పవన్‌.. ముందు నుయ్యి.. వెనుక గొయ్యి!

Update: 2023-02-20 10:29 GMT
ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని జనసేనాని పవన్‌ కల్యాణ్‌ పెద్ద లక్ష్యమే పెట్టుకున్నారు. అందులోనూ వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనివ్వబోనని ఇప్పటికే ఆయన పలుమార్లు ప్రకటించారు. ప్రస్తుతం జనసేన, బీజేపీ మధ్య పొత్తు ఉంది. అయితే టీడీపీని కూడా తమ కూటమిలో చేర్చుకుంటే వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలదనే భావనలో పవన్‌ ఉన్నారని అంటున్నారు. అయితే టీడీపీని తమతో కలుపుకోవడానికి బీజేపీ ససేమిరా అంటోంది. టీడీపీ అవినీతి, కుటుంబ పార్టీయేనని తేల్చిచెబుతోంది.

అటు బీజేపీ, ఇటు టీడీపీ పవన్‌ తమతోనే ఉండాలని ఆకాంక్షిస్తున్నాయి. ఇది పవన్‌ కు పెద్ద ఇరకాటంగా మారింది. ఎటువైపు ఉండాలో తేల్చుకోలేని స్థితిలో పవన్‌ ఉన్నారని టాక్‌ నడుస్తోంది. ఈ విషయమే ఇలా ఉంటే పులి మీద పుట్రలా మరో చిక్కు వచ్చి పడిందని చెబుతున్నారు.

ప్రస్తుతం ఏపీలో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మొత్తం ఐదు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన పార్టీల్లో జనసేన మినహాయించి ఇప్పటికే వైసీపీ, టీడీపీ, బీజేపీ అభ్యర్థులను ప్రకటించాయి.

ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతివ్వాలని బీజేపీ కోరుతోంది. అందులో ఇరు పార్టీల మధ్య పొత్తు ఉండటంతో కాస్త గట్టిగానే పవన్‌ ను తమకు మద్దతివ్వాలని డిమాండ్‌ చేస్తోందని తెలుస్తోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్‌ మరోమారు పట్టభద్రుల ఎమ్మెల్సీగా బరిలోకి దిగుతున్నారు. దీంతో జనసేన మద్దతు తమకేనని బీజేపీ ప్రచారం చేసుకుంటోంది. ఉత్తరాంధ్రలో మెగాభిమానులు ఎక్కువ. కాపు సామాజికవర్గం కూడా అత్యధికంగానే ఉంది. అందులోనూ యువతలో పవన్‌ కల్యాణ్‌ కు భారీగా అభిమానులు ఉండటంతో బీజేపీ పవన్‌ మద్దతును కోరుతోంది.

మరోవైపు టీడీపీ సైతం పవన్‌ కల్యాణ్‌ మద్దతును కోరుతోందని అంటున్నారు. ఇప్పటికే టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్‌ పలుమార్లు కలిశారు. విశాఖలో పవన్‌ ను అడ్డుకోవడాన్ని తప్పుబడుతూ చంద్రబాబు విజయవాడ వచ్చి పవన్‌ కు సంఘీభావం తెలిపారు. అలాగే కుప్పంలో చంద్రబాబును పోలీసులు అడ్డుకోవడంపై పవన్‌ హైదరాబాద్‌ లో చంద్రబాబు ఇంటికెళ్లి సంఘీభావం ప్రకటించారు.

క్షేత్ర స్థాయి నుంచి కేంద్ర స్థాయి వరకు టీడీపీ నేతలు జనసేన పార్టీతో పొత్తు ఉండాలని కోరుకుంటున్నారు. ఇప్పటికే ఈ దిశగా ప్రకటనలు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ జనసేన మద్దతు తమకే ఉంటుందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ దిశగా టీడీపీ సీనియర్‌ నేతలు పవన్‌ పై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. ప్రచారం చేయకపోయినా కనీసం నోటి మాటగానైనా లేదా ఒక ప్రకటన ద్వారా అయినా టీడీపీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ఆశిస్తున్నారు. దీంతో పవన్‌ ముందు బీజేపీ రూపంలో ముందు నుయ్యి.. టీడీపీ రూపంలో గొయ్యి ఉందని టాక్‌ నడుస్తోంది. మరి పవన్‌ ఎవరికి మద్దతు ప్రకటిస్తారో వేచిచూడాల్సిందే!


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. Abuse వద్దు.

Similar News