ఖాళీ చేయమంటే పాక్ రియాక్షన్ ఇది..

Update: 2016-07-23 04:57 GMT
దశాబ్దాల తరబడి చేసిన నిర్లక్ష్యం.. చేతకాని తనంతో వ్యవహరించిన వైనానికి మూల్యం చెల్లించే పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. దాయాది దేశమైన పాక్ చేష్టల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యుద్ధంలో విజయం సాధించి.. భూభాగాన్ని పొగొట్టుకునే విచిత్ర పరిస్థితి మనకు మాత్రమే చెల్లుతుందేమో. పాక్ అధీనంలో ఉన్న అక్రమిత కశ్మీర్ మనదైనప్పటికీ.. ఈ విషయాన్ని గత పాలకులు బలంగా వాదన వినిపించకపోవటంతో పాక్ ఎంతలా పెట్రేగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అక్రమిత కాశ్మీర్ లోని పలువురు తమకు స్వతంత్ర్యం కావాలని.. భారత్ లో తాము కలిసిపోతామంటూ గళం విప్పినా.. తన సైనిక బలంతో అలాంటి గొంతులు బయటకు రాకుండా ఉండేలా వ్యవహరిస్తున్న పాకిస్థాన్ తాజాగా మరింత చెలరేగిపోయింది. గడిచిన కొన్నిదశాబ్దాల్లో ఎప్పుడూ లేనట్లుగా పాక్ అక్రమిత కశ్మీర్ గురించి భారత్ వ్యాఖ్యలు చేయటం.. ఆ ప్రాంతాన్ని పాక్ ఖాళీ చేసి వెళ్లాలంటూ మండిపడటం తెలిసిందే.

దీనికి ప్రతిగా అన్నట్లు పాక్ ప్రధాని నవాజ్ షరీప్ తాజాగా బరితెగింపు వ్యాఖ్యలు చేశారు. పాక్ అక్రమిత కశ్మీర్ లో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. పాకిస్థాన్ లో కశ్మీర్ కలిసే రోజు కోసం మనమంతా ఎదురుచూస్తున్నామని.. కశ్మీర్ స్వాతంత్ర్యం కోసం భారత్ లో పోరాడుతున్న వారిని మర్చిపోకూదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అక్రమిత కశ్మీర్ ను ఖాళీ చేయాలని పాక్ కు చెప్పిన దానికి ప్రతిగా నవాజ్ తాజా వ్యాఖ్యలు చేసినట్లుగా చెప్పొచ్చు. ఈ తరహా వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించటంతో పాటు.. ఇలాంటి వ్యాఖ్యలకు పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్న అర్థం వచ్చేలా భారత్ వ్యవహరించాల్సిన అవసరం ఉంది. పాక్ వ్యాఖ్యలపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ.. దాయాదికి అలాంటి మాటలు పెద్దగా పట్టవన్న విషయం తెలిసిందే. కశ్మీర్ విషయంలో వ్యర్థ  ప్రేలాపనల్ని సమర్థంగా కట్టడి చేయటమే కాదు.. ఇలాంటి వ్యాఖ్యలకు మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్నది అర్థమయ్యేలా చేస్తే మంచిది. అంతటి దూకుడుతనం మన నాయకత్వం నుంచి ఆశించటం అత్యాశే అవుతుందేమో..?
Tags:    

Similar News