డ‌బ్బు కాదు.. నీళ్లిచ్చి ఓట్లు కొంటారంట‌!

Update: 2017-09-06 05:18 GMT
సార్వ‌త్రిక ఎన్నిక‌లైనా, ఉప ఎన్నిక‌లైనా, మునిసిప‌ల్ ఎన్నిక‌లైనా, పంచాయ‌తీ ఎన్నిక‌లైనా ఓట‌ర్ల‌ను మ‌చ్చిక చేసుకోని పార్టీ, మంచి చేసుకోని నేత‌లూ ఉండ‌రు క‌దా!  ఈ క్ర‌మంలోనే ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకునేందుకు అనేక ప్ర‌లోభాల‌కు గురి చేస్తారు. అధికారంలోకి వ‌స్తే.. అది చేస్తాం - ఇది చేస్తాం అని హామీల మీద  హామీల‌ను గుప్పించేయ‌డం అంద‌రికీ తెలిసిందే. ఇక‌, ఎన్నిక‌ల తేదీ ముంచుకొచ్చే నాటికి.. ఈ ప్ర‌చార ప‌ర్వం కాస్తా.. ప్ర‌లోభ ప‌ర్వంగా మారిపోవ‌డం కూడా మ‌నం త‌ర‌చూ చూసేదే.  ఓట‌ర్ల‌కు డ‌బ్బులు ఎరేయ‌డం - మ‌హిళ‌ల‌కు చీర‌లు - బంగారు ఆభ‌ర‌ణాలు - వృద్దుల‌కు పింఛ‌న్లు - దంప‌తుల‌కు ఇళ్లు - ఇక‌ - మందుబాబుల‌కు బాటిళ్లు.. ఇలా ఒక‌టేమిటి.. ప్ర‌లోభాల‌కు హ‌ద్దు - అదుపు ఉండ‌దు.

ఇలా ఓట‌ర్ల‌ను డ‌బ్బు, ద‌స్కం ఇచ్చి వారి నుంచి ఓట్లు పొందుతున్న వారు  చాలా మందే ఉన్నార‌ని సాక్షాత్తూ ఎన్నిక‌ల సంఘ‌మే చెబుతోంది. తాజాగా మొన్న నంద్యాలలో జ‌రిగిన ఉప ఎన్నిక‌లో అధికార పార్టీ రూ.200   మంచి నీళ్ల‌లా ఖ‌ర్చు చేసింద‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఇది 2017 వ‌ర‌కు ఉన్న విష‌యం. అయితే, ఇక రాబోయే రోజుల్లో ఈ ట్రెండ్ పూర్తిగా మారిపోతుంద‌ని అంటున్నారు నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్‌. అయితే, ఓట‌ర్లు ఏమీ ఆశించ‌కుండా ఓటేస్తార‌ని కాదు! నీళ్ల‌ను తీసుకుని ఓటేస్తార‌ట‌! న‌మ్మ‌డానికి ఒకింత ఆశ్చ‌ర్యంగా ఉన్నా.. ఇది నిజం అంటున్నారు అమితాబ్‌.

భవిష్యత్తులో జరిగే ఎన్నికలను నిర్ణయించేది నీళ్లేనని ఆయ‌న నొక్కి మ‌రీ చెబుతున్నారు.  సమర్థ నీటి నిర్వహణ కీలక అంశంగా ముందుకొస్తుందని నొక్కిచెప్పారు. ప్రజలకు నీటి అవసరాలు ప్రాధాన్య అంశం అవుతాయ‌ని, జల వనరులను సమర్థంగా నిర్వహించిన ప్రభుత్వాలనే ప్రజలు ఎన్నుకుం‍టారని అన్నారు. పరిశ్రమ సంస్థ సీఐఐ మంగళవారం నిర్వహించిన జల సదస్సులో మంగ‌ళ‌వారం ఆయ‌న మాట్లాడారు. సమర్థ నీటి నిర్వహణ చేపట్టని ప్రభుత్వాలు కనుమరుగవక తప్పదని హెచ్చరించారు.  భారత్‌ నీటి కొరత కలిగిన దేశంగా మారుతున్న క్రమంలో సమర్ధ జలవనరుల నిర్వహణ చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.  మొత్తానికి ఈయ‌న వ్యాఖ్య‌లు వింటే గ్లాసుడు నీళ్ల‌కు ఓ ఓటు చొప్పున ప‌లికినా ప‌ల‌కొచ్చ‌నిపిస్తోంది! మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.
Tags:    

Similar News