వైసీపీని దించేస్తాం....పవన్ భీషణ ప్రతిజ్ఞ

Update: 2022-10-17 13:15 GMT
ఏపీలో వైసీపీని గద్దె నుంచి దించేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీషణ ప్రతిజ్ఞ చేశారు. విశాఖలో మూడు రోజుల పాటు హొటల్ గదికే పరిమితం అయిన పవన్ అక్కడ నుంచి విజయవాడలోని మంగళగిరి పార్టీ ఆఫీసుకు ఈ రోజు చేరుకున్నారు. అక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో వైసీపీ అప్రజాస్వామిక విధానాలను అవలంబిస్తోందని మండిపడ్డారు. తన పార్టీ కార్యక్రమం జనవాణిని ముందే రూపొందించుకున్నామని ఆయన వివరించారు. ఈ విషయంలో కూడా రాజకీయం చేస్తూ తాము పోటీగా కార్యక్రమం చేపట్టామని అభాండాలు వేశారని ఆయన అన్నారు.

విశాఖలో మంత్రుల కార్ల మీద దాడులు జరిగితే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తోందని ఆయన నిలదీశారు. ఏపీలో వైసీపీ వారికి ఒక రూల్ తమ పార్టీకి మరో రూలా అని ఆయన ప్రశ్నించారు. తమ పార్టీ వారి మీద అనేక సెక్షన్లు పెట్టి అరెస్టులు చేస్తున్న పోలీసులు వైసీపీ వారు రాళ్ళు రువ్వినా ఎందుకు చర్యలు తీసుకోరని ఆయన నిగ్గదీశారు.

ఏపీలో కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చు రాజేయాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. ఒకసారి తమిళనాడు నుంచి మరోసారి తెలంగాణా నుంచి ఆంధ్రులను తరిమేశారని, ఇపుడు మనలో మనం గొడవలు పడి రాష్ట్రాన్ని నాశనం చేసుకోవాలా అని ఆయన లాజిక్ పాయింటే తీశారు. ఏపీలో మూడు రాజధానుల   విషయంలో సర్కార్ వారి పాటనే పాడమని విపక్షాలను వత్తిడి చేయడం తగదని అన్నరు.

రాజకీయాల్లో నేర చరితులకు అవకాశం ఇవ్వరాదని ఆయన అభిప్రాయపడ్డారు. వారికి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సెల్యూట్ చేసే వ్యవస్థ పోవాలని అన్నారు. ఇక ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో వైసీపీని గద్దె దించడమే తమ పార్టీ అజెండా అని అన్నారు.

ఈ విషయంలో తుదికంటా జనసేన పోరాడుతుందని, మళ్ళీ వైసీపీ కనుక అధికారంలోకి వస్తే మాత్రం ఏపీతో పాటు తెలంగాణా కూడా తీరని విధంగా నష్టపోతాయని ఆయన పేర్కొన్నారు.

తమ పార్టీ క్యాడర్ ని తాము రక్షించుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో సహనంతో వ్యవహరిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. విశాఖలో తాను ఉన్న మూడు రోజులల్లో తన సహనాన్ని పరీక్ష పెట్టే విధంగా వ్యవహరించారని, అయినా వైసీపీ వారు కోరుకునే హింసను తాను ఇవ్వలేదని, అది తన విధానం కాదని ఆయన అన్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ వైసీపీ మీద ధర్మబద్ధ, నాయయబద్ధ పోరాటాన్నే ఎంచుకున్నారు. దానికి ఎన్నికలనే ఆయన వేదికగా మార్చుకుంటున్నారు. .


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News