కేసీయార్ కు ఏమైంది ?

Update: 2023-07-10 10:11 GMT
ఇపుడీ విషయమే ఎవరికీ అర్ధంకావటంలేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హనుమకొండకు నరేంద్రమోడీ వచ్చారు వెళ్ళిపోయారు. కొన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలకు హాజరై శంకుస్ధాపనలు చేసిన తర్వాత జరిగిన బహిరంగసభలో డైరెక్టుగా కేసీయార్ కుటుంబాన్ని ఎటాక్ చేశారు. కేసీయార్ పైన అవినీతిఆరోపణలు, విమర్శలు చేసి వెళ్ళిపోయారు. అదే సభలో కేంద్రమంత్రి, కొత్త అధ్యక్షుడు కిషన్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఆరోపణలు చేశారు. సరే వీళ్ళారోపణలంటే ఎప్పుడూ ఉండేవే. కానీ మోడీ చేసిన ఆరోపణల మాటేమిటి ?

ఇక్కడ విషయం ఏమిటంటే మోడీ ఆరోపణలు చేసి రెండు రోజులు అవుతున్నా కేసీయార్ వై పునుండి కనీసం ఒక్క ప్రెస్ రిలీజ్ కూడా లేదు. మామూలుగా అయితే ప్రత్యర్ధులపై గంటల సేపు మీడియా సమావేశాలుపెట్టి విరుచుకుపడిపోతుంటారు.

గతంలో ఎన్నోసార్లు నేరుగా మోడీపైనే కేసీయార్ ఆరోపణలు, విమర్శలు చేసిన ఘటనలున్నాయి. మరి ఇపుడు మాత్రం ఎందుకని నోరిప్పలేకపోతున్నారు. తనపైన మోడీ ఆరోపణలు, విమర్శలు చేసినపుడు దానికి  సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత కేసీయార్ మీదుంది.

అలాంటిది తాను నోరెత్తకుండా ఆ బాధ్యతలను మంత్రులపైన ఉంచటమే విచిత్రంగా ఉంది. తాను మాట్లాడకుండా మంత్రులతో మాట్లాడించటం వల్ల జనాల్లో నెగిటివ్ సంకేతాలు వెళతాయని కేసీయార్ కు తెలీదా ? ఇపుడు కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారు మోడీ ఆరోపణలకు సమాధానం చెప్పటానికే కేసీయార్ భయపడిపోతున్నారని పదేపదే అంటున్నారు. కేసీయార్ ఎందుకు భయపడుతున్నట్లు ? ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తన కూతురు కవితను ఈడీ ఎక్కడ అరెస్టు చేస్తుందో అని భయపడుతున్నారని రేవంత్ రెడ్డి అండ్ కో పదేపదే ఆరోపిస్తున్నారు.

మోడీ-కేసీయార్ మధ్య లోపాయికారీ ఒప్పందం జరిగిందనటానికి ఇంతకుమించిన ఉదాహరణలు ఏమికావాలని నిలదీస్తున్నారు. జనాల్లో కూడా బీజేపీ-బీఆర్ఎస్ ఒకటే అనే అభిప్రాయం పెరిగిపోతోంది. కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలు, కారణాలతో ఏకీభవిస్తున్నట్లే ఉన్నారు.

దీన్ని ఇటు బీజేపీ అటు బీఆర్ఎస్ నేతలు సమర్ధవంతంగా తిప్పికొట్టలేకపోతున్నారు. ఇప్పటికే ఇందులో నుండి ఎలా బయటపడాలో అర్ధంకాక అవస్తలు పడుతున్న రెండు పార్టీల నేతలకు తాజాగా మోడీ హనుమకొండ పర్యటన మరింత చికాకులను తెచ్చిపెట్టిందనటంలో సందేహంలేదు.

Similar News