సమీర్ వాంఖడేను చంపేస్తాం.. బెదిరింపులు సంచలనం

Update: 2022-08-19 13:30 GMT
ఎన్సీబీ మాజీ డైరెక్టర్ సమీర్ వాంఖడే పేరు అప్పట్లో తెగ మారుమోగింది. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో పట్టుకొని చాలా రోజులు అతడికి బెయిల్ రాకుండా చూసిన అధికారిగా ఈయన పేరు వెలుగులోకి వచ్చింది. అయితే క్రూయిజ్ నౌకలో డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఆర్యన్ ఖాన్ కు క్లీన్ చిట్ ఇచ్చిన నేపథ్యంలో ఈ కేసులో మొండిగా ముందుకెళ్లిన అప్పటి ఎన్సీబీ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై  విమర్శలు వెల్లువెత్తాయి.

ఇప్పటికే ఎన్సీబీ దీనిపై నోటీసులు జారీ చేసినట్టు ప్రచారం సాగుతోంది. ఈ కేసును తొలుత దర్యాప్తు చేసి ఆర్యన్ ఖాన్ ను ఇరికించిన సమీర్ వాంఖడే భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ కేసు దర్యాప్తు ప్రారంభంలో నిర్లిప్తంగా వ్యవహరించినందుకు గానూ వాంఖడే పై చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది. ఆయనను ముంబై నుంచి చెన్నైకు బదిలీ చేస్తూ ఎన్సీబీ ఇచ్చింది.

తాజాగా సమీర్ వాంఖడేకు సోషల్ మీడియా ద్వారా బెదిరింపు పోస్టు వచ్చింది. ఆగస్టు 14వ తేదీన అమన్ పేరిట ఉన్న ట్విట్టర్ ఖాతా నుంచి సమీర్ వాంఖడే కు బెదిరింపు వచ్చింది. ‘నీవు ఏం చేశావో నీకు తెలుసా? దానికి నీవు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంది.. నిన్ను హతమారుస్తాం’ అని ట్వీట్ చేశారు. ఈ బెదిరింపు ట్వీట్ పై సమీర్ వాంఖడే గోరేగాం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వాంఖడే వాంగ్మూలాన్ని రికార్డు చేశారు.

బెదిరింపు ట్వీట్ వచ్చిన ట్విట్టర్ ఖాతాకు ఫాలోవర్స్ ఎవరూ లేవరని.. ఈ ఖాతాను సమీర్ వాంఖడేను బెదిరించేందుకే క్రియేట్ చేశారని పోలీసులు భావిస్తున్నారు.

ఎన్సీబీ మాజీ డైరెక్టర్ సమీర్ వాంఖడే 2021 అక్టోబర్ లో క్రూయిజ్షిప్ పై దాడి చేసి షారుఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్ సహా 19 మంది ప్రముఖులను అరెస్ట్ చేసిన ఘటనలో వార్తల్లో నిలిచారు.  ఈ డ్రగ్స్ కేసులో అవినీతి ఆరోపణలు రావడంతో సమీర్ వాంఖడే నుంచి కేంద్ర ఎన్సీబీ బృందానికి దర్యాప్తు బాధ్యత అప్పగించారు.

అప్పట్లో బాలీవుడ్ సెలబ్రెటీలు దీపికా పడుకొణే, సారా అలీఖాన్, రకూల్ ప్రీత్ సింగ్ లను సమీర్ వాంఖడే డ్రగ్స్ కేసులో విచారించడం సంచలనమైంది. ఈ క్రమంలోనే సమీర్ వాంఖడేకు బెదిరింపులు వచ్చినట్టు తెలుస్తోంది. ఎవరో కావాలనే ఇది చేస్తున్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
Tags:    

Similar News