విశాఖ తాకట్టు....కనికట్టు.... ?

Update: 2021-10-04 14:30 GMT
విశాఖ మహా నగరం. ఇది ఎవరూ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. విశాఖ ఉమ్మడి ఏపీలో కూడా హైదరాబాద్ తరువాత స్పీడ్ గా అభివృద్ధి చెందుతున్న సిటీగా అంతా గుర్తించారు. ఇక విభజన ఏపీలో విశాఖ నంబర్ వన్ నగరంగా ఉంది. మరో వైపు చూస్తే విశాఖ పట్ల నాడు చంద్రబాబు నేడు జగన్ కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. చంద్రబాబు విశాఖలో అన్ని జాతీయ అంతర్జాతీయ సెమినార్లూ నిర్వహించారు. ఇక ఏపీగా విడిపోయాక తొలి మంత్రివర్గ సమావేశం కూడా విశాఖలో చంద్రబాబు నిర్వహించారు. విశాఖ ఆర్ధిక రాజధాని అని చంద్రబాబు అంటే పరిపాలనా రాజధాని అని జగన్ అన్నారు. విశాఖ దశ మారుస్తామని జగన్ సర్కార్ అంటే జనం సంతోషించారు. ఎందుకంటే విశాఖకు రాజసం ఉంది. రాజధాని కళ కూడా ఉంది.

అయితే జగన్ విశాఖ రాజధానిగా ఇపుడు అమలు చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే అది న్యాయ సమీక్షలో ఉంది. సరే కోర్టు తీర్పు ఎపుడు వస్తే అది కూడా అనుకూలంగా వస్తేనే విశాఖ రాజధాని అవుతుంది. దాంతో జనాలు మెల్లగా చప్పబడిపోయారు. విశాఖ రాజధాని అభివృద్ధి అన్నీ కూడా ఇపుడు కొంత వెనక్కిపోయాయి. దాంతో పాటుగా జనం ఆశలు కూడా అణగారిపోయాయి అనే చెప్పాలి. ఇదిలా ఉంటే విశాఖకే కాదు, ఏకంగా ఏపీకే తలమానికంగా ఉన్న స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేస్తామని కేంద్రం గట్టిగా భీష్మించుకుని  కూర్చోవడంతో విశాఖ జనం మండుతున్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా అయిదారు లక్షల మంది జనాలకు ఉపాధితో పాటు మంచి బిజినెస్ కనెక్టివిటీకి రాచబాటగా ఉన్న స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం అయితే విశాఖ సహా ఉత్తరాంధ్రా జిల్లాల ప్రాభవం మసకబారుతుంది అని జనాలు ఆందోళన  పడుతున్నారు.

ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. జగన్ రెండు సార్లు కేంద్రానికి లేఖలు రాశారు. ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని కూడా కచ్చితంగా చెప్పారు. కానీ ఇంకా కేంద్రం మీద వత్తిడి పెంచాల్సి ఉందన్నది జనాల భావన. ఆ విషయంలో వైసీపీ సర్కార్ మెత్తగా మెతకగా ఉంటోంది అన్నది విశాఖ వాసుల భావన. ఇదిలా ఉండగానే విశాఖలోని ప్రభుత్వ స్థలాలను గుట్టు చప్పుడు కాకుండా తాకట్టు పెట్టడంతో జనాలు ఇంకా ఆగ్రహిస్తున్నారు. విశాఖ ఆస్తులను తాకట్టు పెట్టడం అంటే భవిష్యత్తులో చెలగాటం ఆడడమే అంటున్నారు. దీని మీద అపుడే విపక్షాలు గట్టిగా విమర్శలు చేస్తున్నాయి.

ఇన్నాళ్ళు మౌనంగా ఉన్న టీడీపీ సీనియర్ నేత,  మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అయితే ఇది తుగ్లక్ చర్య అంటున్నారు. ఉత్తరాంధ్రాలోని అన్ని రాజకీయ పార్టీలు రాజకీయాలకు అతీతంగా ముందుకు వచ్చి పోరాటం చేయకుంటే మాత్రం రేపటికి చూసుకునేందుకు ఏ ఆస్తీ కూడా మిగలదు అని అయ్యన్న అంటున్నారు. ఇక బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు అయితే స్మార్ట్ సిటీగా డెవలప్ చేయడానికి కేంద్రం నిధులు ఇస్తూంటే విశాఖ ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం తాకట్టు పెట్టడం ఏంటి అని మండిపడ్డారు. మొత్తానికి విశాఖవాసుల వేదన ఒక వైపు రాజకీయ దుమారం మరో వైపు వైసీపీ సర్కార్ ఈ మొత్తం వ్యవహారాలతో ఇరకాటంలో పడిందనే అంటున్నారు. రాజధాని పేరుతో కనికట్టు, ఆస్తుల తాకట్టు ఇదే వైసీపీ అభివృద్ధి గుట్టు అంటూ విపక్షాలు చేస్తున్న వాదనకు వైసీపీ సమాధానం ఏంటో చూడాలి మరి.
Tags:    

Similar News