దుబ్బాకలో కేసీఆర్ చేయించిన తాజా సర్వే ఏం చెప్పింది?

Update: 2020-10-11 09:30 GMT
గతంలో ఎన్నికలకు కాస్త ముందు ప్రజల మైండ్ సెట్ ఏ రీతిలో ఉంది? అన్న విషయంపై సర్వేలు నిర్వహించే తీరు తెలిసిందే. కొన్ని దశాబ్దాల క్రితం నిఘా వర్గాలు ఇచ్చిన రిపోర్టును ప్రభుత్వం నమ్మేది. తర్వాతి రోజుల్లో చోటు చేసుకుంటున్న మార్పుల కారణంగా.. నిఘా రిపోర్టును ఒకవైపు.. తాము సొంతంగా వివిధ ప్రైవేటు ఏజెన్సీల ద్వారా సర్వేలు నిర్వహించటం పెరిగింది.

అది కూడా ఒకట్రెండు నుంచి నాలుగైదు పైనే సర్వేలు నిర్వహించటం.. వారిచ్చే రిపోర్టుల్లోని కామన్ అంశాలు ఏమున్నాయి? ఎవరి అబ్జర్వేషన్ ఏమిటి? అన్న వివరాల్ని రివ్యూ చేసుకొని తుది నిర్ణయానికి రావటం ఈ మధ్యన ఒక అలవాటుగా మారింది. ఈ విషయాల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మహా హుషారుగా వ్యవహరిస్తారని చెబుతారు.

తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో త్వరలో జరిగే దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధించి తాను చేయించిన సర్వేలకు సంబంధించిన అంశాల్ని సీఎం కేసీఆర్ వెల్లడించినట్లుగా తెలుస్తోంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాత మంచి మెజార్టీతో గెలవనున్నట్లుగా చెప్పారు. తాముచేయించిన తాజా సర్వేల్లో 74 శాతం మంది టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నట్లుగా తెలుస్తుందన్నారు.

దుబ్బాక ఉప ఎన్నికలోనే కాదు.. గ్రేటర్ ఎన్నికల్లోనూ వందకు పైగా స్థానాల్ని సొంతం చేసుకోనున్నట్లు చెప్పిన కేసీఆర్ త్వరలో జరిగే పట్టభద్రుల స్థానాలకు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులు గెలవనున్నట్లు చెప్పారు. విపక్షాలు ఏమీ టీఆర్ఎస్ పార్టీకి దరిదాపుల్లో కూడా లేవన్న ధీమాను వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. సీఎం కేసీఆర్ మాటల్ని చూస్తే.. తెలంగాణలో తమకు తిరుగులేదని.. తమను ఢీ కొట్టే విపక్షం లేదన్న విషయాన్ని ధీమాగా చెప్పినట్లుగా చెబుతున్నారు. మరి.. కేసీఆర్ సర్వే రిపోర్టులకు తగ్గట్లే.. ఎన్నికల ఫలితాలు ఏ మేరకు వస్తాయో కాలమే చెప్పాలి.
Tags:    

Similar News