దొంగ‌త‌నానికి వెళ్లి.. ఏసీ వేసుకొని హాయిగా నిద్ర‌పోయాడు..!

Update: 2021-03-28 23:30 GMT
కుందేలు.. తాబేలు ప‌రుగు పందెం క‌థ‌ను మ‌రోసారి గుర్తు చేసుకోవాల్సిన సంద‌ర్భం ఇది. అచ్చం ఈ క‌థ‌లోని కుందేలు మాదిరిగా.. ఓ దొంగ ఆప‌రేష‌న్ స్టార్ట్ చేశాడు. సెల‌క్ట్ చేసుకున్న‌ ఇంట్లోకి ప్ర‌వేశించాడు. ఎంట్రీ చ‌క్క‌గానే  జరిగింది. ఓ గ‌దిలోకి వెళ్లి చూస్తే.. అందులో ఎవ్వ‌రూ లేరు. స‌ర్దేయాల్సిన వ‌స్తువుల లిస్టు చూసుకుంటుండ‌గా.. అత‌ని కొంప ముంచే ప్ర‌కృతి విప‌త్తు ఒక‌టి జ‌రిగింది.

ఆ గ‌దిలో ఏసీ గాలి చ‌ల్ల‌గా ఈ చోరుడి మేను సోకింది. ఆహా.. ఏమిటీ మ‌హ‌త్తు అని ఆస్వాదించాడు. ఈ జ‌గ‌త్తునే మైమ‌రిపించే ఈ చ‌ల్ల‌ద‌నంలో కాసేపు విశ్రాంతి తీసుకుంటే ఎంత బాగుంటుందీ.. అనుకున్నాడు. దొంగ‌త‌నం కంప్లీట్ చేయ‌డానికి అబ్బో.. చాలా టైం ఉంది అనుకొని బెడ్ మీద కూర్చున్నాడు. దాని సిగ‌త‌ర‌గ అది ప‌ట్ట‌పు రాణీ ప‌ట్టుప‌రుపులా మెత్త‌గా త‌గిలిన‌ట్టుంది. అలా దానిపై జారుపుకున్నాడు.. ఆ వెంట‌నే నిద్ర‌లోకి కూడా..!

సీన్ క‌ట్ చేస్తే.. సూరీడు కొండ‌ల్లోంచి నెత్తిమీద‌కు రాబోతున్నాడు. నిద్ర‌లేచిన ఇంటిపెద్ద‌.. అటుగా వ‌చ్చి చూస్తే.. గ‌ది త‌లుపు తెరిచి ఉంది. అది త‌న కూతురు ప్ర‌త్యేక గ‌ది. య‌దృశ్చిక సంఘ‌ట‌న‌ ఏమంటే.. ఆమె ఆ ముందు రోజే ఊరు వెళ్లింది. అదేంటీ.. రాత్రే వ‌చ్చేసిందా అనుకుంటూ.. ఇప్ప‌టి దాకా ప‌డుకుందేంటీ.. అనుకుంటూ వెళ్లి నిండుగా క‌ప్పుకున్న దుప్ప‌టి తీశాడు.

గుండె ఆగినంత ప‌నైంది అత‌నికి. ఆ వెంట‌నే విష‌యం అర్థ‌మైపోయింది. ఆ దొంగ గారు నిద్ర‌మ‌త్తులో ఉండ‌గానే వెళ్లి త‌లుపు వేశాడు. గొళ్లెం కూడా పెట్టేసి.. పోలీసుల‌కు ఫోన్ కొట్టాడు. రంగంలోకి దిగిన ర‌క్ష‌క‌భ‌టులు.. ఎవ‌రు మీరూ..? అని అడిగారు. మా పేరు అతిట్ కిన్ కుంతుబ్ అని సెల‌విచ్చారు. ఇక్క‌డికెందు వ‌చ్చారు? అని ప్ర‌శ్నించ‌గా.. తాను (చోర‌) క‌ళాకారుడిన‌ని ప్ర‌క‌టించారు. ప్ర‌ద‌ర్శ‌న పూర్తికాగానే వెళ్ల‌కుండా.. ఇక్క‌డెందుకు శ‌య‌నించారు? అని అడ‌గ్గా.. చ‌ల్ల‌టి గాలి మ‌మ్ముల మోసం చేసింద‌ని ఆవేద‌న వ్య‌క్తంచేశారు. అటుల‌నా.. అయిన‌చో తాము న్యాయం చేసెద‌ము ర‌మ్ము అంటూ వెంట‌ తీసుకెళ్లినారు. ఇదంతా జ‌రిగింది థాయ్ లాండ్ లోని ఫెట్చ‌బూన్ ప్రావిన్స్ లోని ఓ ఇంట్లో!
Tags:    

Similar News