నేతలకు ఇదో వార్నింగ్.. కరోనాతో తమిళనాడు మంత్రి కన్నుమూత

Update: 2020-11-01 10:50 GMT
ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనా ముప్పు ఇంకా తొలిగిపోనప్పటికీ.. చాలా మంది ఆ విషయాన్ని అసలు లెక్కలోకి తీసుకోకుండా వ్యవహరిస్తున్న వైనం చాలా చోట్ల కనిపిస్తోంది. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా.. అశ్రద్ధతో ఉన్నా.. దాని తాలూకు మూల్యం భారీగా చెల్లించాల్సిన ఉంటుందన్న హెచ్చరికలు అప్పుడప్పుడు బాగానే వస్తున్నాయి. అయితే.. తమ వరకు రానంత వరకు పట్టించుకోని తత్త్వం అంతకంతకూ ఎక్కువ అవుతోంది.

ఈ తీరు సామాన్యుల్లోనే కాదు.. ప్రముఖుల్లోనూ ఉంది. ఇలాంటి తీరు ఒక్కోసారి ప్రాణాల మీదకు తేవటమే కాదు.. కుటుంబాల్లో అంతులేని ఆవేదనను మిగులుస్తోంది. తాజాగా తమిళనాడు రాష్ట్ర మంత్రి దురైక్కన్నుకరోనాతో కన్నుమూశారు. 72 ఏళ్ల ఆయన.. కరోనాతో చికిత్స పొందుతూ ఆసుపత్రిలో కన్నుమూశారు. అక్టోబరు 13న చెన్నైలోని అపోలోలో ఆయన చేరారు. ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరగా.. కరోనాపాజిటివ్ గా తేలింది.

శ్వాస సంబంధిత సమస్యలు కూడా ఉండటంతో.. వైద్యులు పలుజాగ్రత్తలు తీసుకుంటూ వైద్యం చేశారు. అయినప్పటికీ.. ఆయన ఆరోగ్యం కుదుట పడలేదు. ఈ రోజు (ఆదివారం) ఉదయం ఆయన ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. మంత్రి మరణంపై తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హటాత్తుగా చోటు చేసుకున్న ఈ విషాదం ఆపార్టీ నేతల్ని.. రాష్ట్ర ప్రజల్ని షాక్ కు గురి చేస్తోంది. నిజానికి ఈ ఉదంతం రాజకీయ నేతలకు ఒక గట్టి వార్నింగ్ గా చెప్పాలి.

రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు నేతలు.. గడిచిన కొద్దికాలంగా కరోనాకు సంబంధించిన విషయాల్ని పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతున్నారు. ఇలాంటి తీరుతో ప్రమాదం పొంచి ఉందన్నది మరిచిపోతున్నారు. ఇప్పటికైనా జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరం. రాజకీయాలు కొంతకాలం నడిపించకపోతే జరిగే నష్టంతో పోలిస్తే.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటే జరిగే నష్టమే ఎక్కువన్న వాస్తవాన్ని గుర్తిస్తే మంచిది.
Tags:    

Similar News