కొడాలికి తెలీకుండానే గుడివాడలో ఇంత జరిగిందా ?

Update: 2021-01-06 15:30 GMT
గుడివాడ నియోజకవర్గం ఇపుడు రెండు రోజులుగా వివాదాలకు కేంద్రంగా నిలిచింది. గుడివాడ అంటే మంత్రి కొడాలి నాని నియోజకవర్గం అన్న విషయం అందరికీ తెలిసిందే. నాలుగురోజుల క్రితం గుడివాడలో స్పెషల్ ఎన్ఫోర్స్ మెంటు బ్యూరో+రెగ్యులర్ పోలీసులు దాడులు జరిపి పేకాటరాయళ్ళను పట్టుకోవటం సంచలనంగా మారింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంతచిన్న డెవలప్మెంట్ జరిగినా బూతద్దంలో పెట్టి చాలా పెద్దదిగా చేసేసేందుకు టీడీపీ రెడీగా ఉంటుంది కదా. ఇపుడు జరుగుతున్నది కూడా అదే.

గుడివాడలో పేకాటస్ధావరంపై దాడులు చేయటం కొందరిని పట్టుకోవటం వివాదాలకు మూలమైంది. ఎందుకంటే దాని నిర్వాహకుడు మురళి మంత్రికి అత్యంత సన్నిహితుడట. అందుకనే మంత్రిని వెంటనే బర్తరఫ్ చేసేయాలంటు మాజీమంత్రి దేవినేని డిమాండ్ మొదలుపెట్టేశారు. నిజానికి ఇటువంటి పేకాట క్లబ్బులు టీడీపీ హయాంలో వందలు దిగ్విజయంగా నడిచాయి. అయినా దేవినేని గుడివాడ ఘటనను పెద్దది చేసేస్తున్నారు.

సరే వీళ్ళ ఆరోపణలు, ప్రత్యారోపణలను పక్కన పెట్టేద్దాం. నిజంగానే కొడాలికి అంత సన్నిహితుడే పేకాటక్లబ్బును నిర్వహిస్తుంటే మరి పోలీసులు ఎలా దాడి చేయగలిగారు ? పోలీసులు దాడి చేసే విషయం మంత్రికి తెలీకుండానే జరిగిందా ? ఇపుడిదే విషయంపై నియోజకవర్గం+పార్టీలో చర్చ జరుగుతోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పేకాటక్లబ్బుపై దాడులు చేసిందంతా పక్క జిల్లాల పోలీసులేనట.

స్పెషల్ ఎన్ఫోర్స్ మెంటు అధికారులు సరే మరి రెగ్యులర్ పోలీసులను పక్కజిల్లా నుండి ఎందుకు తెప్పించినట్లు ? గుడివాడలోనో లేకపోతే జిల్లాలోనో పోలీసులు లేరా ? వాళ్ళు దాడులు చేయలేరా.  లేకపోతే వాళ్ళపై ఉన్నతాధికారుల్లో నమ్మకం లేదా ? అంటే మంత్రికి కూడా తెలీకుండానే పక్క జిల్లా పోలీసులతో దాడులు చేయించేంత ధైర్యం ఎవరుచేశారన్నదే ఇపుడు చర్చ జరుగుతోంది. ఒకవేళ పక్కజిల్లా పోలీసులతో దాడులు చేయించారంటే అందుకు ఉన్నతస్ధాయిలోని అధికారుల అనుమతులు అవసరం.

అంటే మంత్రికి కూడా తెలీకూడదనే పక్కజిల్లాలోని పోలీసులతో దాడులు చేయించారంటే కొడాలికి తెలీకుండానే జరిగిపోయిందని అర్ధమైపోతోంది. మరి కొడాలికి కూడా తెలీకుండానే పక్కజిల్లా పోలీసులతో దాడులు చేయించే నిర్ణయాన్ని ఎవరు తీసుకునుంటారు ? ఇపుడిదే సస్పెన్సుగా మారిపోయింది. అందుకనే పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
Tags:    

Similar News