల్సి ఉంది.


Tags:    

Similar News