ఐఐటీ విద్యార్థులకు చంద్రబాబు ఏం చెప్పారు?

Update: 2020-11-02 05:30 GMT
వారంతా ఐఐటీ విద్యార్థులు. దేశ వ్యాప్తంగా పలు రంగాలకు చెందిన ప్రముఖుల చేత స్పీచులు ఇప్పిస్తుంటారు. సాధారణంగా ఇలాంటి అవకాశం లభించినప్పుడు.. వారిని ఉత్తేజపర్చటం.. విలువైన సూచనలు చేయటంతో పాటు.. తమ అనుభవాల్ని చెప్పటం.. ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్యార్థులకు ఎదురయ్యే సవాళ్లను ఎలా డీల్ చేయాలో చెప్పటం బాగుంటుంది. అందుకు భిన్నంగా దొరికిందే సందు అన్న రీతిలో క్లాస్ పీకే పని చేయరు.
తాజాగా ముంబయి ఐఐటీ విద్యార్థుల కోసం నిర్వహించిన గ్లోబల్ లీడర్ షిప్ సమ్మిట్ లో భాగంగా వెబినార్ ద్వారా టీడీపీ అధినేత.. ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు చేత మాట్లాడించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు చురుకు పుట్టించేలా ఉన్నాయని చెబుతున్నారు. గతంలో 2020 గురించి తరచూ ప్రస్తావించే చంద్రబాబు.. తాజాగా 2050 గురించి ప్రస్తావించటం గమనార్హం.

ఫ్యూచర్ మీద ఆశలతో 2050ను టార్గెట్ గా పెట్టుకోవాలని.. అందుకు తగ్గట్లే మెగా మైండ్ సెట్ మార్చుకోవాలన్నారు. తన నేపథ్యం గురించి ప్రస్తావిస్తూ.. రోడ్లు.. కరెంటు కూడా లేని 20 ఇళ్లు ఉన్న చిన్న గ్రామంలో తాను పుట్టినట్లుగా చెప్పారు. అలాంటి తాను ముఖ్యమంత్రిని అయినప్పుడు.. ఇప్పటి ఐఐటీ విద్యార్థులు ఫ్యూచర్ లో ఎందుకు ఎదగలేరని ప్రశ్నించారు.

శ్రమించటం.. పట్టుదలతో పని చేయటమే అన్నింటికన్నా ముఖ్యమన్న ఆయన.. సమస్యలు.. సంక్షోభాలను చూసి ఎవరూ భయపడొద్దన్నారు. ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా ఎలా మలచుకోవాలో ఓపిగ్గా ఆలోచించాలన్న ఆయన.. తాను చేయాల్సిన పనుల్ని.. విద్యార్థుల్ని చేయాలని చెప్పటం గమనార్హం. ఎప్పటిలానే తన గురించి గొప్పలు చెప్పుకున్న బాబు.. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ పరిస్థితి.. తాను సీఎంగా ఏం చేసింది చెప్పారు.

ఏదైనా సాధించాలంటే విజన్ అవసరమని.. దాన్ని సొంతం చేసుకోవటానికి కార్యాచరణ తప్పనిసరి అని చెప్పారు. టార్గెట్ పెట్టుకొని.. ప్లాన్ చేసుకుంటే సరిపోదని.. అంతకు రెట్టింపు కష్టపడినప్పుడు మాత్రమే అనుకున్నది సాధించగలుగుతామన్నారు. మనం ఒక్కళ్లమే కష్టపడటం కాకుండా టీంలా మారి అందరూకలిసి వెళితే మంచి ఫలితాలు వస్తాయన్నారు. రానున్న భవిష్యత్తు మొత్తం కాలుష్య రహిత అంశాలకే ఉంటుందన్న ఆయన.. కాలుష్య రహిత సాంకేతికతకు పెద్ద పీట వేసిన వారిదే ఫ్యూచర్ అని చెప్పారు.
Tags:    

Similar News