డోక్లామ్ ఎపిసోడ్ లో తాజా ప‌రిణామాలివే

Update: 2017-08-09 16:44 GMT
దాదాపు యాబై రోజులుగా భార‌త్ - చైనాల మ‌ధ్య డోక్లామ్ ఎపిసోడ్ న‌డుస్తోంది. భూటాన్ స‌రిహ‌ద్దుల్లో నిర్మిస్తున్న రోడ్డు వ్య‌వ‌హారం అంత‌కంత‌కూ ముదిరి పాకాన ప‌డింది. భూటాన్ స‌రిహ‌ద్దుల్లో చైనా రోడ్డు నిర్మాణం అంటే.. ప‌రోక్షంగా భార‌త్ మీద గురి పెట్ట‌ట‌మే. దీంతో.. త‌న మిత్ర‌దేశానికి మ‌ద్ద‌తుగా డోక్లామ్ లో భార‌త్ త‌న సైనికుల ప‌హ‌రా పెట్టింది. ఇది చైనాకు ఏ మాత్రం మింగుడుప‌డ‌ని వ్య‌వ‌హారంగా మారింది. భార‌త సైనికులు డోక్లాంను ఖాళీ చేయాలంటూ మాట‌ల యుద్ధాన్ని స్టార్ట్ చేసింది. అయిన‌ప్ప‌టికీ భార‌త్ త‌న తీరును విస్ప‌ష్టంగా ప్ర‌క‌టించ‌టంతో పాటు.. డోక్లామ్ ను ఖాళీ చేసే ప్ర‌స‌క్తే లేద‌ని తేల్చి చెప్పింది.

ప‌లు ర‌కాలుగా భార‌త్ మీద మైండ్ గేమ్‌ను ప్లే చేసినప్ప‌టికి ఎలాంటి ప్ర‌యోజ‌నం లేక‌పోవ‌టంతో చైనా ఉడికిపోతోంది. డోక్లామ్ నుంచి భార‌త్‌ను ఖాళీ చేయించ‌టానికి అవ‌స‌ర‌మైతే ప‌రిమిత మోతాదులో సైనిక చ‌ర్య చేయ‌టానికి తాము సిద్ధ‌మ‌న్న‌ట్లుగా త‌న మీడియాతో క‌థ‌నాల్ని వండి వార్పిస్తుంది. అయితే.. ఇలాంటి తాటాకు చ‌ప్పుళ్ల‌కు భార‌త్ బెదిరే ప‌రిస్థితి లేద‌ని.. 1962 నాటి ప‌రిస్థితులు ఇప్పుడు లేవ‌ని మోడీ స‌ర్కారు తేల్చి చెబుతోంది. ఈ త‌ర‌హా ఎదురుదాడిని ఏ మాత్రం ఊహించ‌ని చైనాకు దిమ్మ తిరుగుతోంది. బెదిరింపుల‌కు ఏ మాత్రం త‌లొగ్గ‌ని భార‌త్ తీరుతో స‌హ‌నం న‌శిస్తున్న చైనా ఇప్పుడు కౌంట్ డౌన్ మొద‌లంటూ చైనా మీడియా యుద్ధ‌కూత‌లు కూస్తోంది.

భార‌త్ - చైనా మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌కు కౌంట్ డౌన్ మొద‌లైందంటూ హెచ్చ‌రిస్తూ చైనా డైలీ ప‌త్రిక త‌న ఎడిటోరియ‌ల్ క‌థ‌నాన్ని ప్ర‌చురిస్తూ.. చైనా ప్ర‌భుత్వ ఆలోచ‌న‌లు ఏ తీరులో ఉన్నాయో చెప్పేసింది. ఇదే క‌థ‌నంలో భార‌త్ ను హెచ్చ‌రిస్తూ.. ప‌లు వ్యాఖ్య‌లు చేసింది. డోక్లామ్ స‌రిహ‌ద్దు వివాదాన్ని ముగింపు ఇవ్వాల్సిన స‌మ‌యం వ‌చ్చింద‌ని.. స‌మ‌యం మించిపోవ‌టానికి ముందే భార‌త్ త‌న సైనిక బ‌ల‌గాల‌ను ఊప‌సంహ‌రించుకుంటే మంచిద‌ని పేర్కొంది. యుద్ధానికి తాము స‌న్న‌ద్ధంగా ఉన్నామంటూ హెచ్చ‌రిక‌లు జారీ చేసింది.

ప‌ర్వ‌తాన్ని క‌దిలించ‌టం తేలికే కానీ.. చైనా పీపుల్స్ లిబ‌రేష‌న్ ఆర్మీని క‌దిలించ‌టం చాలా క‌ష్ట‌మంటూ పెద్ద పెద్ద మాట‌ల్ని మాట్లాడుతుంది. మీడియాలోనే కాదు.. చైనా ర‌క్ష‌ణ శాఖ ప్ర‌తినిధి సైతం భార‌త్‌కు హెచ్చ‌రిక‌లు జారీ చేస్తూ.. చైనా భూభాగాన్ని.. సార్వ‌భౌమ‌త్వాన్ని కాపాడుకునే సామ‌ర్థ్యం త‌మ‌కుంద‌ని వ్యాఖ్యానించ‌టం గ‌మ‌నార్హం.

ఇదిలా ఉంటే.. చైనాతో నెల‌కొన్న స‌రిహ‌ద్దు ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో త‌మ‌కు అద‌నంగా రూ.20వేల కోట్లు కావాలంటూ ర‌క్ష‌ణ శాఖ మోడీ స‌ర్కారును కోరింది. మిలిట‌రీ ఆధునీక‌ర‌ణ‌తో పాటు రోజువారీ నిర్వ‌హ‌ణ ఖ‌ర్చుల‌కు ఈ మొత్తం కావాల‌ని పేర్కొంది. చైనాతో ఏ స‌మ‌యంలో యుద్ధం వ‌చ్చినా అప్ప‌టిక‌ప్పుడు సిద్ధంగా ఉండాల‌ని ర‌క్ష‌ణ శాఖ భావిస్తోంది. ర‌క్ష‌ణ శాఖ అడిగిన రూ.20వేల కోట్ల నిధుల‌ను ఇచ్చేందుకు ఆర్థిక శాఖ సానుకూలంగా స్పందించింది. సాధ్య‌మైనంత త్వ‌ర‌గా ర‌క్ష‌ణ శాఖ అడిగిన మొత్తాన్ని స‌ర్దుబాటు చేసే ప్ర‌య‌త్నంలో ఉన్న‌ట్లుగా పేర్కొంది.

మ‌రోవైపు డోక్లామ్ వ్య‌వ‌హారంపై కేంద్ర రక్ష‌ణ మంత్రి అరుణ్ జైట్లీ తాజాగా స్పందించారు. త‌న మాట‌ల‌తో భార‌త ప్ర‌జ‌ల‌కు ధైర్యం చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. యుద్ధంపై చైనా చేస్తున్న హెచ్చ‌రిక‌ల‌కు బ‌ల‌మైన జవాబు ఇస్తూ ఇప్పుడు ఉన్న‌ది 1962 నాటి భార‌త్ కాద‌ని.. ఎలాంటి ప‌రిస్థితిని అయినా ధీటుగా ఎదుర్కొంటామ‌ని పేర్కొన్నారు. పార్ల‌మెంటు వేదిక‌గా జైట్లీ భార‌త భ‌ద్ర‌తా ద‌ళాల్లో మ‌రింత ఆత్మ‌స్థైర్యాన్ని పెంపొందించేలా మాట్లాడారు.

1962 యుద్ధం నుంచి భార‌త్ పాఠాలు నేర్చుకుంద‌ని.. దేశ భ‌ద్ర‌త‌కు.. దేశ సార్వ‌భౌమ‌త్వం కోసం మ‌నం ఇప్పుడు ఎలాంటి ప‌రిస్థితిని అయినా ఎదుర్కోగ‌ల‌మ‌న్నారు. ఈ సంద‌ర్భంగా 1948లో పాక్ ఆక్ర‌మించిన కశ్మీర్ ను దేశంలో క‌ల‌వాల‌ని దేశ ప్ర‌జ‌లు కోరుకుంటున్న విష‌యాన్ని జైట్లీ వెల్ల‌డించారు. ప‌క్క దేశాల నుంచి వ‌చ్చే స‌మ‌స్య‌ల్ని మ‌నం సొంతంగా ఎదుర్కొన‌గ‌ల‌మ‌న్న ఆయ‌న‌.. ఇన్నాళ్లుగా వ‌స్తున్న ప్ర‌తి స‌వాళ్ల‌తో రోజురోజుకూ బ‌ల‌ప‌డుతున్నామ‌ని.. ఆ విష‌యాన్ని తాను చెప్పేందుకు గ‌ర్వంగా ఉంద‌న్నారు.
Tags:    

Similar News