లిక్కర్ స్కాంలో మాజీ ఆడిటర్ బుచ్చిబాబు చెప్పిందేమిటి?

Update: 2023-03-11 12:33 GMT
సంచలనంగా మారటంతో పాటు.. రాజకీయ ప్రకంపనలకు కారణమైన ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించిన ఈ రోజు (మార్చి 11) అత్యంత కీలకంగా మారనుంది. రాజకీయ దురుద్దేశాలతోనే తనను ఈ స్కాంలో ఇరికించినట్లుగా కవిత్ అండ్ కో చెబుతున్న విషయం తెలిసిందే.

లిక్కర్ స్కాంలో ఆమెను ఇక్కడి వరకు తీసుకొచ్చింది ఎవరు? ఎవరి మాటలు ఆమెను ఈ స్కాంలో ఇరుకునపేడలా చేశాయి? అరెస్టు చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నట్లుగా వార్తలు వస్తున్న వేళ.. కవిత అరెస్టుకు ఎవరు కీలకం అయ్యారు? ఎవరి వాంగ్మూలం ఆమెను ఈ స్కాంలో ఉచ్చు బిగిసేలా చేశాయి? లాంటి ఎన్నో ప్రశ్నలు తలెత్తే పరిస్థితి. వీటికి సమాధానాలు వెతికితే.. మాజీ ఆడిటర్ బుచ్చిబాబు వాంగ్మూలంగా చెప్పాలి.

తమ కంపెనీలకు బినామీ ఎమ్మెల్సీ కవిత అంటూ పిళ్లై తన వాంగ్మూలంలో ప్రకటించటం ఒక ఎత్తు అయితే.. దాన్ని తర్వాతి దశకు తీసుకెళ్లేందుకు మాజీ ఆడిటర్ బుచ్చిబాబు కారణమని చెబుతున్నారు. మద్యం స్కాంలో కవిత పాత్రపై బుచ్చిబాబు ఏం చెప్పారు? అన్న విషయాన్ని చూస్తే.. ఆయన వాంగ్మూలంలో పలు కీలక అంశాలు కనిపిస్తాయి. అందులో ముఖ్యమైనవి చూస్తే..

-  ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్.. ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాలతో ఎమ్మెల్సీ కవితకు రాజకీయ అవగాహన ఉంది. వారి ప్రతినిధి విజయ్ నాయర్. ఆయన ఆమెను కలుసుకున్నారు. లిక్కర్ పాలసీని ఆప్ నేతల తరఫున నాయర్ రూపొందించారు. కొత్త విధానంలో చేసే మార్పుల్ని మేడంకు (కవిత)వివరించారు. ఆప్ కు నిధులు సమకూరిస్తే.. లిక్కర్ పాలసీలో చేసే మార్పులతో తాము ఏ విధంగా ప్రయోజనం చేకూరుస్తామన్న విషయాన్ని మేడంకు విజయ్ నాయర్ చెప్పారు.

-  2021 ఆగస్టు 17న ఒక వాట్సాప్ సందేశంలో 'వియ్ నీడ్స్ మనీ' అన్న దానికి అర్థం.. విజయ్ నాయర్ కు డబ్బులు అవసరమని. 2021 ఆగస్టు 24న మాగుంట రాఘవరెడ్డికి వాట్సాప్ మెసేజ్ ఒకటి వచ్చింది. అందులో సమీర్ కు 33.. మీకు 33.. మేడమ్ కు 33 కోసం ప్రయత్నిస్తానని ఉంది. అంటే అర్థం సమీర్ కు 33 శాతం.. మాగుంట రాఘవరెడ్డికి 33 శాతం.. మేడంకు 33 శాతం.. (అంటే కవితకు) ఆప్ నేతలతో కుదిరిన ఒప్పందాల్లో భాగంగా కవితకు సమీర్ కంపెనీలు భాగస్వామ్యం.. పెర్నార్డ్ రికార్డ్ పంపిణీలో వాటా కల్పించారు.

బుచ్చిబాబు వాంగ్మూలంతో పాటు తమ విచారణలో వెలుగు చూసిన విషయాల్ని ఈడీ తన రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. దీని ప్రకారం.. హవాలా మార్గంలో రూ.100 కోట్లు ముడుపుల్ని హవాలా మార్గంలో చెల్లింపులు జరిపారు. ఢిల్లీ కొత్త మద్యం విధానాన్ని మంత్రివర్గ సమావేశంలో చర్చించటానికి రెండు రోజుల ముందే సిగ్నల్ యాప్ ద్వారా విజయ్ నాయకర్ మాజీ ఆడిటర్ బుచ్చిబాబుకు అందజేసినట్లుగా పేర్కొన్నారు. ఇదంతా చూసినప్పుడు మేడం కు కష్టాలు ఖాయమన్న వాదన వినిపిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News