రిమోట్‌ ఓటింగ్‌ మెషీన్లు అంటే ఏమిటి.. వీటిపై ప్రధాన అభ్యంతరాలు ఇవేనా?

Update: 2023-01-21 16:30 GMT
ఓటరు దేశంలో ఎక్కడ నుంచైనా ఓటు వెయ్యడానికి వీలు కల్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం విప్లవాత్మక మార్పులకి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.  రిమోట్‌ ఓటింగ్‌ మెషీన్లు(ఆర్‌వీఎం)ను ప్రవేశపెడతామని ప్రకటించింది. ఈ ఆర్‌వీఎంలపై ప్రతిపక్షాలు పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్‌వీఎంల అంశం హాట్‌ టాపిక్‌ గా మారింది.

తామున్న ప్రాంతం నుంచి ఓటర్లు తమ ఓటు ఉన్న చోటుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా తామున్న ప్రాంతం నుంచే ఆర్‌వీఎం ద్వారా తమ నియోజకవర్గం అభ్యర్థిని ఎన్నుకోవచ్చు. ఆర్‌వీఎంల పనితీరును చూపేందుకు కేంద్ర ఎన్నికల సంఘం జనవరి 16న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో రిమోట్‌ ఓటింగ్‌ మెషీన్లను కాంగ్రెస్‌ సహా 13 పార్టీలు  తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే.

ఇప్పటికే ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు (ఈవీఎం) పై తమకు అనేక సందేహాలున్నాయని.. అవే ఇంతవరకు తీరలేదని ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ సమయంలో ఈ కొత్త ప్రక్రియకు తెరతీసి ఓటింగ్‌ వ్యవస్థను గందరగోళం చేస్తున్నారని మండిపడుతున్నాయి.

కాంగ్రెస్, ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే), తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ), ఆమ్‌ ఆద్మీ పార్టీ, జనతాదళ్‌ (యూ), శివసేన (ఉద్ధవ్‌ వర్గం), నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ), సీపీఎం ఆర్‌వీఎంలకు వ్యతిరేకంగా ఉండడంతో నమూనా ఆర్‌వీఎంల ప్రదర్శన జరగలేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆర్‌వీఎంలపై అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయం తెలుసుకోవడానికి ఫిబ్రవరి 28 వరకు గడువు పెంచింది.

వివిధ పనుల కోసం తమ సొంత ఊళ్ల నుంచి వలస వెళ్లిన ఓటర్లలో మూడో వంతు మంది ఎన్నికల్లో తమ ఓటు హక్కుని వినియోగించుకోవడం లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో 2019 లోక్‌సభ ఎన్నికల్లో 67.4 శాతం మాత్రమే ఓటింగ్‌ నమోదైంది. దాదాపుగా 30 కోట్ల మంది ఓటింగ్‌కు దూరంగా ఉండటం గమనార్హం. ఉన్న చోటు నుంచి సొంతూరికి వెళ్లే అవకాశం లేకపోవడం, ఓటర్ల జాబితాలో పేరు లేకపోవడం వంటి ఎన్నో కారణాలతో వారు ఓటు వెయ్యడం లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం.. రిమోట్‌ ఓటింగ్‌ మెషీన్‌ విధానానికి తెరతీసింది.

కాగా ఆర్‌వీఎం విధానం ప్రకారం.. ఇతర ప్రాంతాల్లో ఉన్న వలస ఓటర్లు తమ నియోజకవర్గంలో ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత తాము ఏ ప్రాంతం నుంచి ఓటు హక్కు వినియోగించుకోవాలనుకుంటారో రిజిస్టర్‌ చేసుకోవాలి. అలా రిజిస్టర్‌ చేసుకున్న వారిని రిమోట్‌ ఓటర్లు అని అంటారు. తమ ప్రాంతంలో ఉన్న రిమోట్‌ పోలింగ్‌ బూత్‌కు వెళితే ఆ ఓటరు నియోజకవర్గం వివరాలను కానిస్టిట్యూయెన్సీ కార్డ్‌ రీడర్‌ (సీసీఆర్‌) ద్వారా స్కాన్‌ చేసి గుర్తిస్తారని చెబుతున్నారు.

అప్పుడు ఆర్‌వీఎం మెషీన్ల్లపై ఆ నియోజకవర్గానికి సంబంధించిన బ్యాలెట్‌ పత్రం డిస్‌ప్లే అవుతుంది. తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేస్తే ఓటు నమోదైనట్టుగా వీవీప్యాట్‌ స్లిప్‌ వస్తుంది.

కాగా ఆర్‌వీఎంలపై ప్రతిపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈవీఎంల పని తీరుపైనే సవాలక్ష సందేహాలున్న ప్రస్తుత పరిస్థితుల్లో అదే నమూనాలో రూపొందించిన ఆర్‌వీఎంలతో ఒనగూరే ప్రయోజనం ఏమీ ఉండదని అంటున్నాయి, అలాగే ప్రాంతీయ పార్టీలకు, చిన్న పార్టీలకు ఈ వ్యవస్థ ఏ మాత్రం అనుకూలం కాదని అంటున్నారు,

అదేవిధంగా ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు వేరే రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమల్లో ఉండకపోవడం వల్ల అక్కడ ఉండే వలస ఓటర్లని రాజకీయ పార్టీలు సులభంగా ప్రలోభ పెట్టొచ్చని ప్రతిపక్షాలు చెబుతున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News