భారతరత్న పురస్కార గ్రహీతలకు కలిగే ప్రయోజనాలేంటి..!

Update: 2023-01-03 15:30 GMT
ఏదైనా రంగంలో విశేషంగా కృషి చేసిన వారికి భారతదేశం తరఫున అందించే అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న. ఈ అవార్డును 1954 జనవరి 2న అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఆవిష్కరించారు. స్వతంత్ర భారత దేశంలో తొలి అవార్డును డాక్టర్ సి. రాజగోపాలాచారి.. మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్.. శాస్త్రవేత్త డా.చంద్రశేఖర వెంకట రామన్‌లకు దక్కింది.

ఈ అవార్డును 1954లో కేవలం జీవించి ఉండే వారికి ఇచ్చేవారు. అయితే ఆ తర్వాత 1955 నుంచి మరణానంతరం కూడా అవార్డు ఇస్తామని కేంద్రం ప్రకటించింది. ఈ అవార్డును దక్కించుకున్న వారిలో మేధావులు.. శాస్త్రవేత్తలు.. వ్యాపార వేత్తలు.. రచయితలు.. సామాజిక ఉద్యమకారులు.. రాజకీయ నాయకులు.. కళాకారులు ఉన్నారు.

కేంద్రం భారత గెజిట్‌ నోటిఫికేషన్ ద్వారా సదరు వ్యక్తికి భారతరత్న అవార్డు ఇస్తున్నట్లు ప్రకటిస్తుంది. ఈ అవార్డును జనవరి 26న భారత గణతంత్ర దినోత్సవం రోజున అందజేస్తారు. ఒక ఏడాదిలో గరిష్టంగా ముగ్గురికి మాత్రమే ఈ అవార్డును అందజేస్తారు. ఎలాంటి జాతి.. మతం.. లింగ బేధం లేకుండా అవార్డు కోసం గ్రహీతలను ఎంపిక చేసి రాష్ట్రపతికి పంపిస్తారు.

ఇప్పటి వరకు 48 మందికి భారత రత్న పురస్కారం దక్కింది. చివరిసారిగా 2019లో సామాజిక సేవకుడు నానాజీ దేశ్‌ముఖ్ (మరణానంతరం).. కళాకారుడు డాక్టర్ భూపెన్ హజారికా (మరణానంతరం).. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీలకు ప్రదానం చేశారు. ఈ అవార్డు కింద గ్రహీతలకు ఒక సర్టిఫికేట్.. ఒక మెడల్‌ను కేంద్రం ఇస్తుంది. ఎలాంటి నగదు ప్రోత్సాహకాలు అందజేయరు.

కానీ అవార్డు గ్రహీతలకు ప్రభుత్వం నుంచి కొన్ని సదుపాయాలు వర్తిస్తాయి. రైల్వేల్లో ఉచిత ప్రయాణం..  ప్రధాన ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానం దక్కుతుంది. ప్రోటోకాల్లోనూ భారతరత్న అవార్డు గ్రహీతలకు స్థానం కల్పిస్తారు. ఇతర రాష్ట్రాల్లోనూ వీరికి ప్రాధాన్యం దక్కుతుంది. అయితే దీనిని పేరుకు ముందు పెట్టుకోవడానికి వీల్లేదు. తమ రెస్యూమ్.. లెటర్‌హెడ్.. విజిటింగ్ కార్డుల్లో వాడుకోవచ్చు.

2013లో తొలిసారి క్రీడాకారులకు సైతం భారత రత్న ఇవ్వబోతున్నట్లు కేంద్రం ప్రకటించింది. 2014లో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు ఈ అవార్డు దక్కింది. మదర్ థెరెసా(1980) లాంటి భారతీయేతరులకు కూడా ఈ అవార్డును ఇచ్చారు. పాకిస్తాన్‌లో జన్మించిన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్‌.. దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలాకి భారత రత్నను కేంద్రం ప్రదానం చేసింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News