హోం థియేట‌ర్‌లో బాంబు పెట్టి గిఫ్ట్‌: మాజీ ప్రియుడి దారుణం

Update: 2023-04-06 08:00 GMT
త‌న‌కు ద‌క్క‌ని ప్రియురాలు.. ఇంకెవ‌రికీ ద‌క్క‌కూడ‌ద‌ని భావించిన ఓ ప్రియుడు దారుణానికి పాల్ప‌డ్డాడు. త‌న ప్రియురాలిని వివాహం చేసుకున్న వ్య‌క్తికి పెళ్లిలో హోం థియేట‌ర్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. అయితే.. అందులో బాంబు పెట్టి ఇవ్వ‌డంతో అది ఆన్ చేసిన మ‌రుక్ష‌ణ‌మే పేలిపోయి.. పెళ్లి కుమారుడు స‌హా అత‌ని సోద‌రుడు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణ విషాద ఘ‌ట‌న ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో చోటు చేసుకుంది. పెళ్ల‌యిన మూడో రోజే.. కాళ్ల పారాణి కూడా ఆర‌కుండా వ‌రుడు మృతి చెంద‌డంతో ఇరు కుటుంబాల్లోనూ తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

వివ‌రాలు.. ఇవీ!

ఛత్తీస్గఢ్లోని కబీర్దామ్ జిల్లా.. రెంగాఖర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చమరి గ్రామంలో  హేమేంద్ర మేరవి(30) అనే వ్య‌క్తికి ఓ యువ‌తి(29)తో రెండు రోజుల క్రితమే పెళ్లి జరిగింది. ఆ పెళ్లిలో అతడికి ఓ హోం థియేటర్ బహుమతిగా వచ్చింది. ఆదివారం దాన్ని బయటకు తీసి కరెంట్ ప్లగ్కు కనెక్షన్ ఇచ్చాడు హేమేంద్ర. వెంటనే హోం థియేటర్ పేలిపోయింది. పేలుడు ధాటికి హేమేంద్ర తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. హేమేంద్ర సోద‌రుడు రాజ్ కుమార్(32) కూడా ప్రమాదంలో చనిపోయాడు.

ఘటనపై స్థానికులు అందించిన స‌మాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు జరుపుతున్నారు. "పోలీసులు వెళ్లేసరికి హేమేంద్ర చనిపోయాడు. మిగతా వారు తీవ్రంగా గాయపడ్డారు. వారందరిని స్థానిక ఆసుపత్రికి తరలించాం. మృతదేహాలను శవ పరీక్షల కోసం పంపించాం. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నాం" అని జిల్లా అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మనీషా ఠాకూర్ తెలిపారు.

అయితే, ఈ ఘ‌ట‌న‌పై లోతుగా విచారించిన పోలీసులు.. పెళ్లి కుమార్తెను అదుపులోకి తీసుకుని ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. ఈ క్ర‌మంలో ఆమె త‌న‌కు పెళ్లికిముందే.. స‌ర్జు మ‌క్ర‌మ్(33) అనే వ్య‌క్తి త‌న‌ను ప్రేమించిన‌ట్టు తెలిపింది. అయితే, అత‌నితో వివాహానికి కుటుంబ స‌భ్యులు అంగీక‌రించ‌లేద‌ని.. పేర్కొంది. దీంతో పోలీసులు ఆ దిశ‌గా విచార‌ణ చేసి.. స‌ర్జు మ‌క్ర‌మ్‌ను అదుపులోకి తీసుకుని ప్ర‌శ్నించ‌డంతో విష‌యం బ‌య‌ట‌ప‌డింది. ప్రియురాలు త‌న‌కు ద‌క్క‌లేద‌న్న అక్క‌సుతో  తానే హోం థియేట‌ర్‌లో బాంబు పెట్టిన‌ట్టు తెలిపాడు.

ఇద్ద‌రినీ లేపేయాల‌ని..

నిందితుడు మ‌క్ర‌మ్‌.. బిర్సా ప్రాంతంలో ఆటో మెకానిక్‌గా ప‌నిచేస్తున్నాడు. అయితే, దీనికి ముందు 2015-16 మ‌ధ్య కాలంలో స్టోన్ క్ర‌ష‌ర్ ప్లాంట్ లో ప‌నిచేసేశాడు. ఆ స‌మ‌యంలో అత‌ను బాంబులు త‌యారు చేయ‌డం నేర్చుకున్నాడు. త‌న‌ను ప్రేమించిన యువ‌తి.. త‌ర్వాత‌.. త‌న‌ను వ‌దిలివేయ‌డంతో క‌క్ష పెంచుకున్నాడు. ఈ క్ర‌మంలోనే ఏప్రిల్ 1న రిసెప్ష‌న్ రోజు.. చామ‌రి ప్రాంతానికి చేరుకుని సోనీ కంపెనీకి చెందిన హోం థియేట‌ర్‌ను బ‌హుమ‌తిగా అందించాడు.

అయితే.. దీనిలో పెట్రోల్ స‌హా గ‌న్ పౌడ‌ర్‌తో త‌యారు చేసిన రెండు కిలోల బాంబును అమ‌ర్చాడు. హోం థియేట‌ర్‌కు క‌నెక్ష‌న్ ఇవ్వ‌గానే పేలిపోయేలా.. ఆయ‌న మార్పులు చేశాడు. గ‌తంలో ప‌నిచేసిన చోట నుంచి తెచ్చుకున్న అమ్మోనియ‌మ్ నైట్రేట్‌ను కూడా.. త‌న ద‌గ్గ‌ర ఉంచుకున్నాడు.  వాస్త‌వానికి వ‌ధూవ‌రులు ఇద్ద‌రినీ చంపేయాల‌ని మ‌క్ర‌మ్ కుట్ర ప‌న్నిన‌ట్టు పోలీసులు తెలిపారు.  నిందితుడిపై 302 సెక్ష‌న్ కింద హ‌త్యానేరం మోపిన‌ట్టు పోలీసులు తెలిపారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News