సంచలనంగా మారిన సీనియర్ ఐపీఎస్ రాజీనామా లేఖ

Update: 2020-06-25 17:00 GMT
కొందరు తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. ఏదో సంచలనంతోనో.. వివాదంలోనూ వారి పేర్లు వినిపిస్తూ ఉంటుంది. రాజకీయ నాయకులే కాదు.. కొందరు ఐఏఎస్.. ఐపీఎస్ అధికారుల్లోనూ ఈ ధోరణి కనిపిస్తూ ఉంటుంది. ఆ కోవలోకే వస్తారు సీనియర్ ఐపీఎస్ అధికారి వీకే సింగ్. తరచూ ఏదో ఒక సంచలనంలో ఆయన పేరు ముడిపడి ఉంటుంది. జైళ్ల శాఖ డీజీగా ఆయన సుపరిచితుడు. అనూహ్యంగా ఆయన్ను తెలంగాణ ప్రభుత్వం స్టేషనరీ డిపార్ట్ మెంట్ కు బదిలీ చేసింది. జైళ్ల శాఖ నుంచి తనను బదిలీ చేసిన వేళలో వీకే సింగ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

రాజకీయ నేతలతో బంగారు తెలంగాణ రాదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అధికార పక్షాన్ని ఇరుకున పడేలా చేశాయి. అప్రాధాన్యత శాఖకు మార్చిన ప్రభుత్వం.. కొద్ది కాలానికే పోలీస్ అకాడమీ కి బదిలీ చేశారు. ఫర్లేదు కాస్త కుదురుకుంటున్నారన్నంత లోనే.. ఆయన రాజీనామా అస్త్రాన్ని సంధించినట్లు గా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత వెనక్కి తగ్గిన ఆయన మరో సారి తన చేతలతో వార్తల్లోకి వచ్చారు.

బుధవారం రాత్రి వేళ లో సంతకం లేని ఒక లేఖ సోషల్ మీడియా లో హడావుడి చేసింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు రాసిన లేఖలో.. తన రిటైర్మెంట్ కంటే ముందే పదవి నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. తన రిక్వెస్టును ఓకే చేయాలన్న ఆయన వైఖరి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గతంలో తనకున్న అనుభవానికి రాష్ట్ర డీజీపీ పదవిని ఇవ్వాలని కోరిన వీకేసింగ్.. అదెప్పటికి తీరని కోరికగా మారుతుందన్న ఆవేదన తోనే పదవి కి రాజీనామా చేసి ఉంటారన్న చర్చ పోలీసు వర్గాల్లో సాగుతోంది.

షాకు రాసిన లేఖలో ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అందులోని అంశాల్ని యథాతధంగా చెప్పుకొస్తే..
- 1987 బ్యాచ్ తెలంగాణ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అయిన నేను పోలీసు వ్యవస్థలో మార్పులు తీసుకురావాలన్న సత్సంకల్పంతో చేరాను. కానీ, నా ఆశలు అడియాశలు అయ్యాయి

- తెలంగాణ ప్రభుత్వం నా సేవల మీద పెద్ద సంతృప్తిగా లేదు. వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వానికి నేను ఇచ్చిన సూచనలు కూడా పెద్దగా రుచించలేదు. ఇక ప్రభుత్వానికి భారం కాకూడదని నిర్ణయించుకున్నా

- ప్రభుత్వం మీద కూడా పనికిమాలిన వారి భారం పడకూడదు. నా సేవలు ప్రభుత్వం బయట బాగా అవసరం అవుతాయని నా ఫీలింగ్.  ప్రజల్లో సంస్కరణలు తీసుకురావాలి.

- తెలంగాణ ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నా. కాబట్టి, అక్టోబర్ 2, 2020న మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ముందస్తు రిటైర్మెంట్‌ పొందేందుకు అవకాశం కల్పించండి

ఇలా కొన్ని వ్యాఖ్యలు చేసిన ఆయన.. తెలంగాణ ప్రభుత్వం మీద వ్యంగ్యస్త్రాల్ని తనదైన శైలిలో సంధించారు. ప్రభుత్వం మీద తనకు ఎలాంటి వ్యతిరేకత లేదని.. తెలంగాణ ప్రభుత్వం తనకిచ్చిన ఉత్తమ ట్రీట్ మెంట్ కు ధన్యవాదాలని పేర్కొన్నారు. సర్వీసులో విజయం సాధించాలంటే నిబద్ధత.. నిక్కచ్చిగా ఉండటం.. హార్డ్ వర్క్ ఒక్కటే సరిపోవని.. ఇంకా చాలా అవసరంటూ శ్లేషతో ముగించిన తీరు ఇప్పుడు పెను సంచలనంగా మారింది. సంతకం లేకుండా బయటకొచ్చి వైరల్ గా మారిన ఈ లేఖపై వీకే సింగ్ స్వయంగా ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. చూస్తుంటే.. ఆయన కోరుకున్నట్లే.. ఈసారికి ఆయన రాజీనామా కు సానుకూల స్పందన వస్తుందన్న భావన వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News