ఓట‌ర్ లిస్టు: హీరో వెంక‌టేష్ ఫొటో..మ‌హిళ వివ‌రాలు..!క‌లెక్ట‌ర్ ఏం చేశారంటే..?

Update: 2021-02-19 13:50 GMT
ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు ఎంత ప్ర‌తిష్టాత్మ‌కంగా సాగుతున్నాయో అంద‌రికీ తెలిసిందే. ఇప్ప‌టికే మూడు విడ‌త‌ల్లో పోలింగ్ ప్ర‌శాంతంగా ముగియ‌గా.. నాలుగో ద‌శ ఎన్నిక‌ల‌కు ఏర్పాట్లు చేస్తున్నాయి. అయితే.. తుది విడ‌త పోలింగ్ జ‌ర‌గాల్సిన కర్నూలు జిల్లా ప‌రిధిలో ఓట‌రు జాబితాలో పొర‌పాటు దొర్లింది. కల్లూరు పరిధిలోని ఓటరు లిస్టులో టాలీవుడ్ ప్రముఖ హీరో వెంకటేష్ ఫొటో ఉండటం చూసి అంద‌రూ అవాక్క‌వుతున్నారు.

కల్లూరు 31వ వార్డు ఓటరు జాబితాలో వెంకటేష్‌ ఫొటో ముద్రించారు. అయితే.. వివరాలు మాత్రం ఓ మహిళకు సంబంధించినవి ఉండ‌డం గ‌మ‌నార్హం. ఈ విష‌యం జిల్లా క‌లెక్ట‌ర్ కు తెలియ‌డంతో ఆయ‌న సీరియస్‌ అయ్యారు. ఓటర్ లిస్టులో వెంకటేష్ ఫొటో ఉండటంపై జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జి.వీరపాండియన్ అధికారుల‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. ఈ పొర‌పాటుకు కార‌ణం ఏంటో వెంట‌నే తెలియాల‌ని ఆదేశించారు.

ఈ మేర‌కు కర్నూలు ఆర్డీవోతోపాటు కల్లూరు తహసీల్దార్‌కు ఆదేశాలు జారీ చేశారు. వెంటనే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు క‌లెక్ట‌ర్. అదేవిధంగా.. పొర‌పాటు దొర్లిన 31 వార్డు ఓటరు లిస్టు ఇంచార్జ్ బీఎల్‌వోపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వెంటనే పొర‌పాటును సరిదిద్దాలని కూడా సూచించారు.
Tags:    

Similar News