వాషింగ్టన్‌ సుందర్‌ కు కరోనా సఫారీతో వన్డే సిరీస్‌ కు దూరం!

Update: 2022-01-12 02:44 GMT
చెన్నై: భారత ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ కరోనా బారిన పడ్డాడు. దీంతో దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్‌కు అతను బయల్దేరడం లేదు. దీంతో 22 ఏళ్ల ఈ తమిళనాడు క్రికెటర్‌ పరిమిత ఓవర్ల టోర్నీకి దూరమయ్యే అవకాశముంది. ‘పరీక్షలో వాషింగ్టన్‌కు కోవిడ్‌ పాజిటీవ్‌ అని తేలింది. వైరస్‌ సోకడం వల్లే అతను వన్డే జట్టుకు ఎంపికైన ఆటగాళ్లతో కలవలేకపోయాడు.

వీళ్లంతా ముంబైలో ఉన్నారు. సుందర్‌ మాత్రం బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)లో ఉన్నాడు’ అని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఒక ప్రకటనలో తెలిపింది.  శిఖర్‌ ధావన్, సూర్యకుమార్‌ యాదవ్, భువనేశ్వర్‌ తదితర వన్డే జట్టుకు ఆడే ప్లేయర్లు ఒకట్రెండు రోజుల్లో ముంబై నుంచే సఫారీకి ప్రత్యేక విమానంలో బయల్దేరతారు.

అయితే కోవిడ్‌ నుంచి కోలుకున్నాక అయినా వాషింగ్టన్‌ సుందర్‌ ఒంటరిగా అక్కడికి వెళ్లే అంశంపై బీసీసీఐ స్పష్టత ఇవ్వలేదు. గత ఏడాదిన్నర కాలం నుంచి బోర్డు తమ ఆటగాళ్ల కోసం చార్టెడ్‌ ఫ్లయిట్‌లను ఏర్పాటు చేస్తుంది. ఇప్పుడైతే ఒక్క ఆటగాడి కోసం ప్రత్యేక విమానాన్ని దక్షిణాఫ్రికాకు పంపకపోవచ్చు. ఈ నేపథ్యంలోనే వాషింగ్టన్‌ సుందర్‌ వన్డే సిరీస్‌ ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి.

గత ఏడాది ఇంగ్లండ్‌ పర్యటన సందర్భంగా గాయపడటంతో అతను జట్టుకు దూరమయ్యాడు. తిరిగి దేశవాళీ టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీలో తమిళనాడు తరఫున రాణించడం ద్వారా జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. విజయ్‌ హజారే టోర్నీలో తమిళనాడు ఫైనల్‌ చేరింది. ఇక దక్షిణాఫ్రికా పర్యటనలో ప్రస్తుతం ఇరు జట్ల మధ్య మూడో నిర్ణాయక టెస్టు మంగళవారం మొదలైంది. అనంతరం ఈ నెల 19 నుంచి మూడు వన్డేల సిరీస్‌ జరుగుతుంది. తొలిరెండు వన్డేలు 19, 21 తేదీల్లో పార్ల్‌ వేదికపై జరుగనున్నాయి. ఆఖరి వన్డే 23న కేప్‌టౌన్‌లో జరుగుతుంది.
Tags:    

Similar News