వైజాగ్ స్టీల్ : ఆ ఉద్య‌మం ఆగిందా ?

Update: 2022-08-01 23:30 GMT
విశాఖ స్టీల్ ప్లాంట్ ప‌రిర‌క్షణ కోసం గ‌త ఏడాది ఇదే స‌మయాన ఆంధ్రా క‌మ్యూనిస్టులు నిన‌దించారు. ఢిల్లీ వీధుల్లో 2021, ఆగ‌స్టు 2,3 తేదీల్లో అప్ప‌టి సమ‌యాన క‌రోనాకు కూడా ప‌ట్టించుకోకుండా ఉద్య‌మించారు. నాటి ఉద్య‌మానికి ఇక్క‌డి నుంచి బ‌య‌లుదేరిన వారికి ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లా వాసులు ఆహారం అందించి మద్దతుగా నిలిచారు. కానీ ఇప్పుడు ఉద్య‌మం ఏమ‌యింది. ఏ స్థాయిలో ఉంది. మ‌హమ్మారి విజృంభిస్తున్న వేళ మాట్లాడిన క‌మ్యూనిస్టులు ఎందుక‌ని సైలెంట్ అయిపోయారు.

ఈ  వాన‌కాల స‌మావేశాల్లో అయినా మ‌న ఎంపీలు అన‌గా వైసీపీ ఎంపీలు కాస్త‌యినా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్ర‌యివేటీకర‌ణ వద్ద‌ని గొంతు వినిపిస్తే ఎంత బాగుండు. కానీ అవేవీ జ‌ర‌గ‌డం లేదు. స్టీల్ ప్లాంట్ ఆస్తుల‌పై క‌న్నేసిన ప్ర‌బుద్ధుల‌కూ, ఉద్యోగ సంఘాల నాయ‌కులకూ మధ్య ఏమ‌యినా ఒప్పందాలు జ‌రిగి ఉన్నాయా అన్న అనుమానాలు కూడా  అప్ప‌ట్లో బాగానే వినిపించాయి. ఫ్యాక్ట‌రీ ప్ర‌యివేటీక‌ర‌ణ అనగానే ఉత్ప‌త్తి సామర్థ్యం ఒక్క‌సారిగా అంటే అనూహ్యంగా పెంచి కార్మికులు మంచి ప్ర‌శంస‌లు అందుకున్నారు కేంద్రం నుంచి ! కానీ ఏం జ‌రిగినా కూడా అప్పుల్లో ఉన్న విశాఖ స్టీల్ ను అమ్మేయ‌డం ఒక్క‌టే మార్గ‌మ‌ని కూడా ఇదే స‌మ‌యాన కేంద్రం చెప్ప‌డం కూడా మ‌రిచి పోకూడ‌దు.

ఈ క్ర‌మంలో కేసీఆర్ (తెలంగాణ సీఎం) తో స‌హా  తెలంగాణ ఎంపీలు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్ర‌యివేటు వ్య‌క్తుల‌కు (అదానీ లాంటి కార్పొరేట్ల‌కు) ఆర్థిక అవ‌స‌రాల రీత్యా, స్వీయ ప్ర‌యోజ‌నాల రీత్యా అమ్మేస్తే రేప‌టి వేళ సింగ‌రేణి బొగ్గు గ‌నుల‌కూ ప్ర‌యివేటీక‌ర‌ణ జాడ్యం అంటించ‌ర‌ని ఏంటి న‌మ్మ‌కం అని గొంతు వినిపించారు.  

కేంద్రం ప‌రిధిలో ఉండే శాఖ‌ల‌న్నింటినీ ఒక్కొక్క‌టిగా ప్ర‌యివేటీక‌ర‌ణ చేసి ఆర్థిక భారం వ‌దిలించుకునే ప్ర‌య‌త్నం చేయ‌డం అస్స‌లు త‌గ‌ని ప‌ని, ఈవిష‌య‌మై రేగుతున్న ఉద్య‌మాల‌కు తాము మ‌ద్ద‌తిస్తామ‌ని , ఏపీకి అండ‌గా ఉంటామ‌ని కూడా కేసీఆర్ చెప్పారు.

అంతేకాదు విభ‌జ‌న చ‌ట్టం అమ‌లుకు సంబంధించి ఏపీకి ఆయ‌న అండ‌గానే ఉంటామ‌న్నారు. ఇంత‌గా పొరుగు తెలుగు రాష్ట్ర ప్ర‌తినిధులు మాట్లాడుతున్నా కూడా మ‌న ఎంపీల‌లో మాత్రం  చ‌లనం లేదు. వీలున్నంత వ‌ర‌కూ విశాఖ స్టీల్ ప్లాంట్ ఆస్తులను  అమ్మే క్ర‌మంలో వాటిని తమ ప‌ర‌ప‌తి  వినియోగించుకుని ద‌క్కించుకునేందుకే ప్ర‌ధాన పార్టీల‌కు చెందిన నాయ‌కులంతా ప‌న్నాగం ప‌న్నుతున్నార‌న్న ఆరోప‌ణ కూడా ఫ్యాక్టరీ ఉద్యోగ వ‌ర్గాల నుంచే వ‌చ్చింది.

ఇందుకు త‌మ సంఘ నాయ‌కులు కూడా వారితో ములాఖ‌త్ అయి ఉన్నార‌న్న అభియోగం కూడా వారి నుంచే విన‌వ‌చ్చింది. ఈ దశ‌లో క‌రోనా స‌మ‌యంలోనూ ఉద్య‌మించిన క‌మ్యూనిస్టులు కానీ ఇత‌ర ఉద్య‌మ పార్టీలు కానీ ఇవాళ  ఆశించిన స్థాయిలో త‌మ గొంతుక వినిపించ‌డం లేదు. రాజ‌ధాని ఉద్య‌మ విష‌య‌మై మాట్లాడిన టీడీపీ నే ఈ ఉద్య‌మం విష‌య‌మై కూడా మాట్లాడి పార్ల‌మెంట్ వేదిక‌గా కాస్తో కూస్తో కేంద్రాన్ని నిల‌దీసింది.

ఇదే స‌మ‌స్య‌పైయువ ఎంపీ కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు కూడా గ‌ణాంకాల‌తో స‌హా  వివరించి కేంద్రాన్ని ఇర‌కాటంలో పెట్టారు. న‌ష్టాల పేరిట ప్లాంటును అమ్మేయ‌డం స‌బబు కాద‌ని కూడా చెప్పారు. ఇవ‌న్నీ విన్న తెలుగింటి కోడ‌లు నిర్మ‌లా సీతారామన్ మాత్రం మ‌ళ్లీ మ‌ళ్లీ అదే పాట అన‌గా ప్ర‌యివేటీక‌ర‌ణ‌కు సంబంధించిన పాటే వినిపింప‌జేయ‌డం విచార‌కరం. ఇదే స‌మ‌యాన ఉద్య‌మం కూడా ఆశించిన స్థాయిలో న‌డ‌వ‌క‌పోవ‌డం కూడా మ‌రో విషాదం.
Tags:    

Similar News