శత్రుదేశాల ఆస్తులను మేం స్వాధీనం చేసుకుంటాం: రష్యా హెచ్చరిక

Update: 2022-05-02 05:23 GMT
రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ తగ్గేదేలే అని మొండిగా వెళుతున్నారు. ఉక్రెయిన్ పై భీకర యుద్ధాన్ని కొనసాగిస్తున్న రష్యాను కట్టడి చేసేందుకు ఆయా దేశాలు ఆంక్షలు విధిస్తోన్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో అటువంటి చర్యలకు పాల్పడితే తాము కూడా ప్రతీకార చర్యలకు ఉపక్రమిస్తామని రష్యా హెచ్చరిస్తోంది.

తమ దేశాలకు చెందిన సంపన్నుల ఆస్తులను విక్రయించి.. ఆ మొత్తాన్ని ఉక్రెయిన్ కు ఇవ్వాలంటూ ఇటీవల అమెరికా చేసిన ప్రతిపాదనను రష్యా తీవ్రంగా పరిగణించింది. ఈ మేరకు రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరికలు జారీ చేశారు.

తమ దేశ వ్యాపారుల ఆస్తులను శత్రుదేశాలు స్వాధీనం చేసుకుంటే... తాము కూడా శత్రుదేశాల వ్యాపారవేత్తలకు సంబంధించి రష్యాలో ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి వెనుకాడమని రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించారు.

శత్రుదేశాలకు చెందిన వ్యాపారులకు రష్యాలో ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకోవడం ప్రతీకార చర్యల్లో ఒక భాగం. వారి ఆస్తులను జప్తు చేయడం న్యాయమైన చర్యే అని రష్యా పార్లమెంట్ అభిప్రాయపడింది. ఇలా ఆస్తులు విక్రయించడం వల్ల వచ్చే ఆదాయాన్ని దేశాభివృద్ధికి ఉపయోగించపడుతుందన్నారు. ముఖ్యంగా లిథువేనియా, లాటివియా, పోలండ్ తోపాటు అమెరికా వంటి దేశాలు అంతర్జాతీయ చట్టాలను అతిక్రమిస్తూ చోరీకి పాల్పడుతున్నాయని ఆరోపించారు.

రష్యా సంపన్నుల ఆస్తులను స్వాధీనం చేసుకొని విక్రయించే ఓ ప్రమాదకరమైన చర్యకు అమెరికా నాంది పలికిందన్న రష్యా.. అటువంటి చర్య తిరిగి అమెరికా మెడకు చుట్టుకుంటుందన్నారు.

అమెరికా చర్యలు రష్యా ఆర్థిక వ్యవస్థపై ఎటువంటి ప్రభావం చూపించలేవని.. విహార నౌకలు, విల్లాలతోపాటు ఇతర ఆస్తులు కూడా రష్యా అభివృద్ధికి ఏమీ దోహదపడవని అన్నారు. శత్రుదేశాల చర్యలకు ప్రతిచర్యలు ఉంటాయని రష్యా హెచ్చరికలు జారీ చేసింది.
Tags:    

Similar News